Gas Crisis Charges: నిమ్మరసానికి గ్యాస్ సర్ ఛార్జీ.. సందు దొరికిందని దోచేస్తున్నారు

Gas Crisis Charges: యుద్ధం నేపథ్యంలో వంట గ్యాస్ ఇక్కట్లు వచ్చాయి.దీంతో రెస్టారెంట్లు.. కేఫ్ లు గ్యాస్ క్రైసిస్ చార్జీ పేరుతో కస్టమర్స్ జేబులు ఖాళీ చేసేస్తున్నాయి

KVD Varma
Published on: 16 March 2026 6:50 PM IST
Gas Crisis Charges: యుద్ధం నేపథ్యంలో వంట గ్యాస్ ఇక్కట్లు వచ్చాయి.
X

Gas Crisis Charges

Gas Crisis Charges: సందు దొరికితే చాలు దోచేసుకోవడానికి మన వ్యాపారులు రెడీగా ఉంటారు. చిన్న అవకాశం దొరికితే చాలు ఎడాపెడా ధరలు పెంచేసి సామాన్యుల నడ్డి విరిచేస్తారు. అలాంటి వ్యాపారులకు ఇప్పుడు మధ్య ప్రాచ్యంలో యుద్ధం ఒక బంగారు బాతులా దొరికింది. ఒక పక్క యుద్ధ నేపథ్యంలో గ్యాస్ దొరకక ప్రజలు ఇబ్బందులు పాడుతున్నారు. ఇంకో పక్క వాణిజ్య సిలెండర్ ధర పెరిగిందని హోటల్స్ అందినకాడికి దోచుకోవడం మొదలు పెట్టారు. గతంలోనూ ఇలాంటి ఇబ్బందులు వచ్చిన సమయంలో ఇష్టానుసారంగా ధరలను పెంచేసి దోచుకోవడం జరిగిన సంఘటనలు చాలా ఉన్నాయి. కానీ, ఇప్పుడు గ్యాస్ క్రైసిస్ ఛార్జీ పేరుతో కొన్ని హోటళ్లు చేస్తున్న దోపిడీ మామూలుగా లేదు.

తాగింది నిమ్మరసం.. దానికి గ్యాస్ క్రైసిస్ ఫీజు అదనం..

బెంగళూరులోని ఒక కేఫ్ కి ఇద్దరు వ్యక్తులు వెళ్లి రెండు పుదీనా నిమ్మరసం తాగారు. తాగిన తరువాత వచ్చిన బిల్లు చూసి అవాక్కయ్యారు. ఎందుకంటే, రెండు నిమ్మరసాలకుక్ వారికి వచ్చిన బిల్లు అక్షరాలా ₹374 వేశారు. అక్కడ ఒక్కో నిమ్మరసం ఖరీదు మామూలుగా అయితే ₹179. దీనిపై 5% డిస్కౌంట్ ఉందని చెప్పారు. అంటే డిస్కౌంట్ పోను రెండు నిమ్మరసాలకు మొత్తం ₹340 రూపాయలు ప్లస్ 5% జీఎస్టీతో కలిపి ₹357 అవ్వాలి. కానీ బిల్లు మొత్తం ₹374 వేశారు. ఏమిటిలా అని చూస్తే.. బిల్లు చివర్లో గ్యాస్ క్రైసిస్ ఛార్జెస్ 5% అని కలిపారు. అంటే, డిస్కౌంట్ ఇచ్చిన సొమ్ము గ్యాస్ పేరుతొ లాగేశారు. దీంతో ఆ కస్టమర్లు అవాక్కవడమే కాకుండా ఈ బిల్లును సోషల్ మీడియా X లో పోస్ట్ చేశారు. ఆ పోస్ట్ మీరూ చూసేయండి.



ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు కూడా అవాక్కయ్యారు. ఇక్కడ నిమ్మరసం తయారు చేయడానికి గ్యాస్ ఎందుకు వాడతారు? అనేది పెద్ద ప్రశ్నగా మారింది. దారుణంగా దోచుకోవడం అంటే ఇదే కదా అని నెటిజన్లు అంటున్నారు.

ఇదే హ్యాండిల్ లో ఇంకో బిల్లు కూడా దర్శనమిచ్చింది. అది మరీ దారుణం. ఆ బిల్లు ప్రకారం రెండు ఇడ్లి, ఒక వడ మొత్తం 66 రూపాయలు. దానికి గ్యాస్ క్రైసిస్ ఛార్జీ 5% అంటే 9:52 రూపాయలు. మొత్తం బిల్లు 76.18 రూపాయలు. దీనికి 5% జీఎస్టీ కలిపి 80 రూపాయలు వేశారు. ఇక్కడ విశేషం ఏమిటంటే గ్యాస్ క్రైసిస్ ఛార్జీలకు కూడా జీఎస్టీ వేశారు. ఈ బిల్లు కూడా ఇక్కడ చూడొచ్చు..




మొత్తం మీద మధ్య ప్రాచ్యంలో యుద్ధం జరుగుతుంటే.. ఇక్కడ మన జేబులు ఖాళీ చేసేస్తున్నారు కొందరు కేఫ్ యజమానులు. ఈ బిల్లులను X లో చూసిన నెటిజనం ఇదేమి దోపిడీ బాబులూ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. వాటిలో కొన్ని ఇక్కడ మీరూ చూడొచ్చు.








KVD Varma

KVD Varma

Next Story