ఎఫ్డీ చేసేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా? మీ లాభాన్ని తగ్గించే అంశాలివే
FD Investment Tips: సురక్షితమైన పెట్టుబడి మార్గాల్లో ఫిక్స్డ్ డిపాజిట్ (FD)కు ప్రత్యేక స్థానం ఉంది. మార్కెట్ ఒడిదుడుకులతో సంబంధం లేకుండా నిర్ణీత వడ్డీ లభిస్తుండటంతో చాలామంది ఎఫ్డీల్లో డబ్బు దాచుకుంటారు.
ఎఫ్డీ చేసేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా? మీ లాభాన్ని తగ్గించే అంశాలివే
FD Investment Tips: సురక్షితమైన పెట్టుబడి మార్గాల్లో ఫిక్స్డ్ డిపాజిట్ (FD)కు ప్రత్యేక స్థానం ఉంది. మార్కెట్ ఒడిదుడుకులతో సంబంధం లేకుండా నిర్ణీత వడ్డీ లభిస్తుండటంతో చాలామంది ఎఫ్డీల్లో డబ్బు దాచుకుంటారు. అయితే ఎఫ్డీ చేయడం మాత్రమే కాదు.. అందులో ఎక్కువ రాబడి పొందాలంటే కొన్ని విషయాలు తప్పనిసరిగా తెలుసుకోవాలి. అవేంటో ఇప్పుడు చూద్దాం...
వడ్డీ రేట్లను పోల్చకుండా ఎఫ్డీ చేయకండి
చాలామంది తమకు ఖాతా ఉన్న పాత బ్యాంకులోనే ఎఫ్డీ చేయడానికి ఆసక్తి చూపిస్తారు. ఇతర బ్యాంకులు ఎంత వడ్డీ ఇస్తున్నాయో తెలుసుకునే ప్రయత్నం చేయరు. దీనివల్ల మంచి రాబడిని కోల్పోయే అవకాశం ఉంటుంది. ఉదాహరణకు మీరు రూ.5 లక్షలను మూడేళ్ల కాలానికి ఎఫ్డీ చేయాలనుకుంటున్నారని అనుకుందాం. ఒక బ్యాంకు 6.5 శాతం వడ్డీ ఇస్తుంటే, మరో బ్యాంకు 7.5 శాతం వడ్డీ ఇస్తోంది. వార్షిక చక్రవడ్డీ లెక్కన మూడేళ్ల తర్వాత మొదటి బ్యాంకులో మీ పెట్టుబడి సుమారు రూ.6.04 లక్షలు అవుతుంది. రెండో బ్యాంకులో సుమారు రూ.6.22 లక్షలు అవుతుంది. అంటే వడ్డీలో కేవలం ఒక శాతం తేడా ఉన్నప్పటికీ దాదాపు రూ.18 వేల వరకు అదనపు ఆదాయం పొందవచ్చు. ఎఫ్డీ గడువు ముగిసిన తర్వాత కూడా ఇదే జాగ్రత్త పాటించాలి. చాలామంది పాత ఎఫ్డీని ఎలాంటి పరిశీలన లేకుండా ఆటోమేటిక్గా రెన్యువల్ చేస్తుంటారు. కానీ అప్పటికి బ్యాంకు వడ్డీ రేట్లు తగ్గి ఉండవచ్చు. అందుకే కొత్తగా ఎఫ్డీ చేసేటప్పుడు, పాత ఎఫ్డీని రెన్యువల్ చేసేటప్పుడు వివిధ బ్యాంకుల వడ్డీ రేట్లను తప్పనిసరిగా పోల్చాలి.
మొత్తం డబ్బును ఒకే ఎఫ్డీలో పెట్టకండి
మీ దగ్గర రూ.10 లక్షలు ఉన్నాయని అనుకుందాం. ఆ మొత్తాన్ని ఒకే ఎఫ్డీలో ఐదేళ్ల కాలానికి పెట్టుబడి పెట్టారు. అయితే రెండేళ్ల తర్వాత అనుకోకుండా రూ.3 లక్షలు అవసరమయ్యాయి. అప్పుడు మొత్తం ఎఫ్డీని ముందుగానే క్లోజ్ చేయాల్సి రావచ్చు. గడువు పూర్తికాకముందే డబ్బులు వెనక్కి తీసుకుంటే బ్యాంకులు నిబంధనల ప్రకారం పెనాల్టీ విధిస్తాయి. దీంతో వడ్డీ ఆదాయం తగ్గుతుంది. ఈ సమస్యను నివారించడానికి 'ఎఫ్డీ ల్యాడరింగ్' విధానం ఉపయోగపడుతుంది. అంటే పెద్ద మొత్తాన్ని ఒకే ఎఫ్డీలో పెట్టకుండా చిన్న మొత్తాలుగా విభజించి వేర్వేరు గడువులతో ఎఫ్డీలు చేయాలి. ఉదాహరణకు రూ.10 లక్షలను రూ.2 లక్షల చొప్పున ఐదు ఎఫ్డీలుగా విభజించవచ్చు. వాటిని ఒకటి, రెండు, మూడు, నాలుగు, ఐదేళ్ల కాలపరిమితితో చేయవచ్చు. ఇలా చేస్తే అవసరమైనప్పుడు ఒక ఎఫ్డీని మాత్రమే వినియోగించుకోవచ్చు. మిగిలిన పెట్టుబడిపై వడ్డీ కొనసాగుతుంది. ముందుగానే ఎఫ్డీని రద్దు చేసుకోవాల్సిన పరిస్థితులు కూడా తగ్గుతాయి.
వడ్డీ తీసుకునే విధానాన్ని ఆలోచించి ఎంచుకోండి
ఎఫ్డీలో వడ్డీ పొందడానికి ప్రధానంగా రెండు రకాల పద్ధతులు ఉంటాయి. మొదటిది నాన్ క్యుములేటివ్ ఎఫ్డీ. ఇందులో ప్రతి నెల లేదా మూడు నెలలకు ఒకసారి వడ్డీని మీ ఖాతాలో జమ చేస్తారు. క్రమం తప్పకుండా ఆదాయం కావాలనుకునే వారికి ఈ విధానం ఉపయోగపడుతుంది. ముఖ్యంగా రిటైర్డ్ ఉద్యోగులు, నెలవారీ ఖర్చుల కోసం అదనపు ఆదాయం కోరుకునే వారు దీనిని ఎంచుకోవచ్చు.
రెండోది క్యుములేటివ్ ఎఫ్డీ. ఇందులో వచ్చే వడ్డీని మధ్యలో తీసుకోకుండా అసలు మొత్తానికి కలిపి తిరిగి పెట్టుబడిగా కొనసాగిస్తారు. దీనివల్ల వడ్డీపై కూడా వడ్డీ లభిస్తుంది. అంటే చక్రవడ్డీ ప్రయోజనం పొందవచ్చు. వెంటనే డబ్బులు అవసరం లేకుండా భవిష్యత్తు కోసం పొదుపు చేయాలనుకునే వారికి ఈ విధానం ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి మీకు నెలవారీ ఆదాయం కావాలా? లేక పెట్టుబడి మొత్తాన్ని పెంచుకోవాలా? అనే విషయాన్ని బట్టి సరైన ఎఫ్డీని ఎంచుకోవాలి.
పన్నులు, బ్యాంకు డిపాజిట్ బీమా గురించి తెలుసుకోండి
ఎఫ్డీపై వచ్చే వడ్డీకి కూడా ఆదాయపు పన్ను వర్తిస్తుంది. ఈ వడ్డీని మీ వార్షిక ఆదాయానికి కలిపి, మీరు ఉన్న ఆదాయపు పన్ను శ్లాబ్ ప్రకారం పన్ను విధిస్తారు. ఉదాహరణకు ఒక ఏడాదిలో ఎఫ్డీ ద్వారా రూ.50 వేల వడ్డీ వచ్చిందనుకుందాం. మీరు 30 శాతం పన్ను పరిధిలో ఉంటే, సెస్ వంటి ఇతర వర్తించే పన్నులు మినహాయించి సుమారు రూ.15 వేల పన్ను భారం పడుతుంది. అంటే మీ చేతికి మిగిలేది సుమారు రూ.35 వేలు మాత్రమే. బ్యాంకు టీడీఎస్ (TDS) కట్ చేసిందని పన్ను బాధ్యత పూర్తయినట్లు కాదు. మీ మొత్తం ఆదాయాన్ని బట్టి ఇంకా పన్ను చెల్లించాల్సి రావచ్చు లేదా రీఫండ్ పొందే అవకాశం ఉండవచ్చు. అందుకే ఎఫ్డీపై వచ్చే వడ్డీతో పాటు పన్నులు మినహాయించిన తర్వాత ఎంత మొత్తం చేతికి వస్తుందో లెక్కించుకోవాలి.
మరో ముఖ్యమైన విషయం బ్యాంకు డిపాజిట్లకు లభించే బీమా రక్షణ. డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ (DICGC) నిబంధనల ప్రకారం ఒక బ్యాంకులో ఒకే వ్యక్తికి గరిష్ఠంగా రూ.5 లక్షల వరకు బీమా రక్షణ ఉంటుంది. ఇందులో అసలు పెట్టుబడితో పాటు దానిపై వచ్చిన వడ్డీ కూడా కలిపి లెక్కిస్తారు. ఒకే బ్యాంకులో ఉన్న సేవింగ్స్ ఖాతాలు, ఎఫ్డీలు, ఇతర అర్హత కలిగిన డిపాజిట్లన్నింటినీ కలిపి ఈ పరిమితిని నిర్ణయిస్తారు. కాబట్టి పెద్ద మొత్తంలో డబ్బు పెట్టుబడి పెట్టేవారు ఈ బీమా పరిమితిని కూడా దృష్టిలో ఉంచుకోవాలి. వడ్డీ రేట్లు, పెట్టుబడి కాలపరిమితి, ముందస్తు ఉపసంహరణ పెనాల్టీ, పన్నుల వివరాలను పూర్తిగా పరిశీలించిన తర్వాతే ఎఫ్డీలో డబ్బులు పెట్టాలి. అప్పుడే మీ పొదుపుపై మెరుగైన రాబడిని పొందే అవకాశం ఉంటుంది.




