Fuel Crisis : పెట్రోల్, డీజిల్ కోసం యుద్ధం.. అర్ధరాత్రి నుంచి కిలోమీటర్ల మేర క్యూలైన్లు.. బంకుల్లో నో స్టాక్ బోర్డులు
Fuel Crisis : మహారాష్ట్రలో తీవ్ర ఇంధన సంక్షోభం నెలకొంది. పెట్రోల్, డీజిల్ కోసం కిలోమీటర్ల మేర క్యూలైన్లు కనిపిస్తుండగా, అనేక జిల్లాల్లో బంకులు మూతపడటంతో జనం విలవిలలాడుతున్నారు.
Fuel Crisis
Fuel Crisis : మహారాష్ట్ర వ్యాప్తంగా ఊహించని విధంగా ఇంధన సంక్షోభం ముంచుకొచ్చింది. రాష్ట్రంలోని దాదాపు అన్ని జిల్లాల్లో పెట్రోల్, డీజిల్ కొరత తీవ్రరూపం దాల్చింది. వాహనదారులు, ప్రజలు ఇంధనం కోసం చుక్కలు చూస్తున్నారు. ప్రధాన నగరాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో సైతం పెట్రోల్ బంకుల వద్ద రెండు నుంచి మూడు కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరాయి. చుక్క పెట్రోల్ దొరుకుతుందనే ఆశతో సామాన్య ప్రజలు అర్ధరాత్రి నుంచి బంకుల వద్ద పడిగాపులు కాస్తున్నారు. తీవ్రమైన ఎండలను సైతం లెక్కచేయకుండా జనం క్యూలైన్లలో గంటల తరబడి నిల్చుంటున్నారు. స్టాక్ పూర్తిగా అయిపోవడంతో రాష్ట్రవ్యాప్తంగా వందలాది పెట్రోల్ బంకులు బోర్డులు తిప్పేయడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.
ఇంధన కొరత కారణంగా విద్యా సంస్థలు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఛత్రపతి శంభాజీనగర్‌లో పదికి పైగా పెట్రోల్ బంకులు పూర్తిగా మూతపడ్డాయి. పరీక్షల సమయం కావడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆయుష్ తాతే అనే నీట్ విద్యార్థి ఉదయం 11 గంటల నుంచి మూడు, నాలుగు బంకులు తిరిగినా పెట్రోల్ దొరకలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. చివరకు ఒక బంకు వద్దకు వెళ్లేసరికి తన వంతు వచ్చే సరికి స్టాక్ అయిపోయిందని బోర్డు పెట్టారు. బండిలో పెట్రోల్ పూర్తిగా అయిపోవడంతో, చేసేదేం లేక ఆ విద్యార్థి ఎండలో మూడు కిలోమీటర్ల దూరం తన స్కూటీని నెట్టుకుంటూ ఇంటికి వెళ్లాల్సి వచ్చింది. పెట్రోల్ కోసం తిరగడానికే సమయం సరిపోతుంటే ఇక చదువుకునేది ఎప్పుడు అంటూ విద్యార్థులు వాపోతున్నారు.
అర్ధరాత్రి దాటినా తగ్గని రద్దీ
జలగావ్ నగరం, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా పరిస్థితి ఏమాత్రం మారలేదు. వివిధ ప్రాంతాల్లోని ఏడు ప్రధాన పెట్రోల్ బంకులను పరిశీలించగా, అందులో ఆరు బంకులు స్టాక్ లేకపోవడంతో పూర్తిగా మూసివేశారు. కేవలం ఒకే ఒక్క బంకులో పెట్రోల్ అందుబాటులో ఉండటంతో జనం అక్కడికి ఎగబడ్డారు. జాతీయ రహదారిపై ఉన్న ఒక బంకు వద్ద అర్ధరాత్రి 12 గంటల తర్వాత కూడా కార్లు, బైకులు, డబ్బాలతో వచ్చిన జనంతో జాతరను తలపించింది. సీసాలు, డబ్బాలలో ఇంధనం పోయకూడదని కలెక్టర్ ఆదేశాలు ఉన్నప్పటికీ, పరిస్థితి అదుపు తప్పడంతో బంకు నిర్వాహకులు నిబంధనలను పక్కనబెట్టి డబ్బాల్లో ఇంధనాన్ని విక్రయించాల్సి వస్తోంది.
డీజిల్ కోసం 50 కిలోమీటర్లు ప్రయాణిస్తున్న రైతులు
ఈ ఇంధన సంక్షోభం మహారాష్ట్రలోని అన్నదాతలను కోలుకోలేని దెబ్బతీస్తోంది. ప్రస్తుతం వ్యవసాయ పనులు ఊపందుకుంటున్న సమయంలో డీజిల్ కొరత రావడం రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. అకోలా, బుల్దానా, వాషిమ్ జిల్లాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో డీజిల్ అస్సలు దొరకడం లేదు. దీనితో రైతులు తమ ట్రాక్టర్లు, పంపుసెట్ల కోసం డీజిల్ తెచ్చుకోవడానికి దాదాపు 40 నుంచి 50 కిలోమీటర్ల దూరం ప్రయాణించి పట్టణ ప్రాంతాలకు వస్తున్నారు. పెద్ద పెద్ద డ్రమ్ములు, క్యాన్లు పట్టుకుని బంకుల వద్ద వేచి చూస్తున్నారు. చేతికి అందే దశలో ఉన్న పంటలను కాపాడుకోవడానికి డీజిల్ ఎంతో అవసరమని, ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోకపోతే వ్యవసాయ రంగం పూర్తిగా దెబ్బతింటుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ధరకు రెక్కలు.. నిబంధనల పేరుతో తిప్పలు
ఒకవైపు ఇంధన కొరత వేధిస్తుంటే, మరోవైపు ధరల పెరుగుదల ప్రజల నడుము విరుస్తోంది. గత పది రోజుల్లోనే పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడం ఇది మూడోసారి. అహల్యానగర్‌లో పెట్రోల్ లీటరుకు 90 పైసలు, డీజిల్ 95 పైసలు పెరిగింది. ప్రస్తుతం అక్కడ లీటర్ పెట్రోల్ రూ.108.87, డీజిల్ రూ.95.47 పలుకుతోంది. దీనికి తోడు వాషిమ్ జిల్లాలో ఇంధన పంపిణీకి అధికారులు కొత్త నిబంధనలు, డాక్యుమెంట్లు కావాలని కోరడంతో రైతులు అర్ధరాత్రి నుంచి క్యూలో నిలబడినా ప్రయోజనం లేకుండా పోతోంది. జలగావ్‌లోని కొన్ని ప్రాంతాల్లో పెట్రోల్ ఇవ్వడం లేదని కస్టమర్లు బంకులపై దాడులకు దిగుతున్నారు. జనం సహనం కోల్పోయి తోపులాటలు జరుగుతుండటంతో, భద్రత లేక బంకు యజమానులు అమ్మకాలను నిలిపివేస్తున్నారు.




