Surat fire incident: రూ. 10 వేల జీతం కోసం కక్ష.. ఏకంగా రూ. 24 కోట్ల ఆస్తి బూడిద!

Surat fire incident: గుజరాత్‌లోని సూరత్‌లో కేవలం రూ. 10 వేల జీత బకాయి కోసం ఓ మాజీ ఉద్యోగి దుకాణానికి నిప్పు పెట్టగా, మంటలు వ్యాపించి రూ. 24 కోట్ల విలువైన 14 దుకాణాలు దగ్ధమయ్యాయి.

Gagan kumar
Published on: 24 Sept 2026 12:48 PM IST
Surat fire incident
X

Surat fire incident: రూ. 10 వేల జీతం కోసం కక్ష.. ఏకంగా రూ. 24 కోట్ల ఆస్తి బూడిద!

Surat fire incident: పుండు మీద కారం చల్లినట్లు.. రావాల్సిన చిన్న మొత్తపు బకాయి కోసం కోపం పెంచుకున్న ఓ మాజీ ఉద్యోగి చేసిన దురాఘాతం అక్షరాలా కోట్ల రూపాయల ఆస్తిని బూడిద చేసింది. కేవలం రూ. 10 వేల జీతం బకాయి కోసం జరిగిన వివాదం ఏకంగా కోట్లలో నష్టాన్ని మిగిల్చిన ఈ విచిత్రమైన, దిగ్భ్రాంతికర ఘటన గుజరాత్‌లోని సూరత్‌లో వెలుగు చూసింది. సూరత్‌లోని ఓ ప్రముఖ టెక్స్‌టైల్ దుకాణంలో వినోద్ పండి సావ్ల అనే వ్యక్తి అకౌంటెంట్‌గా చేరాడు.

అయితే కేవలం మూడు నెలలకే ఉద్యోగం మానేశాడు. ఆ కాలానికి సంబంధించి తనకు రావాల్సిన రూ. 10 వేల వేతన బకాయిని చెల్లించాల్సిందిగా అతను మాజీ యజమానిని పలుమార్లు కోరాడు. యజమాని స్పందించకపోవడంతో వినోద్‌లో కక్ష పెరిగిపోయింది. తన కష్టార్జితం ఇవ్వలేదన్న తీవ్ర ఆగ్రహంతో రాత్రి సమయంలో యజమానికి చెందిన టెక్స్‌టైల్ షాపు వద్దకు చేరుకుని పథకం ప్రకారం పెట్రోల్ పోసి నిప్పంటించాడు!

నిందితుడు పెట్టిన ఆ ఒక్క నిప్పు ఆ ప్రాంతంలో పెను ప్రళయం సృష్టించింది. దుకాణంలో చెలరేగిన మంటలు అత్యంత వేగంగా పక్కనే ఉన్న ఇతర వాణిజ్య సముదాయాలకు వ్యాపించాయి.ఈ భారీ అగ్నిప్రమాదంలో మొత్తం 14 దుకాణాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఈ దుర్ఘటనలో దాదాపు రూ. 24 కోట్లకు పైగా విలువైన వస్త్రాలు, ఆస్తులు కాలి బూడిదైనట్లు ప్రాథమిక అంచనా.

తొలుత ఈ ఘటనను షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిన సాధారణ ప్రమాదంగా అంతా భావించారు. అయితే అనుమానం వచ్చిన పోలీసులు పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజీలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఆ ఫుటేజీలో వినోద్ పెట్రోల్ పోసి దుకాణానికి నిప్పు పెడుతున్న దృశ్యాలు స్పష్టంగా రికార్డై అసలు నిజం బయటపెట్టాయి. దీంతో అవాక్కయిన పోలీసులు నిందితుడిని వెంటనే అరెస్టు చేసి కటకటాల్లోకి నెట్టారు.

కేవలం పది వేల రూపాయల కోసం మొదలైన చిన్న వివాదం చివరకు కోట్ల రూపాయల ఆస్తి నష్టాన్ని మిగల్చడమే కాకుండా, నిందితుడి జీవితాన్ని ఊచల వెనక్కి నెట్టడం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Gagan kumar

Gagan kumar

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో సబ్-ఎడిటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్, పాలిటిక్స్ , వైరల్ న్యూస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.