EPFO: ఉద్యోగులకు EPFO భారీ గుడ్ న్యూస్..ఎఫ్ విత్‌డ్రాయల్ నిబంధనల్లో చారిత్రాత్మక మార్పులు!

EPFO: కోట్లాది మంది ఉద్యోగులకు EPFO అదిరే శుభవార్త అందించింది.

Gagan kumar
Published on: 20 Nov 2026 9:40 AM IST
EPFO
X

EPFO: ఉద్యోగులకు EPFO భారీ గుడ్ న్యూస్..ఎఫ్ విత్‌డ్రాయల్ నిబంధనల్లో చారిత్రాత్మక మార్పులు!

PF withdrawal: దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది ప్రైవేట్, ప్రభుత్వ రంగ ఉద్యోగులకు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ అదిరే శుభవార్త అందించింది. ఉద్యోగుల ఆర్థిక అవసరాలను దృష్టిలో ఉంచుకుని, పీఎఫ్ విత్‌డ్రాయల్ నిబంధనలను మరింత సులభతరం చేస్తూ చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకుంది. నవంబర్ 19, 2026న జరిగిన ఈపీఎఫ్ఓ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సమావేశంలో ఈ కీలక ప్రతిపాదనలకు ఆమోదం లభించింది. కొత్త నిబంధనల ప్రకారం, ఇకపై అత్యవసర సమయాల్లో తమ సొంత డబ్బును తీసుకునేందుకు ఉద్యోగులు కఠిన నిబంధనలతో ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. 55 ఏళ్ల వయసు నిబంధన లేకుండానే అర్హత గల సభ్యులు తమ పీఎఫ్ నిధిలో గరిష్ఠంగా 90 శాతం వరకు విత్‌డ్రా చేసుకునే వెసులుబాటు కల్పించారు. ఈ మార్పులకు సంబంధించిన పూర్తి వివరాలు ఇవే..

గత నిబంధనల ప్రకారం, ఉద్యోగులు పాక్షిక ఉపసంహరణ చేసుకునే సమయంలో తమ మొత్తం పీఎఫ్ బ్యాలెన్స్‌లో కనీసం 25 శాతం సొమ్మును తప్పనిసరిగా ఖాతాలోనే ఉంచాల్సి వచ్చేది. అంటే గరిష్ఠంగా 75 శాతం మాత్రమే తీసుకునే వీలుండేది. తాజాగా సీబీటీ సమావేశంలో ఈ కనీస నిల్వ పరిమితిని 25 శాతం నుండి ఏకంగా 10 శాతానికి తగ్గించారు.దీనివల్ల 55 ఏళ్లలోపు ఉన్న సభ్యులు కూడా వైద్య అవసరాలు, పిల్లల ఉన్నత విద్య, వివాహం, ఇంటి కొనుగోలు లేదా నిర్మాణం వంటి ముఖ్యమైన అవసరాల కోసం తమ పీఎఫ్ నిధిలో 90 శాతం వరకు డబ్బును సులభంగా విత్‌డ్రా చేసుకోవచ్చు.

ఉద్యోగం కోల్పోయి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొనే వారికి ఈపీఎఫ్ఓ పెద్ద ఊరటనిచ్చింది. ఇటీవలి నిబంధనల ప్రకారం, ఉద్యోగం పోయిన వెంటనే 75 శాతం పీఎఫ్ తీసుకుని, మిగిలిన 25 శాతం పూర్తి సెటిల్మెంట్ కోసం ఏకంగా 12 నెలల పాటు నిరుద్యోగిగా వేచి ఉండాల్సి వచ్చేది. ఇప్పుడు ఆ నిరీక్షణ గడువును తిరిగి 2 నెలలకు తగ్గించారు. ఉద్యోగం మానేసిన లేదా కోల్పోయిన తర్వాత 2 నెలల పాటు మరో ఉద్యోగంలో చేరకపోతే, మీ పీఎఫ్ ఖాతాలోని పూర్తి సొమ్మును విత్‌డ్రా చేసుకుని కుటుంబ అవసరాలకు వాడుకోవచ్చు.

పీఎఫ్ క్లెయిమ్ ప్రక్రియను మరింత సరళీకృతం చేస్తూ బోర్డు పలు కీలక మార్పులు చేసింది. గతంలో విత్‌డ్రాయల్స్ కోసం 13 రకాల కేటగిరీలు, వేర్వేరు నిబంధనలు ఉండేవి. తాజాగా వీటన్నింటినీ 3 ప్రధాన గ్రూపుల కిందకు తీసుకువచ్చారు. దీనివల్ల ఎలాంటి డాక్యుమెంట్లు సమర్పించాల్సిన అవసరం లేకుండానే నగదు తీసుకునే అవకాశం లభించింది. గతంలో వివాహం, ఇంటి నిర్మాణం కోసం పీఎఫ్ డబ్బులు తీసుకోవాలంటే కనీసం 5 నుండి 7 సంవత్సరాల సర్వీసు పూర్తి చేయాల్సి ఉండేది. ఇప్పుడు కేవలం ఏడాది సర్వీసు పూర్తి చేసిన వారు కూడా ఈ ప్రయోజనం పొందవచ్చు. విద్య, అనారోగ్య కేటగిరీల కింద ఉపసంహరణలను మరింత సులభతరం చేశారు. ప్రత్యేక పరిస్థితుల్లో ఏడాదికి రెండుసార్లు ఎలాంటి పత్రాలు లేకుండానే అర్హత కలిగిన నిల్వను వెనక్కి తీసుకోవచ్చు.

పదవీ విరమణ తర్వాత మొత్తం పీఎఫ్ సొమ్మును ఒకేసారి విత్‌డ్రా చేసుకోకుండా, ఖాతాలోనే ఉంచి వడ్డీ సంపాదిస్తూనే నెలవారీ, త్రైమాసిక లేదా వార్షిక వాయిదాలలో తీసుకునే సిస్టమాటిక్ విత్‌డ్రాయల్ ప్లాన్ విధానానికి కూడా సీబీటీ ఆమోదం తెలిపింది. ఇది రిటైర్డ్ ఉద్యోగులకు స్థిరమైన ఆదాయ వనరుగా ఉపయోగపడనుంది.

అయితే, ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ కింద కనీస పెన్షన్ పెంపుపై గానీ, అధిక పెన్షన్ దరఖాస్తుల తిరస్కరణలపై గానీ ఈ సమావేశంలో ఎలాంటి కొత్త ప్రకటన చేయకపోవడం కొంత నిరాశ కలిగించే అంశం. ప్రస్తుతం ఆమోదం పొందిన 90 శాతం విత్‌డ్రాయల్, 2 నెలల నిరీక్షణ గడువు నిబంధనలు కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన మంత్రిత్వ శాఖ అధికారిక గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసిన వెంటనే అమల్లోకి రానున్నాయి.

Gagan kumar

Gagan kumar

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో సబ్-ఎడిటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్, పాలిటిక్స్ , వైరల్ న్యూస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.