EPFO: మీ పాత పీఎఫ్ ఖాతాలో డ‌బ్బులు ఉండిపోయాయా.? మీ కోస‌మే ఈ అవ‌కాశం!

EPFO: ఉద్యోగం మారినప్పుడు చాలామంది తమ పాత ప్రావిడెంట్ ఫండ్ (PF) ఖాతాల్లోని డబ్బులను మర్చిపోతుంటారు.

Mokshith
Published on: 5 Nov 2026 1:44 PM IST
EPFO
X

EPFO: మీ పాత పీఎఫ్ ఖాతాలో డ‌బ్బులు ఉండిపోయాయా.? మీ కోస‌మే ఈ అవ‌కాశం!

EPFO: ఉద్యోగం మారినప్పుడు చాలామంది తమ పాత ప్రావిడెంట్ ఫండ్ (PF) ఖాతాల్లోని డబ్బులను మర్చిపోతుంటారు. కొంతకాలానికి ఆ ఖాతాల వివరాలు కూడా గుర్తుండవు. దీంతో వాటిలో జమ అయిన డబ్బులు అలాగే ఉండిపోతాయి. ఇలాంటి ఉద్యోగులకు ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) శుభవార్త చెప్పింది.

రూ.1,000 వరకు ఉంటే క్లెయిమ్ అవసరం లేదు

చాలామంది ఉద్యోగులు ఒక కంపెనీ నుంచి మరో కంపెనీకి మారినప్పుడు పాత PF ఖాతాలోని డబ్బులను బదిలీ చేయడం మర్చిపోతుంటారు. మరికొందరు ఖాతాలో కొద్దిపాటి నగదు ఉండటంతో దాన్ని తీసుకునేందుకు ఆసక్తి చూపరు. ఇలాంటి ఖాతాల్లో ఏళ్ల తరబడి డబ్బులు అలాగే ఉండిపోతుంటాయి.

ఈ సమస్యను పరిష్కరించేందుకు EPFO కొత్త ఆటోమేటిక్ సెటిల్‌మెంట్ విధానాన్ని తీసుకొచ్చింది. దీని ప్రకారం అర్హత కలిగిన నిరుపయోగ PF ఖాతాల్లో రూ.1,000 లేదా అంతకంటే తక్కువ బ్యాలెన్స్ ఉంటే ప్రత్యేకంగా క్లెయిమ్ చేయాల్సిన అవసరం లేకుండానే ఆ డబ్బులను ఉద్యోగుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తారు.

అయితే ఇందుకోసం ఉద్యోగి గుర్తింపు వివరాలు, బ్యాంకు ఖాతా వివరాలను EPFO అధికారులు ధ్రువీకరిస్తారు. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత అర్హులైన వారి బ్యాంకు ఖాతాల్లో నగదు జమ అవుతుంది. కార్మిక శాఖ అంచనాల ప్రకారం ఈ సదుపాయం ద్వారా దాదాపు లక్ష మంది PF ఖాతాదారులకు ప్రయోజనం కలగనుంది. ఆయా ఖాతాల్లో సుమారు రూ.5 కోట్ల వరకు నగదు ఉన్నట్లు అంచనా.

PF ఖాతా ఎప్పుడు ఇన్‌యాక్టివ్‌గా మారుతుంది?

ఉద్యోగం మారగానే పాత PF ఖాతా నిరుపయోగంగా మారుతుందని చాలామంది భావిస్తుంటారు. కానీ అది నిజం కాదు. ఉద్యోగం మారినంత మాత్రాన PF ఖాతా వెంటనే నిరుపయోగ ఖాతాగా మారదు.

EPF పథకం 1952 నిబంధనల ప్రకారం.. ఉద్యోగి 55 ఏళ్లు పూర్తి చేసుకున్న తర్వాత లేదా పదవీ విరమణ చేసిన తర్వాత, ఈ రెండింటిలో ఏది ఆలస్యంగా జరిగితే అప్పటి నుంచి వరుసగా మూడేళ్ల పాటు ఖాతాలో ఎలాంటి నగదు జమ కాకపోతే దాన్ని నిరుపయోగ ఖాతాగా పరిగణించే అవకాశం ఉంటుంది.

అందువల్ల ఉద్యోగులు తమ పాత PF ఖాతాల వివరాలను ఎప్పటికప్పుడు పరిశీలించుకోవాలి. గతంలో పనిచేసిన కంపెనీల్లోని PF ఖాతాల్లో డబ్బులు ఉన్నాయేమో తెలుసుకోవాలి. అవసరమైతే వాటిని ప్రస్తుత UANకు అనుసంధానం చేసుకోవాలి.

రూ.1,000 కంటే ఎక్కువ ఉంటే ఏం చేయాలి?

EPFO తీసుకొచ్చిన ఆటోమేటిక్ సెటిల్‌మెంట్ సదుపాయం ప్రస్తుతం రూ.1,000 లేదా అంతకంటే తక్కువ నగదు ఉన్న అర్హత కలిగిన నిరుపయోగ PF ఖాతాలకే వర్తిస్తుంది. ఒకవేళ మీ పాత PF ఖాతాలో రూ.1,000 కంటే ఎక్కువ డబ్బులు ఉంటే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.

ఆనగదు మీ ఖాతాలోనే భద్రంగా ఉంటుంది. అలాంటి మొత్తాలను ఉద్యోగులు తమ ప్రస్తుత UANకు అనుసంధానం చేసి కొత్త PF ఖాతాకు బదిలీ చేసుకోవచ్చు. నిబంధనల ప్రకారం అర్హత ఉంటే నగదును ఉపసంహరించుకోవచ్చు. ఇందుకోసం EPFO అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్న సేవలను ఉపయోగించుకోవాలి.

వాట్సాప్‌లోనే PF బ్యాలెన్స్, పాస్‌బుక్ వివరాలు

PF ఖాతాదారులకు EPFO అందుబాటులోకి తెచ్చిన మరో ముఖ్యమైన సదుపాయం వాట్సాప్ సేవలు. ఇప్పటివరకు PF బ్యాలెన్స్, ఖాతా వివరాలు తెలుసుకోవాలంటే EPFO వెబ్‌సైట్ లేదా ఇతర అధికారిక మార్గాలను ఉపయోగించాల్సి వచ్చేది. ఇప్పుడు వాట్సాప్ ద్వారా కూడా కొన్ని వివరాలను సులభంగా తెలుసుకోవచ్చు.

వాట్సాప్ సేవ ద్వారా ఉద్యోగులు తమ PF ఖాతాలో ఉన్న మొత్తం బ్యాలెన్స్ తెలుసుకోవ‌చ్చు. అలాగే ఖాతాలో జరిగిన చివరి ఐదు లావాదేవీల వివరాల, EPF పాస్‌బుక్‌కు సంబంధించిన సమాచారం పొందొచ్చు.

Mokshith

Mokshith

2015లో జ‌ర్న‌లిజం స్కూల్ ద్వారా నా కెరీర్‌ను ప్రారంభించాను. అనంత‌రం 2016 నుంచి ప‌లు మీడియా సంస్థ‌ల్లో ప‌నిచేశాను. మొద‌ట ప్రింట్ ఆ త‌ర్వాత డిజిట‌ల్‌లో క‌లిపి మొత్తం 10 ఏళ్ల అనుభ‌వం ఉంది. నేను ఎక్కువ‌గా లైఫ్‌స్టైల్‌, అంత‌ర్జాతీయం, టెక్నాల‌జీ, బిజినెస్‌, ఆస్ట్రాల‌జీకి సంబంధించి వార్త‌లు రాస్తుంటాను.