EPFO: పీఎఫ్ కొత్త నిబంధనలతో ఉద్యోగులకు జీతం తగ్గే అవకాశం.. ఎవరిపై ప్రభావం పడనుంది
EPFO: ఉద్యోగులకు సంబంధించి ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (EPF)లో కీలక మార్పు చేస్తోంది. పీఎఫ్ కనీస వేతన పరిమితిని రూ. 15 వేల నుంచి రూ. 25 వేలకు పెంచేందుకు కేంద్రం ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే.
EPFO: పీఎఫ్ కొత్త నిబంధనలతో ఉద్యోగులకు జీతం తగ్గే అవకాశం.. ఎవరిపై ప్రభావం పడనుంది
EPFO: పీఎఫ్ వేతన పరిమితి రూ.15 వేల నుంచి రూ.25 వేలకు పెంపు
ఉద్యోగుల భవిష్యత్తు అవసరాల కోసం పీఎఫ్ ఎంతో ఉపయోగపడుతుంది. ఉద్యోగి జీతం నుంచి కొంత మొత్తం పీఎఫ్ ఖాతాలో జమ అవుతుంది. కంపెనీ కూడా తన వంతు వాటాను అందిస్తుంది. ఈ డబ్బు ఉద్యోగి భవిష్యత్తు పొదుపులో భాగంగా ఉంటుంది.
ఇప్పటివరకు EPFకు సంబంధించిన తప్పనిసరి వేతన పరిమితి నెలకు రూ.15,000గా ఉంది. ఇప్పుడు ఈ పరిమితిని రూ.25,000కు పెంచినట్లు సమాచారం. ఈ మార్పు 2026 సెప్టెంబర్ 17 నుంచి అమల్లోకి వచ్చినట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. దీంతో గతంలో నెలవారీ బేసిక్ జీతం, కరువు భత్యం (DA) రూ.15,000 దాటడంతో తప్పనిసరి పీఎఫ్ పరిధిలోకి రాని కొంతమంది ఉద్యోగులు కూడా కొత్త పరిమితి కిందకు వచ్చే అవకాశం ఉంది.
ప్రభుత్వం అంచనాల ప్రకారం, ఈ మార్పుతో సుమారు 51 లక్షల మంది అదనపు ఉద్యోగులకు EPF, EPS, EDLI వంటి సామాజిక భద్రత పథకాల పరిధిలోకి వచ్చే అవకాశం ఉంటుంది.
ఏ ఉద్యోగులకు జీతం తగ్గుతుంది.?
కొత్త పీఎఫ్ నిబంధనతో కొంతమంది ఉద్యోగుల టేక్ హోమ్ శాలరీ తగ్గే అవకాశం ఉంది. ముఖ్యంగా ఇప్పటివరకు తప్పనిసరి పీఎఫ్ పరిధిలో లేని, ఇప్పుడు కొత్త పరిమితి కారణంగా పీఎఫ్ పరిధిలోకి వచ్చే ఉద్యోగులపై ప్రభావం పడవచ్చు. ఉద్యోగి బేసిక్ జీతం, కరువు భత్యం కలిపి నెలకు రూ.15,000 కంటే ఎక్కువగా ఉండి, రూ.25,000 వరకు ఉన్నప్పుడు ఈ మార్పు వర్తించే అవకాశం ఉంది. ఇలాంటి ఉద్యోగుల జీతం నుంచి పీఎఫ్ వాటా కట్ అవుతుంది. దీంతో చేతికి అందే జీతం కొంత తగ్గవచ్చు. కొన్ని సందర్భాల్లో ఉద్యోగి నెలవారీ టేక్ హోమ్ శాలరీ సుమారు రూ.1,200 వరకు తగ్గవచ్చు. ఒకవేళ ఉద్యోగి CTCలోనే అదనపు పీఎఫ్ వాటాను సర్దుబాటు చేస్తే, చేతికి వచ్చే జీతం సుమారు రూ.2,400 వరకు తగ్గే అవకాశం ఉందని నివేదికలు చెబుతున్నాయి. అయితే ఈ మొత్తం ఉద్యోగులందరికీ ఒకేలా ఉండదు. వారి బేసిక్ జీతం, కంపెనీ జీతాల విధానం, పీఎఫ్ లెక్కింపు పద్ధతిపై ఆధారపడి ఉంటుంది.
జీతం తగ్గినా పీఎఫ్ ఖాతాలో ఎక్కువ డబ్బు జమ
కొత్త నిబంధన వల్ల చేతికి వచ్చే జీతం తగ్గే అవకాశం ఉన్నప్పటికీ, మరోవైపు ఉద్యోగుల భవిష్యత్తు పొదుపు పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే పీఎఫ్ ఖాతాలో ఉద్యోగి వాటాతో పాటు కంపెనీ వాటా కూడా జమ అవుతుంది.
ఉద్యోగి జీతం నుంచి పీఎఫ్ కోసం ఎక్కువ మొత్తం కట్ అయితే, అతని పీఎఫ్ ఖాతాలో జమయ్యే మొత్తం కూడా పెరగవచ్చు. దీర్ఘకాలంలో ఈ పొదుపు రిటైర్మెంట్ సమయంలో ఉపయోగపడుతుంది. అలాగే కొత్తగా పీఎఫ్ పరిధిలోకి వచ్చే అర్హులైన ఉద్యోగులకు ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ (EPS), ఎంప్లాయీస్ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ (EDLI) వంటి పథకాల ప్రయోజనాలు కూడా వర్తించే అవకాశం ఉంటుంది. అంటే నెలవారీగా చేతికి వచ్చే డబ్బు కొంత తగ్గినా, భవిష్యత్తు పొదుపు, పెన్షన్, బీమా వంటి సామాజిక భద్రత ప్రయోజనాలు అందే అవకాశం ఉంటుంది.
2014 తర్వాత తొలిసారి వేతన పరిమితిలో మార్పు
EPF తప్పనిసరి వేతన పరిమితిని చివరిసారిగా 2014 సెప్టెంబర్‌లో మార్చారు. అప్పట్లో ఈ పరిమితిని నెలకు రూ.6,500 నుంచి రూ.15,000కు పెంచారు. ఇప్పుడు సుమారు 12 ఏళ్ల తర్వాత మరోసారి రూ.25,000కు పెంచినట్లు సమాచారం. ఈ మార్పు ద్వారా మరింత మంది ఉద్యోగులను పీఎఫ్, పెన్షన్, బీమా వంటి సామాజిక భద్రత పథకాల పరిధిలోకి తీసుకురావడం లక్ష్యంగా ఉన్నట్లు పేర్కొంటున్నారు.
మొత్తంగా చూస్తే, కొత్త నిబంధనతో కొంతమంది ఉద్యోగుల చేతికి వచ్చే నెలవారీ జీతం తగ్గవచ్చు. అదే సమయంలో వారి పీఎఫ్ పొదుపు పెరిగే అవకాశం ఉంటుంది. అయితే ప్రతి ఉద్యోగిపై ప్రభావం ఒకేలా ఉండదు. బేసిక్ జీతం, CTC, కంపెనీ అనుసరించే పీఎఫ్ విధానం ఆధారంగా మార్పు ఉంటుంది.




