Fastag: ఫాస్టాగ్ వినియోగదారులకు కేంద్రం గుడ్ న్యూస్

Fastag: దేశంలోని కోట్లాది మంది వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం ఊరట కలిగించే నిర్ణయాన్ని ప్రకటించింది.

CR Reddy
Published on: 13 Sept 2026 8:30 AM IST
Fastag
X

Fastag

Fastag: దేశంలోని కోట్లాది మంది వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం ఊరట కలిగించే నిర్ణయాన్ని ప్రకటించింది. ఇప్పటివరకు వేరే బ్యాంకుకు మారాలంటే పాత ఫాస్టాగ్ స్టిక్కర్‌ను తీసేసి కొత్తది అతికించుకోవాల్సి వచ్చేది. ఇకపై ఆ తిప్పలు లేకుండా అదే స్టిక్కర్‌పై వేరే బ్యాంకుకు మారేలా సరికొత్త పోర్టబిలిటీ విధానాన్ని కేంద్రం అందుబాటులోకి తెచ్చింది. జాతీయ రహదారులపై ప్రయాణించే వాహనదారులు టోల్ ప్లాజాల వద్ద నిరీక్షించే సమయాన్ని తగ్గించడానికి తీసుకొచ్చిన డిజిటల్ విధానమే ఫాస్టాగ్. విండ్‌స్క్రీన్‌పై ఉన్న స్టిక్కర్ స్కాన్ కాగానే టోల్ రుసుం ఆటోమేటిక్ గా కట్ అవుతుంది. బ్యాంకింగ్ సేవల్లో ఇబ్బందులు ఎదురైనా లేదా వేరే బ్యాంక్ అందించే ఆఫర్లు నచ్చినా పాత ఫాస్టాగ్‌ను రద్దు చేసుకుని, విండ్‌స్క్రీన్‌పై అతికించిన స్టిక్కర్‌ను పీకి వేరేది పెట్టాల్సి వచ్చేది. ఈ క్రమంలో గ్లాస్ పాడవడం, కొత్త స్టిక్కర్ కోసం వేచి చూడడం వంటి సమస్యలకు చెక్ పెడుతూ కేంద్రం ఫాస్టాగ్ వన్ పేరుతో పోర్టబిలిటీ సేవలను తీసుకొచ్చింది.

గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్ట్‌లో ప్రారంభం

ముంబైలో నిర్వహించిన గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్ట్ వేదికగా కేంద్ర రహదారి, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఈ కొత్త సేవలను ప్రారంభించారు. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనుబంధ సంస్థ అయిన ఐహెచ్‌ఎమ్‌సీఎల్ తోడ్పాటుతో ఈ ఆధునిక వ్యవస్థను రూపొందించారు. ఈ కొత్త విధానం అమలులోకి రావడంతో వాహనదారుడి ట్యాగ్ ఐడీ, వెహికల్ రిజిస్ట్రేషన్ నంబర్, వాహనంపై ఉన్న స్టిక్కర్ అలాగే కొనసాగుతాయి. కస్టమర్లు కేవలం తమకు నచ్చిన బ్యాంకుకు ఖాతాను అనుసంధానం చేసుకుంటే సరిపోతుంది.

యాప్ ద్వారా బ్యాంక్ మార్చుకునే విధానం

ఫాస్టాగ్ పోర్టబిలిటీ సేవలను వినియోగించుకోవడం అత్యంత సులభంగా తీర్చిదిద్దారు. స్మార్ట్‌ఫోన్‌లో రాజ్‌మార్గ్ యాత్ర యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని లాగిన్ కావాలి. యాప్‌లో అర్హత తనిఖీ, వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తయిన తర్వాత కస్టమర్ తనకు నచ్చిన కొత్త బ్యాంకును ఎంచుకోవచ్చు. పాత ఫాస్టాగ్ ఖాతాలో ఉన్న బ్యాలెన్స్ బదిలీ, పెండింగ్ లావాదేవీలు, ఖాతా మూసివేత ప్రక్రియలను మునుపటి బ్యాంకే చూసుకుంటుంది. వాహనదారులు పదే పదే కొత్త స్టిక్కర్లు కొనాల్సిన అవసరం లేకుండా డిజిటల్ మార్గంలోనే ఈ ప్రక్రియ పూర్తవుతుంది.

ప్రయాణికులకు సులువైన సేవలు

టోల్ ప్లాజాల వద్ద ఫాస్టాగ్ స్కాన్ కాకపోవడం, బ్యాంక్ సర్వర్ డౌన్ కావడం వంటి సమస్యలు వచ్చినప్పుడు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడేవారు. ఈ పోర్టబిలిటీ సౌకర్యం అందుబాటులోకి రావడంతో నాణ్యమైన సేవలు అందించే బ్యాంకింగ్ భాగస్వామిని ఎంచుకునే స్వేచ్ఛ వాహనదారులకు లభించింది. భవిష్యత్తులో శాటిలైట్ ఆధారిత టోల్ వసూలు వ్యవస్థకు ఇది పునాదిగా మారనుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.