Job Boom: దీపావళి, దసరా పండగ సీజన్‌లో ఏకంగా 2.5లక్షల కొత్త ఉద్యోగాలు
Job Boom: భారతదేశంలో అతిపెద్ద పండగలైన దీపావళి, ఛత్ పూజ సీజన్ సమీపిస్తున్న తరుణంలో జాబ్ మార్కెట్ ఒక్కసారిగా పుంజుకుంటోంది.
Job Boom
Job Boom: భారతదేశంలో అతిపెద్ద పండగలైన దీపావళి, ఛత్ పూజ సీజన్ సమీపిస్తున్న తరుణంలో జాబ్ మార్కెట్ ఒక్కసారిగా పుంజుకుంటోంది. గ్లోబల్ టెక్నాలజీ, డిజిటల్ టాలెంట్ సొల్యూషన్స్ సంస్థ ఎన్‌ఎల్‌బీ సర్వీసెస్ విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం.. 2026 చివరి నాటికి దేశవ్యాప్తంగా సుమారు 2 లక్షల నుంచి 2.5 లక్షల వరకు సీజనల్, గిగ్ ఉద్యోగాలు పుట్టుకొచ్చే అవకాశం ఉంది. పండగ రద్దీని తట్టుకునేందుకు ఈ-కామర్స్, క్విక్ కామర్స్, రిటైల్, లాజిస్టిక్స్, హాస్పిటాలిటీ, ట్రావెల్ రంగాలు పెద్ద ఎత్తున నియామకాలకు సిద్ధమవుతున్నాయి. గతేడాదితో పోలిస్తే ఈసారి పండగ సీజన్ హైరింగ్‌లో ఏకంగా 15 నుంచి 20 శాతం వరకు వృద్ధి నమోదవుతుందని అంచనా వేస్తున్నారు.
ఈ పండగ సీజన్‌లో కేవలం పెద్ద నగరాలకే పరిమితం కాకుండా చిన్న నగరాలు, టూ-టైర్, త్రీ-టైర్ ప్రాంతాల నుంచి కూడా భారీగా ఉద్యోగ అవకాశాలు రావడం విశేషం. మొత్తం ఉపాధి డిమాండ్‌లో దాదాపు 45 శాతం వాటా ఈ చిన్న నగరాల నుంచే ఉండనుంది. జైపూర్, లక్నో, ఇండోర్, సూరత్, నాగపూర్, చండీగఢ్, కొచ్చి వంటి నగరాల్లో ఈ-కామర్స్, ఆర్గనైజ్డ్ రిటైల్ సంస్థల విస్తరణ కారణంగా హైరింగ్ ఏకంగా 25 నుంచి 30 శాతం వరకు పెరిగే అవకాశం ఉంది. దీనివల్ల స్థానిక యువతకు పెద్ద ఎత్తున ఉపాధి లభించి, పండగ వేళ వారి ఇళ్లలో వెలుగులు నిండనున్నాయి.
కేవలం డెలివరీ బాయ్స్ మాత్రమే కాకుండా, ఈసారి డిజిటల్ మరియు టెక్నాలజీ ఆధారిత రోల్స్‌లో కూడా భారీగా ఉద్యోగాలు సృష్టించబడుతున్నాయి. డార్క్-స్టోర్స్ ఇన్వెంటరీ కంట్రోలర్లు, రిటర్న్ అండ్ రిఫండ్ స్పెషలిస్టులు, కస్టమర్-సొల్యూషన్ ఎగ్జిక్యూటివ్‌లు, మార్కెట్‌ప్లేస్ ఆపరేషన్స్ ప్రొఫెషనల్స్, ఆర్డర్-మేనేజ్‌మెంట్ నిపుణులకు మంచి డిమాండ్ ఏర్పడింది. కంపెనీలు పీక్ సీజన్‌కు 12 నుంచి 14 వారాల ముందే వర్క్‌ఫోర్స్ ప్లానింగ్ ప్రారంభించడం వల్ల, ఒత్తిడిని తగ్గించుకుంటూ పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నాయి.
మరో విశేషం ఏమిటంటే.. ఈసారి ఉపాధి కల్పనలో మహిళలు, ఫ్రెషర్లకు పెద్దపీట వేస్తున్నారు. నాన్-మెట్రో నగరాల్లో కొత్తగా నియమితులయ్యే ఉద్యోగులలో దాదాపు 30 నుంచి 35 శాతం వరకు మహిళలే ఉండే అవకాశం ఉంది. ఫ్లెక్సిబుల్ షిఫ్టులు, ఇంటికి దగ్గర్లోనే జాబ్ లభించడం వల్ల మొదటిసారి ఉద్యోగంలోకి వచ్చే వారికి, గృహిణులకు ఇది చక్కటి అవకాశం. ఈ పండగ సీజన్ తాత్కాలిక నియామకాలు కేవలం కొద్ది రోజులకే పరిమితం కాకుండా, ఎంతోమంది ప్రతిభావంతులకు భవిష్యత్తులో శాశ్వత ఉపాధి మార్గాలకు పునాది వేస్తాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.




