EPFO: జూలై 15న ఉద్యోగుల ఖాతాల్లోకి పీఎఫ్ డ‌బ్బులు.. ఎంత జ‌మ అవుతుంది.? ఎలా చెక్ చేసుకోవాలంటే.?

EPFO: ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) ఈ ఆర్థిక సంవ‌త్స‌రానికి కూడా పీఎఫ్ డిపాజిట్ల‌పై 8.25 శాతం వ‌డ్డీని య‌థాత‌థంగా కొన‌సాగించింది.

Mokshith
Published on: 9 July 2026 10:54 AM IST
EPFO
X

EPFO: జూలై 15న ఉద్యోగుల ఖాతాల్లోకి పీఎఫ్ డ‌బ్బులు.. ఎంత జ‌మ అవుతుంది.? ఎలా చెక్ చేసుకోవాలంటే.? 

EPFO: ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) ఈ ఆర్థిక సంవ‌త్స‌రానికి కూడా పీఎఫ్ డిపాజిట్ల‌పై 8.25 శాతం వ‌డ్డీని య‌థాత‌థంగా కొన‌సాగించింది. ఈ ఏడాది వ‌డ్డీ డ‌బ్బులు ఎప్పుడు ప‌డ‌తాయ‌న్న దానిపై ఖాతాదారుల్లో ఆస‌క్తి నెల‌కొంది. ఈ నేప‌థ్యంలో తాజాగా దీనికి సంబంధించి అధికారిక ప్ర‌క‌ట‌న వ‌చ్చేసింది.

ఈ ఏడాది 8.25 శాతం వ‌డ్డీ

ప్ర‌తీ నెల ఉద్యోగి జీతంలో కొంత మొత్తం ప్రావిడెంట్ ఫండ్ రూపంలో జ‌మ అవుతుంది. ఇంతే మొత్తాన్ని య‌జ‌మాని కూడా యాడ్ చేస్తాడు. ఈ మొత్తంపై కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌తీ ఏటా ఈపీఎఫ్ఓ వ‌డ్డీ చెల్లిస్తుంది. గ‌త ఏడాదిలాగే ఈ ఏడాది కూడా ఈపీఎఫ్ఓ వ‌డ్డీ రేటును 8.25 శాతంగా నిర్ణయించారు. ఇందులో భాగంగానే జూలై 15వ తేదీ నుంచి వ‌డ్డీ జ‌మ చేసే ప్ర‌క్రియ‌ను ప్రారంభించనున్నారు.

ప్రతి నెల పీఎఫ్‌ ఎంత కట్ అవుతుంది?

ఎంప్లాయిమెంట్ ప్రావిడెంట్ ఫండ్ నిబంధనల ప్రకారం ఉద్యోగి బేసిక్ జీతం, డియర్‌నెస్ అలవెన్స్ (DA) కలిపిన మొత్తంలో 12 శాతం పీఎఫ్‌గా క‌ట్ అవుతుంది. కంపెనీ యజమాని కూడా అంతే మొత్తాన్ని క‌ల‌పాల్సి ఉంటుంది. అయితే య‌జ‌మాని చెల్లించే మొత్తంలో 3.67% ఈపీఎఫ్ అకౌంట్‌లో జ‌మ అవుతుంది. 8.33% ఉద్యోగుల పెన్షన్ పథకానికి (EPS) వెళ్తుంది. దీనికి అద‌నంగా బీమా పథకం (EDLI) కోసం చెల్లిస్తారు. ఎంప్లాయి జీతం నుంచి క‌ట్ చేసిన పీఎఫ్ మొత్తాన్ని సంస్థ ప్ర‌తీ నెల 15వ తేదీలోపు ఈపీఎఫ్ఓకు జ‌మ చేయాల్సి ఉంటుంది.

ఇంత‌కీ పీఎఫ్ వ‌డ్డీని ఎలా లెక్కిస్తారు.?

సాధార‌ణంగా ఈపీఎఫ్ఓ ప్ర‌తీ నెల ఖాతాలో ఉన్న అమౌంట్ ఆధారంగా వ‌డ్డీని లెక్కిస్తుంది. అయితే వ‌డ్డీని మాత్రం మొత్తం ఏడాదికి సంబంధించి ఒకేసారి అకౌంట్‌లో జ‌మ చేస్తుంది. ఉదాహరణకు ఒక ఉద్యోగి ఖాతాలో రూ. 5 ల‌క్ష‌లు ఉన్నాయ‌ని అనుకుందాం. 8.25 శాతం వ‌డ్డీ చొప్పున లెక్కిస్తే ఏడాదికి సుమారు రూ. 41,250 వ‌డ్డీ రూపంలో జ‌మ అవుతుంది. అయితే ఒక‌వేళ ఉద్యోగి ముంద‌స్తుగా పీఎఫ్ సొమ్మును విత్‌డ్రా చేస్తే వ‌డ్డీ మారుతుంది.

వ‌డ్డీ జ‌మ అయ్యిందో లేదో ఎలా తెలుసుకోవాలి.?

EPFO సభ్యులు తమ PF బ్యాలెన్స్, వడ్డీ వివరాలను చెక్ చేసుకోవ‌డానికి ప‌లు విధానాలు అందుబాటులో ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

మిస్‌డ్ కాల్ ద్వారా:

మీ UANకు లింక్ అయిన మొబైల్ నంబర్ నుంచి 9966044425కు మిస్‌డ్ కాల్ ఇవ్వండి. కాల్ క‌ట్ అయిన కాసేప‌టికే మీ ఫోన్‌కు మెసేజ్ రూపంలో వివ‌రాలు వ‌స్తాయి.

SMS ద్వారా ఎలా తెలుసుకోవాలంటే.?

మీ రిజ‌స్ట‌ర్ మొబైల్ నంబర్ నుంచి 7738299899 నెంబ‌ర్‌కి ఇలా మెసేజ్ చేయండి. EPFOHO UAN ENG అని పంపిస్తే.. కాసేప‌టికే మీ PF బ్యాలెన్స్ సమాచారం మెసేజ్ రూపంలో వ‌స్తుంది.

EPFO వెబ్‌సైట్ ద్వారా ఇలా:

ఇందుకోసం ముందుగా అధికారిక EPFO పోర్టల్‌లోకి వెళ్లాలి.. అనంత‌రం UAN, పాస్‌వర్డ్‌తో లాగిన్ అవ్వాలి. త‌ర్వాత అక్క‌డ క‌నిపించే పాస్‌బుక్ ఆప్ష‌న్‌ను సెల‌క్ట్ చేసుకుంటే బ్యాలెన్స్, వడ్డీ వివరాలు క‌నిపిస్తాయి.

UMANG యాప్ ద్వారా ఎలా తెలుసుకోవాలంటే.?

ఇందుకోసం ముందుగా మీ స్మార్ట్‌ఫోన్‌లో UMANG యాప్‌ను ఇన్‌స్టాల్ చేయాలి. అనంత‌రం EPFO సేవలను సెల‌క్ట్ చేసుకొని View Passbookపై క్లిక్ చేయాలి. UAN నమోదు చేసి OTP వెరిఫికేష‌న్‌ పూర్తి చేస్తే పాస్‌బుక్‌తో పాటు వడ్డీ వివరాలు కూడా కనిపిస్తాయి.

Mokshith

Mokshith

2015లో జ‌ర్న‌లిజం స్కూల్ ద్వారా నా కెరీర్‌ను ప్రారంభించాను. అనంత‌రం 2016 నుంచి ప‌లు మీడియా సంస్థ‌ల్లో ప‌నిచేశాను. మొద‌ట ప్రింట్ ఆ త‌ర్వాత డిజిట‌ల్‌లో క‌లిపి మొత్తం 10 ఏళ్ల అనుభ‌వం ఉంది. నేను ఎక్కువ‌గా లైఫ్‌స్టైల్‌, అంత‌ర్జాతీయం, టెక్నాల‌జీ, బిజినెస్‌, ఆస్ట్రాల‌జీకి సంబంధించి వార్త‌లు రాస్తుంటాను.

Next Story