EPS Pension Hike: పింఛనుదారులకు శుభవార్త.. కనీస పింఛను రూ.3 వేలకు పెంపు?
EPS Pension Hike: EPS కనీస పింఛనును రూ.1,000 నుంచి రూ.3,000కు పెంచే ప్రతిపాదనపై EPFO చర్చిస్తోంది. దేశవ్యాప్తంగా లక్షల మందికి ప్రయోజనం కలగనుంది.
EPS Pension Hike: పింఛనుదారులకు శుభవార్త.. కనీస పింఛను రూ.3 వేలకు పెంపు?
EPS Pension Hike: ఉద్యోగుల పింఛను పథకం (EPS) కింద పింఛను పొందుతున్న లక్షలాది మందికి త్వరలో శుభవార్త అందే అవకాశం ఉంది. ప్రస్తుతం నెలకు ఇస్తున్న కనీస పింఛను రూ.1,000 నుంచి రూ.3,000కు పెంచేందుకు ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (EPFO) కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు కేంద్ర కార్మికశాఖ, ఆర్థిక మంత్రిత్వశాఖ మధ్య సంప్రదింపులు జరిగినట్లు తెలుస్తోంది.
ఈ నెల 19న జరగనున్న EPFO సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (CBT) సమావేశంలో కనీస పింఛను పెంపు అంశాన్ని ప్రత్యేక ఎజెండాగా చర్చించే అవకాశం ఉంది. ఈ సమావేశంలో దీనిపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయని సమాచారం.
81 లక్షల మందికి ప్రయోజనం!
దేశవ్యాప్తంగా ప్రస్తుతం సుమారు 81.48 లక్షల మంది EPS పింఛనుదారులు ఉన్నారు. వీరిలో దాదాపు 73.55 లక్షల మంది నెలకు రూ.3,000 కంటే తక్కువ పింఛను పొందుతున్నారు. కనీస పింఛనును రూ.3,000కు పెంచే ప్రతిపాదనకు ఆమోదం లభించి అమల్లోకి వస్తే వీరందరికీ ప్రయోజనం చేకూరనుంది.
ముఖ్యంగా వృద్ధాప్యంలో అతి తక్కువ పింఛనుతో జీవనం సాగిస్తున్న రిటైర్డ్ ఉద్యోగులకు ఈ నిర్ణయం కొంత ఊరటనిచ్చే అవకాశం ఉంది.
2014లో రూ.1,000కు పెరిగిన కనీస పింఛను
EPFO 2014లో వేతన పరిమితిని రూ.6,500 నుంచి రూ.15,000కు పెంచిన సమయంలో కనీస పింఛను మొత్తాన్ని కూడా సవరించింది. అప్పట్లో దాదాపు 80 శాతం మంది పింఛనుదారులకు నెలకు రూ.1,000లోపే పింఛను అందేది. దీంతో కనీస పింఛనును రూ.1,000గా నిర్ణయించారు.
అయితే అప్పటి నుంచి ఇప్పటివరకు కనీస పింఛనులో పెద్దగా మార్పు లేకపోవడంతో దానిని పెంచాలంటూ కార్మిక సంఘాలు, పింఛనుదారులు చాలాకాలంగా డిమాండ్ చేస్తున్నారు. EPFO సెంట్రల్ బోర్డు సమావేశాల్లోనూ ఈ అంశాన్ని పలుమార్లు ప్రస్తావించారు.
తెలంగాణలో 5 లక్షల మందికి లబ్ధి?
ఇటీవల సెప్టెంబరులో EPFO గరిష్ఠ వేతన పరిమితిని రూ.15,000 నుంచి రూ.25,000కు పెంచిన నేపథ్యంలో కనీస పింఛనును కూడా రూ.3,000కు పెంచాలనే ప్రతిపాదనపై చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. ఈ ప్రతిపాదనకు ఆమోదం లభిస్తే తెలంగాణ రాష్ట్రంలో సుమారు 5 లక్షల మంది పింఛనుదారులకు ప్రయోజనం కలగనుంది.
అయితే కనీస పింఛను పెంపుపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. EPFO సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సమావేశంలో తీసుకునే నిర్ణయంపై లక్షలాది మంది పింఛనుదారులు ఆశగా ఎదురుచూస్తున్నారు.




