Baby Food: శిశువుల ఆహారంపై FSSAI కీలక నిర్ణయం.. ఇక నో షుగర్
Baby Food: దేశంలోని చిన్నారుల ఆరోగ్యాన్ని కాపాడే దిశగా భారతీయ ఆహార భద్రతా ప్రమాణాల ప్రాధికార సంస్థ (FSSAI) ఒక అత్యంత కీలకమైన నిర్ణయం తీసుకుంది.
FSSAI Baby Food Rules
Baby Food: దేశంలోని చిన్నారుల ఆరోగ్యాన్ని కాపాడే దిశగా భారతీయ ఆహార భద్రతా ప్రమాణాల ప్రాధికార సంస్థ (FSSAI) ఒక అత్యంత కీలకమైన నిర్ణయం తీసుకుంది. ఆరు నెలల వయసు వరకు ఉండే శిశువుల కోసం మార్కెట్లో తయారు చేసే బేబీ ఫుడ్లో సుక్రోజ్ అలాగే ఫ్రక్టోజ్ వంటి చక్కెరలను కలపకూడదని నిషేధిస్తూ ఒక కొత్త ముసాయిదాను విడుదల చేసింది. ప్రస్తుతం అమలులో ఉన్న ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ (ఇన్ఫాంట్ న్యూట్రిషన్) రెగ్యులేషన్స్, 2020 చట్టంలో సవరణలు చేస్తూ ఈ తాజా ప్రతిపాదనను రూపొందించారు. చిన్ననాటి నుంచే పిల్లలు అదనపు చక్కెరల బారిన పడకుండా రక్షించడం ఈ నిబంధనల ప్రధాన ఉద్దేశంగా నిపుణులు చెబుతున్నారు.
ప్రస్తుత నిబంధనల ప్రకారం బేబీ ఫుడ్ తయారీలో లాక్టోస్, గ్లూకోజ్ పాలిమర్లతో పాటు అవసరమైన మేరకు సుక్రోజ్ లేదా ఫ్రక్టోజ్ను కూడా ఒక నిర్దిష్ట పరిమితిలో ఉపయోగించడానికి తయారీదారులకు అనుమతి ఉంది. అయితే తాజా సవరణల ద్వారా ఆ వెసులుబాటును పూర్తిగా తొలగించాలని ఎఫ్ఎస్ఎస్ఏఐ నిర్ణయించింది. ఆరు నెలల లోపు వయసున్న పసిపిల్లలకు అందించే ఎలాంటి ఆహార పదార్థాలలోనూ ఈ కృత్రిమ తీపి పదార్థాలను జోడించడానికి వీలుండదు. ఈ నిబంధనలు కనుక పూర్తిగా అమల్లోకి వస్తే కంపెనీలు పసిపిల్లల ఆహారంలో ఏ రకమైన చక్కెరలను కలపడం చట్టవిరుద్ధం అవుతుంది.
శిశువుల జీవితంలో మొదటి ఆరు నెలలు వారి శారీరక అలాగే మానసిక ఎదుగుదలకు అత్యంత కీలకమైన సమయమని శాస్త్రవేత్తలు, వైద్యులు చెబుతున్నారు. ఈ సమయంలో తల్లిపాలు లేదా ఎలాంటి అదనపు రసాయనాలు లేని స్వచ్ఛమైన పోషకాహారం మాత్రమే వారికి అవసరం. అనవసరమైన సుక్రోజ్, ఫ్రక్టోజ్ వంటి పదార్థాలు చేర్చడం వల్ల చిన్నారుల్లో చిన్న వయసులోనే ఊబకాయం అలాగే ఇతర అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. ప్రజాారోగ్యాన్ని కాపాడే దిశగా ప్రభుత్వాలు తీసుకుంటున్న ఆరోగ్యకరమైన చర్యలలో భాగంగానే ఈ నిబంధనలను రూపొందించినట్లు తెలుస్తోంది.
ఈ కొత్త నిబంధనలకు సంబంధించిన ముసాయిదాను ఎఫ్ఎస్ఎస్ఏఐ ఇప్పటికే ప్రజల ముందుంచింది. అధికారిక గెజిట్లో ఈ నోటిఫికేషన్ వెలువడిన తేదీ నుంచి సరిగ్గా 60 రోజుల సమయం ఇచ్చి, ఈ అంశంపై ఆయా వర్గాల నుంచి సలహాలు అలాగే అభ్యంతరాలను ఆహ్వానించింది. నిర్ణీత గడువులోగా అందే అభిప్రాయాలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత తుది చట్ట రూపకల్పన చేయనున్నారు. ఈ నిర్ణయం ద్వారా పసిపిల్లల ఆహార నాణ్యతను పెంచడంతో పాటు తయారీదారులు మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించేలా చేయాలని ఆహార భద్రతా నియంత్రణ మండలి భావిస్తోంది.




