FASTag: వాహనదారులకు షాక్.. రేపటి నుంచే పెరగనున్న ఫాస్టాగ్ పాస్ ధరలు.. కొత్త రూల్స్ ఇవే!

FASTag: వాహనదారులకు అలర్ట్! ఏప్రిల్ 1 నుంచి ఫాస్టాగ్ వార్షిక పాస్ ధరలు పెరగనున్నాయి. కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచి ఎన్‌హెచ్‌ఏఐ (NHAI) అమలు చేయనున్న కొత్త రేట్లు, నిబంధనల పూర్తి వివరాలు ఇక్కడ ఉన్నాయి.

Arun Chilukuri
Published on: 31 March 2026 1:06 PM IST
FASTag
X

FASTag: వాహనదారులకు షాక్.. రేపటి నుంచే పెరగనున్న ఫాస్టాగ్ పాస్ ధరలు.. కొత్త రూల్స్ ఇవే!

జాతీయ రహదారులపై ప్రయాణించే వారికి కేంద్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. కొత్త ఆర్థిక సంవత్సరం (2026-27) ప్రారంభం కావడంతో, ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఫాస్టాగ్ (FASTag) వార్షిక పాస్ ధరలను పెంచుతూ భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (NHAI) కీలక నిర్ణయం తీసుకుంది.

పెరగనున్న వార్షిక ఫీజు:

ప్రస్తుతం ఫాస్టాగ్ వార్షిక పాస్ ధర రూ. 3,000 ఉండగా, బుధవారం (ఏప్రిల్ 1) నుంచి ఇది రూ. 3,075 కి చేరనుంది. ధర పెంపు స్వల్పంగా ఉన్నప్పటికీ, తరచూ హైవేలపై ప్రయాణించే వాహనదారులపై ఇది అదనపు భారం చూపనుంది. తమ పాస్‌ను రెన్యూవల్ చేసుకోవాలనుకునే వారు ఈ విషయాన్ని గమనించాలని అధికారులు సూచించారు.

వార్షిక పాస్ ప్రయోజనాలు ఇవే:

టోల్ ప్లాజాల వద్ద క్యూలో వేచి ఉండకుండా, నగదు చెల్లింపుల ఇబ్బంది లేకుండా ప్రయాణించేందుకు ఈ వార్షిక పాస్ ఎంతో ఉపయోగపడుతుంది. ఈ పాస్ ద్వారా ఏడాదికి గరిష్టంగా 200 టోల్ క్రాసింగ్‌ల వరకు అనుమతి ఉంటుంది. యాక్టివేట్ చేసుకున్న రోజు నుంచి సరిగ్గా ఏడాది కాలం పాటు ఇది చెల్లుబాటు అవుతుంది. 200 ప్రయాణాలు పూర్తయినా లేదా ఒక సంవత్సరం గడిచినా.. పాస్ పనిచేయడం ఆగిపోతుంది. ఆ తర్వాత మళ్ళీ రెన్యూవల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ వార్షిక పాస్ సౌకర్యం కేవలం కార్లు, జీపులు, వ్యాన్లు వంటి ప్రైవేట్ వాహనాలకు మాత్రమే అందుబాటులో ఉంది.

నేడే ఆఖరి అవకాశం!

పాత ధరకే (రూ. 3,000) వార్షిక పాస్‌ను పొందాలనుకునే వారు మార్చి 31వ తేదీ లోపు రెన్యూవల్ చేసుకోవడం ఉత్తమం. ఈరోజు పాస్ తీసుకుంటే మరో ఏడాది పాటు పెరిగిన ధరల నుంచి ఉపశమనం లభిస్తుంది. ప్రతిరోజూ హైవేలపై ప్రయాణించే ఉద్యోగులు, వ్యాపారస్తులకు ఈ పాస్ అత్యంత సరసమైన ఆప్షన్‌గా నిలుస్తోంది.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story