Fact Check : జూలై 1 నుంచి రూ.10, 20, 50, 100 నోట్లు రద్దు? వాట్సాప్ మెసేజ్‌లపై ఆర్బీఐ క్లారిటీ

Fact Check : జూలై 1 నుంచి పాత 10, 20, 50, 100 రూపాయల నోట్లు బంద్ కాబోతున్నాయా? సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్టుల వెనుక ఉన్న అసలు నిజమెంటో కేంద్ర ప్రభుత్వం తేల్చేసింది.

CR Reddy
Published on: 29 Jun 2026 7:22 AM IST
Old Currency Notes
X

Old Currency Notes

Fact Check : సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ఏ వార్త నిజమో, ఏది అబద్ధమో తెలుసుకోవడం సామాన్యులకు పెద్ద తలనొప్పిగా మారింది. ముఖ్యంగా డబ్బుకు సంబంధించిన విషయాల్లో వచ్చే రూమర్లు జనాల్లో క్షణాల్లో ఆందోళన కలిగిస్తాయి. తాజాగా బ్యాంకింగ్ రంగానికి సంబంధించి ఒక వార్త ఇంటర్నెట్‌లో విపరీతంగా చక్కర్లు కొడుతోంది. రాబోయే జూలై 1వ తేదీ నుంచి మార్కెట్లో చలామణిలో ఉన్న పాత 10, 20, 50, 100 రూపాయల నోట్లను పూర్తిగా రద్దు చేయబోతున్నారనేది ఆ వార్త సారాంశం. ఈ పోస్ట్‌ను చూసి చాలామంది తమ దగ్గరున్న పాత నోట్లను మార్చుకోవాలా వద్దా అని కంగారు పడుతున్నారు.

వైరల్ అవుతున్న పోస్టర్‌లో ఏముంది?

నెట్టింట వైరల్ అవుతున్న ఆ పోస్ట్‌ను గమనిస్తే.. అదొక అధికారిక నోటీసులా కనిపిస్తోంది. దానిపై ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంకు బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర లోగో కూడా ముద్రించి ఉంది. జూలై 1, 2026 నుంచి దేశవ్యాప్తంగా పాత రూ.10, రూ.20, రూ.50, రూ.100 నోట్లు చెల్లుబాటు కావు అని అందులో చాలా స్పష్టంగా రాసి ఉంది. అయితే అన్ని నోట్లు కాదు.. కేవలం 2005వ సంవత్సరానికి కంటే ముందు ముద్రించిన పాత సిరీస్ నోట్లను మాత్రమే బ్యాన్ చేస్తున్నారని, ఇది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) తీసుకున్న అధికారిక నిర్ణయమని ఆ పోస్టర్‌లో పెద్ద అక్షరాలతో రాశారు. దీనితో సాధారణ ప్రజలు నిజంగానే నోట్లు రద్దవుతున్నాయని నమ్మేశారు.

ఆ పాత నోట్లు చెల్లుతాయా? ఆర్బీఐ రూల్స్ ఏం చెబుతున్నాయి?

ఈ వివాదంపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) నిబంధనలను పరిశీలిస్తే.. 2005 కంటే ముందు ముద్రించిన కరెన్సీ నోట్లకు సంబంధించి గతంలో కొన్ని మార్గదర్శకాలు ఉన్నప్పటికీ, వాటి లీగల్ టెండర్ ఎప్పుడూ రద్దు కాలేదు. 2005కు ముందు వచ్చిన నోట్లు ఇప్పటికీ చట్టబద్ధంగా పూర్తిగా చెల్లుబాటు అవుతాయని ఆర్బీఐ స్పష్టం చేసింది. కాకపోతే, ఆ నోట్లలో భద్రతా ఫీచర్లు తక్కువగా ఉండడం వల్ల బ్యాంకులకు వచ్చినప్పుడు వాటిని మార్కెట్ నుంచి వెనక్కి తీసుకుంటారు తప్ప, ప్రజల దగ్గరున్న నోట్లు చెల్లకుండా పోవని స్పష్టం చేశారు. కాబట్టి మీ దగ్గర 2005 నాటి పాత నోట్లు ఉన్నా భయపడాల్సిన అవసరం లేదు.

తొందరపడి షేర్ చేయకండి

మార్కెట్లో నోట్ల రద్దు లాంటి పెద్ద నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఆ సమాచారాన్ని ఆర్బీఐ తన అధికారిక వెబ్‌సైట్ ద్వారా ప్రెస్ రిలీజ్ రూపంలో విడుదల చేస్తుంది. అంతే తప్ప ఇలాంటి వాట్సాప్ ఫార్వర్డ్ మెసేజ్‌ల ద్వారా ఏ నిర్ణయాలు ప్రకటించరు. ఇలాంటి రూమర్లు వ్యాప్తి చేసేవారిపై కఠిన చర్యలు ఉంటాయని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రజలు కూడా బ్యాంకులకు సంబంధించిన ఏ సమాచారమైనా నేరుగా ఆయా బ్యాంకుల అధికారిక వెబ్‌సైట్లు లేదా ఆర్బీఐ పోర్టల్‌ను చూసి మాత్రమే నిర్ధారించుకోవాలని, ఇలాంటి ఫేక్ పోస్టులను ఇతరులకు షేర్ చేయవద్దని పిఐబి విజ్ఞప్తి చేసింది.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story