Gautam Adani: ఆసియా కుబేరుడిగా అదానీ గ్రాండ్ రీఎంట్రీ.. 72 గంటల్లోనే తిరుగులేని రికార్డు
Gautam Adani: ప్రముఖ పారిశ్రామికవేత్త, అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ కేవలం 72 గంటల వ్యవధిలోనే తన అగ్రస్థానాన్ని తిరిగి సాధించారు.
Gautam Adani
Gautam Adani: ప్రముఖ పారిశ్రామికవేత్త, అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ కేవలం 72 గంటల వ్యవధిలోనే తన అగ్రస్థానాన్ని తిరిగి సాధించారు. కొన్ని రోజుల క్రితం చైనాకు చెందిన ప్రముఖ షార్ట్ వీడియో యాప్ టిక్‌టాక్ మాతృ సంస్థ బైట్‌డాన్స్ సహ వ్యవస్థాపకుడు అయిన జాంగ్ యిమింగ్ అదానీని వెనక్కి నెట్టి ఆసియాలోనే అత్యంత సంపన్నుడిగా అవతరించారు. అయితే గురువారం అదానీ గ్రూప్ షేర్లు పుంజుకోవడంతో ఒక్కసారిగా అదానీ సంపద గణనీయంగా పెరిగింది. దీనితో జాంగ్ యిమింగ్ను అధిగమించి అదానీ మళ్లీ ఆసియాలోనే నంబర్ వన్ ధనవంతుడిగా నిలిచారు.
బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ తాజా నివేదిక ప్రకారం.. గౌతమ్ అదానీ నికర సంపద 106 బిలియన్ డాలర్లకు చేరుకోగా, చైనాకు చెందిన జాంగ్ యిమింగ్ నెట్‌వర్త్ 105 బిలియన్ డాలర్లుగా ఉంది. అంటే అదానీ ప్రస్తుతం జాంగ్ యిమింగ్ కంటే దాదాపు 1 బిలియన్ డాలర్ల ఆధిక్యంలో ఉన్నారు. ప్రపంచ కుబేరుల జాబితాలో అదానీ 18వ స్థానంలో నిలవగా, జాంగ్ యిమింగ్ 19వ స్థానానికి పడిపోయారు. ఇక ఆసియా టాప్-5 జాబితాలో మొదటి స్థానంలో గౌతమ్ అదానీ, రెండో స్థానంలో జాంగ్ యిమింగ్ ఉండగా, భారతీయ దిగ్గజం ముఖేష్ అంబానీ 81.9 బిలియన్ డాలర్ల సంపదతో మూడో స్థానంలో కొనసాగుతున్నారు.
మంగళవారం నాటి ట్రేడింగ్‌లో అదానీ గ్రూప్ షేర్లు భారీగా పడిపోవడంతో గౌతమ్ అదానీ ఒక్కరోజే సుమారు 4.44 బిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో సుమారు రూ.42,000 కోట్లు) నష్టపోయారు. దీంతో ఆయన బ్లూమ్‌బెర్గ్ ఇండెక్స్‌లో 20వ స్థానానికి పడిపోయారు. కానీ మార్కెట్లు మళ్లీ కోలుకోవడం, అదానీ గ్రూప్ కంపెనీల షేర్లు లాభాల బాట పట్టడంతో కేవలం మూడు రోజుల్లోనే ఆయన తన హోదాను తిరిగి దక్కించుకున్నారు. మరోవైపు టెస్లా అధినేత ఎలన్ మస్క్ సంపద భారీగా పెరిగి, ఆయన ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడిగా కొనసాగుతున్నారు.




