EPF Vs Mutual Fund: రిటైర్మైంట్ తర్వాత ఏది బెటర్ ఆప్షన్.? ఎందులో పెట్టుబడి పెట్టాలి.?
EPF Vs Mutual Fund: ఉద్యోగం చేస్తున్న చాలా మంది మనసులో ఒక సందేహం ఉంటుంది.
EPF Vs Mutual Fund: రిటైర్మైంట్ తర్వాత ఏది బెటర్ ఆప్షన్.? ఎందులో పెట్టుబడి పెట్టాలి.?
EPF Vs Mutual Fund: ఉద్యోగం చేస్తున్న చాలా మంది మనసులో ఒక సందేహం ఉంటుంది. రిటైర్మెంట్ కోసం EPFలోనే డబ్బు ఉంచడం మంచిదా? లేక మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టాలా? మరి రెండింటిలో ఏది ఉత్తమమో ఇప్పుడు తెలుసుకుందాం.
EPF తప్పనిసరి..
EPF అనేది కేంద్ర ప్రభుత్వం నిర్వహించే సామాజిక భద్రత పథకం. EPF చట్టం వర్తించే సంస్థల్లో పనిచేసే ఉద్యోగులకు ఇందులో చేరడం తప్పనిసరి. ప్రతి నెలా ఉద్యోగితో పాటు కంపెనీ కూడా EPF ఖాతాలో నగదు జమ చేస్తుంది. అయితే మ్యూచువల్ ఫండ్ పూర్తిగా స్వచ్ఛంద పెట్టుబడి విధానం. ఇందులో పెట్టుబడి పెట్టాలా వద్దా అనేది పూర్తిగా పెట్టుబడిదారుడి నిర్ణయం.
దీనిపై ఎలాంటి తప్పనిసరి నిబంధనలు ఉండవు. EPFలో కంపెనీ కూడా డబ్బు జమ చేస్తుంది.. మ్యూచువల్ ఫండ్‌లో ఆ అవకాశం లేదు. EPFలో ఉద్యోగి ప్రాథమిక వేతనంలో 12 శాతం చెల్లిస్తే, కంపెనీ కూడా అంతే మొత్తాన్ని ఖాతాలో జమ చేస్తుంది. దీంతో ఉద్యోగి రిటైర్మెంట్ నిధి వేగంగా పెరుగుతుంది. మ్యూచువల్ ఫండ్‌లో మాత్రం మీరు పెట్టిన డబ్బు మాత్రమే పెట్టుబడిగా ఉంటుంది. కంపెనీ నుంచి ఎలాంటి అదనపు మొత్తం రాదు. ఎంత పెట్టుబడి పెడితే అంతే మీ ఖాతాలో ఉంటుంది.
రాబడి, పన్ను ప్రయోజనాల్లో ఏది మంచిది?
మ్యూచువల్ ఫండ్ రాబడి పూర్తిగా మార్కెట్‌పై ఆధారపడి ఉంటుంది. షేర్ మార్కెట్ బాగా పెరిగితే మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. అదే మార్కెట్ పడిపోతే నష్టాలు కూడా రావచ్చు. అందుకే ఇందులో రిస్క్ ఉంటుంది.
EPFలో మాత్రం ప్రతి సంవత్సరం ప్రభుత్వం వడ్డీ రేటును ప్రకటిస్తుంది. అందువల్ల రాబడి స్థిరంగా, సురక్షితంగా ఉంటుంది. పన్ను పరంగా కూడా EPFకు ప్రత్యేక ప్రయోజనం ఉంది. EPFలో జమ చేసిన మొత్తం, దానిపై వచ్చే వడ్డీ, నిబంధనల ప్రకారం తీసుకునే మొత్తంపై పన్ను మినహాయింపు లభిస్తుంది. మ్యూచువల్ ఫండ్‌లో వచ్చే లాభాలపై మాత్రం క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ వర్తించే అవకాశం ఉంటుంది.
EPFలో పెన్షన్, బీమా..
EPF కేవలం పొదుపు పథకం మాత్రమే కాదు. దీని ద్వారా ఉద్యోగులకు పెన్షన్, బీమా వంటి అదనపు ప్రయోజనాలు కూడా లభిస్తాయి. అర్హులైన ఉద్యోగులకు రిటైర్మెంట్ తర్వాత నెలవారీ పెన్షన్ లభిస్తుంది. అలాగే EPF సభ్యుడు మరణిస్తే, కుటుంబ సభ్యులకు పెన్షన్‌తో పాటు రూ.7 లక్షల వరకు జీవిత బీమా ప్రయోజనం కూడా అందుతుంది.
మ్యూచువల్ ఫండ్‌లో ఇలాంటి సదుపాయాలు ఉండవు. పెట్టుబడిదారుడు మరణిస్తే, ఆ సమయంలో ఉన్న పెట్టుబడి విలువ మాత్రమే నామినీకి అందుతుంది.
రిటైర్మెంట్కు ఏది మంచి ఎంపిక?
EPF ప్రధాన ఉద్దేశం రిటైర్మెంట్ కోసం పొదుపు చేయడం. అందుకే దీనిని ఎప్పుడైనా మీ ఇష్టానుసారం క్లోజ్ చేయడం సాధ్యం కాదు. మరోవైపు మ్యూచువల్ ఫండ్‌లో మీరు అవసరమైనప్పుడు యూనిట్లను విక్రయించి డబ్బు తీసుకోవచ్చు. రిటైర్మెంట్ కోసం సురక్షితమైన, స్థిరమైన పొదుపు కావాలనుకుంటే EPF మంచి ఎంపికగా చెప్పవచ్చు. ఇందులో కంపెనీ వాటా, ప్రభుత్వ వడ్డీ, పన్ను మినహాయింపులు, పెన్షన్, బీమా వంటి ప్రయోజనాలు లభిస్తాయి.
అయితే దీర్ఘకాలంలో ఎక్కువ రాబడి కోసం కొంత రిస్క్ తీసుకునేందుకు సిద్ధంగా ఉంటే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లు మంచి అవకాశంగా మారవచ్చు. అయితే మార్కెట్ ఒడిదొడుకుల ప్రభావం ఎప్పుడూ ఉంటుందని గుర్తుంచుకోవాలి.
ఆర్థిక నిపుణుల అభిప్రాయం ప్రకారం, EPFతో పాటు మ్యూచువల్ ఫండ్లలో కూడా పెట్టుబడి పెడితే రిటైర్మెంట్ సమయంలో భద్రతతో పాటు మెరుగైన రాబడి పొందే అవకాశం ఉంటుంది. రెండు పెట్టుబడి మార్గాలను సమతుల్యంగా ఉపయోగించడం చాలా మందికి ఉత్తమ వ్యూహంగా భావిస్తున్నారు.




