ఓల్డ్ మాంక్ నుంచి రాయల్ ఛాలెంజ్ వరకు.. ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ ఎందుకు కన్నెర్ర చేసింది?
విస్కీ, రమ్ ఉత్పత్తుల్లో నిబంధనలకు విరుద్ధంగా ఫ్లేవరింగ్ వాడారన్న ఆరోపణలతో ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ పలు కంపెనీలపై చర్యలు చేపట్టింది.
FSSAI Whisky Ban
దేశంలోని ప్రముఖ విస్కీ, రమ్ తయారీ సంస్థలపై ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) కీలక చర్యలు చేపట్టింది. నిర్దేశిత ఆహార భద్రత ప్రమాణాలకు అనుగుణంగా లేని కొన్ని విస్కీ, రమ్ ఉత్పత్తుల విక్రయాలను నిలిపివేయాలని ఆదేశించింది. అయితే ఇది ఆయా బ్రాండ్లపై పూర్తిస్థాయి నిషేధం కాదని స్పష్టం చేసింది.
యునైటెడ్ స్పిరిట్స్ (డియాజియో ఇండియా), ఇన్‌బ్రూ బెవరేజెస్, మోహన్ రాకీ స్ప్రింగ్‌వాటర్ సంస్థలు తయారు చేసిన కొన్ని ఉత్పత్తులపై ఈ చర్య ప్రభావం చూపుతోంది. ప్రయోగశాల పరీక్షల్లో అనుమతించని కృత్రిమ లేదా ‘నేచర్-ఐడెంటికల్’ ఫ్లేవరింగ్ పదార్థాలను ఉపయోగించినట్లు గుర్తించామని ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ పేర్కొంది.
ఏ ఉత్పత్తులపై చర్య?
ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ ప్రకారం.. యాంటిక్విటీ బ్లూ విస్కీ, రాయల్ ఛాలెంజ్ విస్కీ, మెక్‌డోవెల్స్ నంబర్ 1 రమ్, బాగ్‌పైపర్ డీలక్స్ విస్కీ, ఓల్డ్ కాస్క్ డీలక్స్ రమ్‌తో పాటు ఓల్డ్ మాంక్‌కు చెందిన మూడు రమ్ వేరియంట్లను ‘నిర్దేశిత ప్రమాణాలకు అనుగుణంగా లేని ఉత్పత్తులు’గా వర్గీకరించింది.
ఈ ఉత్పత్తులను ప్రామాణిక విస్కీ లేదా రమ్ పేరుతో విక్రయిస్తున్నప్పటికీ, వాటికి నిర్దేశించిన ప్రమాణాలను పాటించడం లేదని నియంత్రణ సంస్థ ఆరోపించింది. ఫ్లేవర్డ్ స్పిరిట్‌గా పేర్కొనాల్సిన ఉత్పత్తులను ప్రామాణిక విస్కీ, రమ్‌గా చూపిస్తున్నారని అభ్యంతరం వ్యక్తం చేసింది.
అసలు వివాదం ఏంటి?
విస్కీ, రమ్ రుచులు, వాసనలు ఎలా ఏర్పడతాయన్నదే ఈ వివాదానికి ప్రధాన కారణం. భారత ఆహార భద్రత ప్రమాణాల ప్రకారం ఈ రకాల మద్యం ఉత్పత్తుల్లో రుచి, వాసన సహజంగా ఏర్పడేలా కిణ్వ ప్రక్రియ, స్వేదనం, మిశ్రమం, పరిపక్వత వంటి ప్రక్రియలు ఉండాలని ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ పేర్కొంది.
అయితే కొందరు తయారీదారులు తటస్థ స్పిరిట్‌లో బయట నుంచి ‘విస్కీ ఫ్లేవర్’, ‘రమ్ ఫ్లేవర్’ వంటి పదార్థాలను కలిపి రుచి, వాసనను తీసుకొచ్చినట్లు ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ ఆరోపించింది. సహజంగా పరిపక్వత సమయంలో ఏర్పడే లక్షణాలను ఫ్లేవరింగ్ పదార్థాలతో అనుకరిస్తున్నారని పేర్కొంది.
విస్కీ, రమ్‌లో పరిపక్వత ఎందుకు కీలకం?
విస్కీతో పాటు కొన్ని రకాల రమ్‌లలో పరిపక్వత ప్రక్రియకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంటుంది. మద్యం ఎక్కువకాలం చెక్క పీపాల్లో నిల్వ ఉన్న సమయంలో వాటితో పరస్పర చర్య జరగడం వల్ల రంగు, వాసన, రుచి క్రమంగా అభివృద్ధి చెందుతాయి.
ఈ లక్షణాలు తయారీ, పరిపక్వత ప్రక్రియల ద్వారా సహజంగా ఏర్పడాలి కానీ బయట నుంచి ఫ్లేవరింగ్ పదార్థాలను జోడించడం ద్వారా తీసుకురావడం సరికాదన్నది ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ వాదన.
కొన్ని ఉత్పత్తుల లేబుళ్లపై పేర్కొన్న పరిపక్వతకు సంబంధించిన వివరాలపైనా నియంత్రణ సంస్థ అభ్యంతరం వ్యక్తం చేసింది. కొన్ని మిశ్రమాల్లో ఉపయోగించిన పరిపక్వమైన స్పిరిట్ పరిమాణం లేబుల్‌పై పేర్కొన్న వయసు వివరాలను సమర్థించదని ఆరోపించింది.
కంపెనీలు ఏం చెబుతున్నాయి?
ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ ఆదేశాన్ని యునైటెడ్ స్పిరిట్స్ బాంబే హైకోర్టులో సవాలు చేసింది. ప్రభావిత ఉత్పత్తుల లేబుళ్లపై ఉన్న వివరాలు భారతదేశంలోని అమల్లో ఉన్న చట్టాలు, నియంత్రణ నిబంధనలకు అనుగుణంగానే ఉన్నాయని కంపెనీ వాదించింది. అలాగే ఇవి పరిశ్రమలో చాలా కాలంగా అమల్లో ఉన్న విధానాలకు అనుగుణంగా ఉన్నాయని తెలిపింది.
ఇన్‌బ్రూ బెవరేజెస్, మోహన్ రాకీ స్ప్రింగ్‌వాటర్ నుంచి ఈ అంశంపై ఇప్పటివరకు వివరణాత్మక బహిరంగ స్పందన వెలువడలేదు.
వినియోగదారులపై ప్రభావం ఎలా ఉంటుంది?
ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ చర్య నిర్దిష్ట తయారీ కేంద్రాల్లో తయారైన కొన్ని ఉత్పత్తులకు మాత్రమే వర్తిస్తుంది. కాబట్టి ఈ బ్రాండ్లకు చెందిన అన్ని ఉత్పత్తులపై దేశవ్యాప్తంగా పూర్తిస్థాయి నిషేధం విధించినట్లు భావించాల్సిన అవసరం లేదు.
కోర్టు కేసు, తదుపరి నియంత్రణ చర్యల ఫలితాన్ని బట్టి ఆయా సంస్థలు ఉత్పత్తుల తయారీ విధానాల్లో మార్పులు చేయాల్సి రావచ్చు. ఉత్పత్తుల ఫార్ములాను మార్చడం లేదా లేబుళ్లపై వివరాలను సవరించడం వంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది.
మద్యం పరిశ్రమకు ఎందుకు కీలకం?
భారత్‌లో దాదాపు 40 బిలియన్ డాలర్ల విలువైన మద్యం పరిశ్రమలో ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ చేపట్టిన ముఖ్యమైన నియంత్రణ చర్యల్లో ఇది ఒకటిగా నిలిచింది. మద్యం ఉత్పత్తుల తయారీ, లేబులింగ్, మార్కెటింగ్‌కు సంబంధించిన ప్రమాణాలను మరింత కఠినంగా అమలు చేయాలనే నియంత్రణ సంస్థ వైఖరిని ఇది సూచిస్తోంది.
ఈ వ్యవహారం కొన్ని బ్రాండ్లకే పరిమితం కాకుండా మొత్తం విస్కీ, రమ్ పరిశ్రమపై ప్రభావం చూపే అవకాశం ఉంది. కోర్టు తీర్పు, నియంత్రణ సంస్థ తదుపరి నిర్ణయాల ఆధారంగా తయారీ విధానాలు, లేబులింగ్ నిబంధనలు, నియంత్రణ ప్రమాణాల్లో మార్పులు రావచ్చని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.




