EPFO సభ్యులకు గుడ్ న్యూస్.. SWP విధానంలో డబ్బుల విత్‌డ్రాపై పన్ను మినహాయింపు!

EPFO: EPFO SWP Tax Exemption: EPF ఖాతాదారులకు రిటైర్మెంట్ తర్వాత SWP విధానంలో నెలవారీగా పీఎఫ్ డబ్బులు తీసుకునే అవకాశం కల్పించనున్నారు.

Mokshith
Published on: 26 Nov 2026 2:29 PM IST
EPFO
X

EPFO సభ్యులకు గుడ్ న్యూస్.. SWP విధానంలో డబ్బుల విత్‌డ్రాపై పన్ను మినహాయింపు!

EPFO SWP Tax Exemption: EPF ఖాతాదారులకు రిటైర్మెంట్ తర్వాత SWP విధానంలో నెలవారీగా పీఎఫ్ డబ్బులు తీసుకునే అవకాశం కల్పించనున్నారు. ఈ విధానంలో వచ్చే మొత్తానికి కూడా పన్ను మినహాయింపు ఇవ్వాలని కేంద్రం యోచిస్తోంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం.

SWP విధానంలో పీఎఫ్ డబ్బులు విత్‌డ్రా చేసుకోవచ్చు

ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (CBT) ఇటీవల నిర్వహించిన 240వ సమావేశంలో SWP విధానానికి ఆమోదం తెలిపింది. ఈ విధానం ద్వారా రిటైర్మెంట్ పొందిన ఉద్యోగులు తమ పీఎఫ్ ఖాతాలోని డబ్బులను ఒకేసారి తీసుకోవాల్సిన అవసరం ఉండదు.

ప్రతి నెలా, మూడు నెలలకు ఒకసారి లేదా ఆరు నెలలకు ఒకసారి అవసరమైన మొత్తాన్ని విత్‌డ్రా చేసుకోవచ్చు. ఖాతాలో మిగిలిన డబ్బుపై యథావిధిగా వడ్డీ లభిస్తూనే ఉంటుంది. దీంతో పదవీ విరమణ తర్వాత కూడా ఉద్యోగులకు క్రమం తప్పకుండా ఆదాయం అందుతుంది. తమ అవసరాలకు అనుగుణంగా డబ్బులు తీసుకునే అవకాశం ఉంటుంది.

SWP ద్వారా వచ్చే డబ్బుపై కూడా పన్ను మినహాయింపు?

ప్రస్తుతం ఉద్యోగులు ఐదేళ్ల పాటు నిరంతరంగా EPF ఖాతాలో పొదుపు చేసిన తర్వాత మొత్తం డబ్బును ఒకేసారి విత్‌డ్రా చేసుకుంటే సాధారణంగా పన్ను మినహాయింపు లభిస్తుంది. అయితే SWP విధానంలో నెలవారీగా లేదా ఇతర వాయిదాల్లో తీసుకునే మొత్తానికి కూడా ఇదే మినహాయింపు వర్తిస్తుందా?

అనే దానిపై స్పష్టత లేదు. ఈ నేపథ్యంలో SWP ద్వారా పొందే మొత్తాన్ని కూడా ఒకేసారి విత్‌డ్రా చేసుకున్న డబ్బుతో సమానంగా పన్ను రహితంగా పరిగణించాలని కార్మిక శాఖ భావిస్తోంది. ఇందుకోసం ఆదాయపు పన్ను చట్టం-2025లో అవసరమైన మార్పులు చేయాలని ఆర్థిక శాఖను కోరేందుకు సిద్ధమవుతోంది.

ఈ అంశంపై ఇప్పటికే ఆర్థిక శాఖతో చర్చలు ప్రారంభించినట్లు కార్మిక శాఖ అధికారి ఒకరు వెల్లడించినట్లు బిజినెస్ స్టాండర్డ్ నివేదిక పేర్కొంది.

రిటైర్మెంట్ తర్వాత కూడా పీఎఫ్‌లో డబ్బులు జమ చేసుకోవచ్చా?

SWP విధానంతో పాటు రిటైర్మెంట్ తర్వాత కూడా ఉద్యోగులు తమ EPF ఖాతాలో డబ్బులు జమ చేసుకునే అవకాశం కల్పించాలని CBT ప్రతిపాదించింది. ప్రస్తుతం ఉద్యోగులు పదవీ విరమణ చేసిన తర్వాత తమ పీఎఫ్ ఖాతాలో కొత్తగా కంట్రిబ్యూషన్ చేయడానికి అవకాశం లేదు.

అయితే కొత్త ప్రతిపాదన అమల్లోకి వస్తే రిటైర్మెంట్ తర్వాత కూడా పొదుపు కొనసాగించవచ్చు. అలా జమ చేసిన మొత్తంపై వచ్చే వడ్డీకి కూడా పన్ను మినహాయింపు కల్పించాలని కార్మిక శాఖ భావిస్తోంది. ఈ అంశంపైనా ఆదాయపు పన్ను చట్టంలో మార్పులు చేయాలని ఆర్థిక శాఖతో చర్చించనుంది. అయితే ఈ ప్రతిపాదనలకు ఇంకా తుది ఆమోదం లభించలేదు.

SWP తీసుకుంటున్న సమయంలో ఖాతాదారుడు చనిపోతే ఏం జరుగుతుంది?

SWP విధానంలో డబ్బులు పొందుతున్న సమయంలో ఖాతాదారుడు మరణిస్తే వారి కుటుంబ సభ్యులు లేదా నామినీకి కూడా వెసులుబాటు కల్పించాలని ప్రతిపాదించారు. ఖాతాలో మిగిలి ఉన్న పీఎఫ్ మొత్తాన్ని ఒకేసారి తీసుకోవచ్చు. లేదంటే గతంలో ఖాతాదారుడు పొందుతున్న విధంగానే వాయిదాల రూపంలో డబ్బులు తీసుకునే అవకాశం ఉంటుంది.

దీనివల్ల రిటైర్మెంట్ తర్వాత ఉద్యోగులకే కాకుండా వారి కుటుంబ సభ్యులకు కూడా ఆర్థిక భద్రత లభిస్తుంది. ముఖ్యంగా పదవీ విరమణ సమయంలో మొత్తం పీఎఫ్ డబ్బును ఒకేసారి ఖర్చు చేయకుండా, అవసరానికి అనుగుణంగా వినియోగించుకోవాలనుకునే వారికి SWP ఉపయోగపడుతుంది.

అయితే పన్ను మినహాయింపులు, రిటైర్మెంట్ తర్వాత కంట్రిబ్యూషన్ వంటి ప్రతిపాదనలు ప్రభుత్వం నుంచి తుది ఆమోదం పొంది, అధికారిక నోటిఫికేషన్ విడుదలైన తర్వాతే అమల్లోకి వస్తాయి.

Mokshith

Mokshith

2015లో జ‌ర్న‌లిజం స్కూల్ ద్వారా నా కెరీర్‌ను ప్రారంభించాను. అనంత‌రం 2016 నుంచి ప‌లు మీడియా సంస్థ‌ల్లో ప‌నిచేశాను. మొద‌ట ప్రింట్ ఆ త‌ర్వాత డిజిట‌ల్‌లో క‌లిపి మొత్తం 10 ఏళ్ల అనుభ‌వం ఉంది. నేను ఎక్కువ‌గా లైఫ్‌స్టైల్‌, అంత‌ర్జాతీయం, టెక్నాల‌జీ, బిజినెస్‌, ఆస్ట్రాల‌జీకి సంబంధించి వార్త‌లు రాస్తుంటాను.