EPF: పీఎఫ్ అకౌంట్‌లో క‌చ్చితంగా 25 శాతం డ‌బ్బు ఉండాల‌ని రూల్ ఎందుకు.? దీంతో ఉద్యోగుల‌కు ఏంటి లాభం.?

EPF ఉద్యోగుల భవిష్యత్ ఆర్థిక భద్రతను మరింత బలోపేతం చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఈపీఎఫ్ స్కీమ్ 2026లో కీలక మార్పులు చేసింది.

Mokshith
Published on: 21 July 2026 1:09 PM IST
EPF
X

 EPF: పీఎఫ్ అకౌంట్‌లో క‌చ్చితంగా 25 శాతం డ‌బ్బు ఉండాల‌ని రూల్ ఎందుకు.? దీంతో ఉద్యోగుల‌కు ఏంటి లాభం.?

EPF: ఉద్యోగుల భవిష్యత్ ఆర్థిక భద్రతను మరింత బలోపేతం చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఈపీఎఫ్ స్కీమ్ 2026లో కీలక మార్పులు చేసింది. ఉద్యోగంలో ఉన్న సమయంలో పీఎఫ్ (PF) ఖాతా నుంచి డబ్బు తీసుకునే ఉద్యోగులు ఇకపై తమ ఖాతాలో కనీసం 25 శాతం మొత్తం తప్పనిసరిగా ఉంచాలి. దీని వెన‌కాల అస‌లు ఉద్దేశం ఏంటంటే.?

పీఎఫ్ విత్‌డ్రా నిబంధనల్లో కీలక మార్పు

ఇప్పటి వరకు ఉద్యోగులు EPFO నిబంధనల ప్రకారం అవసరాన్ని బట్టి పీఎఫ్ ఖాతా నుంచి డబ్బు తీసుకునేవారు. అయితే EPF Scheme 2026 అమల్లోకి వచ్చిన తర్వాత ఉద్యోగంలో ఉన్న సమయంలో పాక్షికంగా (Partial Withdrawal) డబ్బు తీసుకుంటే, ఖాతాలోని మొత్తం బ్యాలెన్స్‌లో 25 శాతం తప్పనిసరిగా అలాగే ఉంచాలి. ఈ కొత్త నిబంధన కోడ్ ఆన్ సోష‌ల్ సెక్యూరిటీ, 2020లో భాగంగా తీసుకొచ్చారు. ఉద్యోగులు తరచూ పీఎఫ్ నుంచి డబ్బు తీసుకోవడం వల్ల రిటైర్మెంట్ సమయానికి పొదుపు పూర్తిగా తగ్గిపోకుండా ఉండటమే దీని లక్ష్యం.

కొత్తగా తీసుకొచ్చిన రెండు ముఖ్యమైన పదాలు

ఈ పథకంలో మినిమ‌మ్ బ్యాలెన్స్‌, ఎలిజిబుల్ మెంబ‌ర్ బ్యాలెన్స్ అనే రెండు కొత్త ప‌దాల‌న ప‌రిచ‌యం చేశారు. మినిమమ్ బ్యాలెన్స్ అంటే ఉద్యోగి పీఎఫ్ ఖాతాలోని మొత్తం సొమ్ములో 25 శాతం మొత్తం ఎప్పటికీ ఖాతాలో ఉండాలి. ఇందులో ఉద్యోగి చెల్లించిన వాటా, యజమాని (కంపెనీ) చెల్లించిన వాటా, వడ్డీ మొత్తం కూడా కలిపి ఉంటుంది. ఇక ఎలిజిబుల్ మెంబర్ బ్యాలెన్స్ విష‌యానికొస్తే.. 25 శాతం మొత్తాన్ని ఖాతాలో ఉంచిన తర్వాత మిగిలిన మొత్తాన్ని మాత్రమే అవసరమైతే ఉద్యోగి ఉపసంహరించుకోవచ్చు.

10 లక్షలు ఉంటే ఎంత వరకు తీసుకోవచ్చు?

ఉదాహరణకు ఒక ఉద్యోగి పీఎఫ్ ఖాతాలో రూ.10 లక్షలు ఉన్నాయని అనుకుందాం. మొత్తం PF బ్యాలెన్స్ రూ.10,00,000 అయితే తప్పనిసరిగా ఖాతాలో ఉంచాల్సిన 25% అంటే రూ.2,50,000. దీంతో ఆ ఉద్యోగి గ‌రిష్టంగా రూ.7,50,000 వ‌ర‌కు తీసుకోవ‌చ్చు. అయితే ఇది ఉద్యోగంలో ఉన్న సమయంలో చేసే పాక్షిక ఉపసంహరణలకు మాత్రమే వర్తిస్తుంది.

ఉద్యోగి రిటైర్ అయినప్పుడు, నిర్దేశిత వయస్సు పూర్తి అయిన త‌ర్వాత‌, లేదా శాశ్వతంగా ఉద్యోగం చేయలేని పరిస్థితి వచ్చినప్పుడు లేదా EPFO పూర్తి ఉపసంహరణకు అనుమతించే ఇతర సందర్భాల్లో మాత్రం ఖాతాలోని మొత్తం సొమ్మును పూర్తిగా తీసుకునే అవకాశం ఉంటుంది. అలాంటి సందర్భాల్లో 25 శాతం బ్యాలెన్స్ ఉంచాలనే నిబంధన వర్తించదు.

ఉద్యోగులకు కలిగే ప్రయోజనాలు

కొత్త EPF నిబంధనలతో ఉపసంహరణ ప్రక్రియ కూడా మరింత సులభమవుతుంది. గతంలో ప్రతి అవసరానికి వేర్వేరు నిబంధనలు ఉండగా, ఇప్పుడు వాటిని సరళీకరించారు. ఈ అవసరాల కోసం ఉద్యోగులు EPFO నిబంధనలకు అనుగుణంగా డబ్బు తీసుకోవచ్చు. ముఖ్యంగా వైద్య చికిత్స, పిల్లల ఉన్నత విద్య, వివాహ ఖర్చులు,

ఇల్లు కొనుగోలు, ఇల్లు నిర్మాణం వంటి స‌మ‌యాల్లో ప్ర‌యోజ‌నం క‌లుగుతుంది. అలాగే రిటైర్మెంట్ సమయానికి తగినంత పొదుపు ఉంటుంది. ఖాతాలో మిగిలిన మొత్తంపై నిరంతరం వడ్డీ లభిస్తుంది. భవిష్యత్తులో ఆర్థిక భద్రత మరింత బలపడుతుంది. అవసరమైన సందర్భాల్లో సులభంగా పీఎఫ్ డబ్బును వినియోగించుకునే అవకాశం ఉంటుంది.

Mokshith

Mokshith

2015లో జ‌ర్న‌లిజం స్కూల్ ద్వారా నా కెరీర్‌ను ప్రారంభించాను. అనంత‌రం 2016 నుంచి ప‌లు మీడియా సంస్థ‌ల్లో ప‌నిచేశాను. మొద‌ట ప్రింట్ ఆ త‌ర్వాత డిజిట‌ల్‌లో క‌లిపి మొత్తం 10 ఏళ్ల అనుభ‌వం ఉంది. నేను ఎక్కువ‌గా లైఫ్‌స్టైల్‌, అంత‌ర్జాతీయం, టెక్నాల‌జీ, బిజినెస్‌, ఆస్ట్రాల‌జీకి సంబంధించి వార్త‌లు రాస్తుంటాను.

Next Story