EPFO: ఎక్కువ జీతం మంచిదా పీఎఫ్ ఎక్కువ కట్ అవ్వడం మంచిదా.? ఆలోచించి నిర్ణయం తీసుకోండి
EPFO: కొత్త లేబర్ కోడ్ ప్రకారం కొన్ని సందర్భాల్లో ఉద్యోగులు తమ పీఎఫ్ కాంట్రిబ్యూషన్‌ను తగ్గించుకుని చేతికి వచ్చే జీతాన్ని పెంచుకునే అవకాశం ఉంటుంది.
EPFO: ఎక్కువ జీతం మంచిదా పీఎఫ్ ఎక్కువ కట్ అవ్వడం మంచిదా.? ఆలోచించి నిర్ణయం తీసుకోండి
EPFO: కొత్త లేబర్ కోడ్ ప్రకారం కొన్ని సందర్భాల్లో ఉద్యోగులు తమ పీఎఫ్ కాంట్రిబ్యూషన్‌ను తగ్గించుకుని చేతికి వచ్చే జీతాన్ని పెంచుకునే అవకాశం ఉంటుంది. అయితే ఇలా చేయడం వల్ల జరిగే లాభనష్టాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
కొత్త నిబంధనతో చేతికి వచ్చే జీతం ఎలా పెరుగుతుంది?
సాధారణంగా ఉద్యోగి బేసిక్ జీతంలో 12 శాతం ఉద్యోగి, మరో 12 శాతం యజమాని (ఎంప్లాయర్) పీఎఫ్ ఖాతాలో జమ చేస్తారు. అయితే చట్టపరంగా రూ.15,000 వేతన పరిమితి వరకు మాత్రమే ఈ తప్పనిసరి కాంట్రిబ్యూషన్ వర్తిస్తుంది. దాని కంటే ఎక్కువ జీతంపై పీఎఫ్ చెల్లించడం చాలా సంస్థల్లో స్వచ్ఛందంగా ఉంటుంది. అంటే కంపెనీతో పరస్పర అంగీకారంతో ఉద్యోగి తన పీఎఫ్ కాంట్రిబ్యూషన్‌ను నెలకు రూ.1,800 వరకు పరిమితం చేసుకోవచ్చు. దీంతో ప్రతి నెల చేతికి వచ్చే జీతం పెరుగుతుంది. అయితే ఈ అదనపు డబ్బును సరైన పెట్టుబడుల్లో పెట్టకపోతే భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవు.
ఎవరు పీఎఫ్ కాంట్రిబ్యూషన్ తగ్గించకూడదు?
ఆర్థిక నిపుణుల అభిప్రాయం ప్రకారం కొన్ని వర్గాల ఉద్యోగులు పీఎఫ్ తగ్గించే నిర్ణయం తీసుకోకపోవడం మంచిది.
రిటైర్మెంట్ కోసం పూర్తిగా పీఎఫ్‌పైనే ఆధారపడేవారు. కంపెనీ బేసిక్ జీతంపై పూర్తి 12 శాతం పీఎఫ్ జమ చేస్తున్న ఉద్యోగులు. మీరు కాంట్రిబ్యూషన్ తగ్గిస్తే, కంపెనీ కూడా తన వాటాను తగ్గించే అవకాశం ఉంటుంది. 40 ఏళ్లు దాటిన ఉద్యోగులు. వీరికి రిటైర్మెంట్ కోసం పొదుపు చేసుకునే సమయం తక్కువగా ఉంటుంది. పొదుపు చేసే అలవాటు లేని వారు లేదా అత్యవసర నిధి (ఎమర్జెన్సీ ఫండ్) లేని వారు. రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడని వారు. ప్రస్తుతం ఈపీఎఫ్‌పై సుమారు 8.25 శాతం సురక్షితమైన, పన్ను మినహాయింపు కలిగిన వడ్డీ లభిస్తోంది.
ఒక చిన్న నిర్ణయం వల్ల లక్షల రూపాయలు తగ్గిపోవచ్చు
ఉదాహరణకు ఒక ఉద్యోగి బేసిక్ జీతం నెలకు రూ.50,000 అనుకుందాం. ప్రస్తుతం ప్రతి నెల పీఎఫ్‌లో రూ.6,000 జమ అవుతోంది. కొత్త విధానంలో పీఎఫ్‌ను రూ.1,800కు పరిమితం చేస్తే, ప్రతి నెల చేతికి అదనంగా రూ.4,200 వస్తుంది. అయితే అదే రూ.4,200 ప్రతి నెల పీఎఫ్‌లోనే జమ అవుతూ, 8.25 శాతం వడ్డీతో 25 సంవత్సరాలు కొనసాగితే సుమారు రూ.41 నుంచి రూ.42 లక్షల వరకు రిటైర్మెంట్ ఫండ్ సిద్ధమవుతుంది. అంతేకాదు, కంపెనీ కూడా తన స్వచ్ఛంద కాంట్రిబ్యూషన్‌ను తగ్గిస్తే మొత్తం నష్టం రూ.80 లక్షల వరకు చేరే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. అలాగే చేతికి ఎక్కువ జీతం రావడం వల్ల ఆదాయపు పన్ను (ఇన్‌కమ్ ట్యాక్స్) భారం కూడా పెరిగే అవకాశం ఉంది. పీఎఫ్‌లో జమయ్యే డబ్బుకు మాత్రం పన్ను ప్రయోజనాలు ఉంటాయి.
ఎప్పుడు పీఎఫ్ తగ్గించుకోవడం మంచిది?
ప్రతి ఒక్కరికీ పీఎఫ్ తగ్గించుకోవడం సరైన నిర్ణయం కాదు. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే దీనిని పరిగణలోకి తీసుకోవాలి. మీపై 12 నుంచి 14 శాతం లేదా అంతకంటే ఎక్కువ వడ్డీ ఉన్న వ్యక్తిగత రుణం (పర్సనల్ లోన్) వంటి అప్పులు ఉంటే, చేతికి ఎక్కువ జీతం తీసుకుని వాటిని త్వరగా తీర్చడం ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉంటుంది.
పెట్టుబడులపై మంచి అవగాహన ఉండి, అదనంగా వచ్చే డబ్బును మ్యూచువల్ ఫండ్లు, ఈక్విటీలు లేదా ఇతర మంచి పెట్టుబడుల్లో క్రమశిక్షణతో పెట్టగలిగితే మాత్రమే ఈ ఎంపిక ఉపయోగపడుతుంది. అయితే అదనంగా వచ్చే డబ్బును ఖర్చు చేసే అలవాటు ఉంటే, పీఎఫ్‌ను తగ్గించకుండా కొనసాగించడమే భవిష్యత్తుకు సురక్షితమైన మార్గమని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.




