Petrol Diesel Prices : యుద్ధం ఎఫెక్ట్ ఉన్నా సామాన్యుడికి గుడ్ న్యూస్.. తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు

Petrol Diesel Prices : మార్చి 15న దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలు మిశ్రమంగా ఉన్నాయి. అంతర్జాతీయంగా క్రూడాయిల్ 100 డాలర్లు దాటినా, చెన్నైలో ధరలు తగ్గగా, హైదరాబాద్‌లో స్థిరంగా ఉన్నాయి.

CR Reddy
Published on: 15 March 2026 9:43 AM IST
Petrol Diesel Prices
X

Petrol Diesel Prices

Petrol Diesel Prices : అంతర్జాతీయంగా యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ, సామాన్యుడి జేబుకు చిల్లు పడేలా ముడి చమురు ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇరాన్ – ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల వల్ల గ్లోబల్ మార్కెట్‌లో క్రూడాయిల్ ధర బ్యారెల్‌కు 100 డాలర్ల మార్కును దాటేసింది. ఇలాంటి గడ్డు పరిస్థితుల్లో కూడా భారతీయ మెట్రో నగరాల్లో ఇంధన ధరలు మిశ్రమంగా ఉండటం గమనార్హం. మార్చి 15, 2026 నాటికి అందిన సమాచారం ప్రకారం.. కొన్ని నగరాల్లో రేట్లు స్వల్పంగా తగ్గగా, మరికొన్ని చోట్ల పైసల రూపంలో వడ్డింపు తప్పలేదు.

దేశ రాజధాని ఢిల్లీ, ఆర్థిక రాజధాని ముంబైలలో ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. ఐఓసీఎల్ (IOCL) గణాంకాల ప్రకారం, ఢిల్లీలో లీటరు పెట్రోల్ రూ.94.77 వద్ద, డీజిల్ రూ.87.67 వద్ద ఉంది. దేశంలోని ప్రధాన మెట్రో నగరాల్లో పెట్రోల్ రూ.100 లోపు, డీజిల్ రూ.90 లోపు లభిస్తున్న ఏకైక నగరం ఢిల్లీ మాత్రమే. ఇక ముంబైలో పెట్రోల్ ధర రూ.103.54 గా ఉండగా, డీజిల్ రూ.90.03 వద్దే మార్పు లేకుండా ఉంది. మిగతా నగరాలతో పోలిస్తే ఇక్కడ ధరల భారం కాస్త ఎక్కువగా ఉన్నప్పటికీ, ప్రస్తుతానికి రేట్లు పెరగకపోవడం వాహనదారులకు ఊరటనిచ్చే విషయమే.

దక్షిణాది మెట్రో నగరం చెన్నైలో వాహనదారులకు ఈరోజు మంచి వార్త అందింది. ఇక్కడ పెట్రోల్ ధర లీటరుకు 18 పైసలు తగ్గి రూ.100.80కి చేరగా, డీజిల్ ధర 9 పైసలు తగ్గి రూ.92.39కి చేరింది. అయితే కోల్‌కతాలో మాత్రం పెట్రోల్ ధర స్వల్పంగా 5 పైసలు పెరిగి రూ.105.45 వద్ద ట్రేడ్ అవుతోంది. మన భాగ్యనగరం హైదరాబాద్ విషయానికి వస్తే, లీటరు పెట్రోల్ సుమారు రూ.107.46 వద్ద స్థిరంగా ఉంది. అంతర్జాతీయంగా ఎన్ని ఒడుదొడుకులు ఉన్నా, హైదరాబాద్‌లో మాత్రం రేట్లు స్థిరంగా ఉండటం విశేషం.

ముడి చమురు ధరల విషయానికి వస్తే.. పరిస్థితి కాస్త ఆందోళనకరంగానే ఉంది. ఫిబ్రవరి చివర నుంచి ఇప్పటివరకు బ్రెంట్ ముడి చమురు ధర ఏకంగా 45 శాతం పెరిగి బ్యారెల్‌కు 103.14 డాలర్ల వద్ద ఉంది. అలాగే అమెరికన్ డబ్ల్యూటీఐ ముడి చమురు ధర కూడా 51 శాతం వృద్ధితో 98.71 డాలర్లకు చేరింది. హార్ముజ్ జలసంధి వద్ద యుద్ధ వాతావరణం వల్ల సరఫరాకు ఆటంకం ఏర్పడే ప్రమాదం ఉన్నా, భారత్‌లో ఇంధన నిల్వలకు ఎలాంటి కొరత లేదని కేంద్ర ప్రభుత్వం భరోసా ఇస్తోంది. భవిష్యత్తులో ఇంధన సంక్షోభం తలెత్తకుండా తగిన చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు స్పష్టం చేశారు.

CR Reddy

CR Reddy

Next Story