Gig Workers : స్విగ్గీ, జొమాటో, ఓలా, ఉబెర్ వర్కర్లకు గుడ్ న్యూస్.. ఇకపై వీరికి కూడా పెన్షన్, ఇన్సూరెన్స్
Gig Workers : యాప్ ఆధారిత గిగ్ వర్కర్ల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. స్విగ్గీ, జొమాటో, ఓలా వంటి కంపెనీలు తమ వర్కర్లను జూన్ 21 లోగా ఈ-శ్రమ్ పోర్టల్‌లో నమోదు చేయడం తప్పనిసరి చేసింది.
Gig Workers
Gig Workers : భారతదేశంలో డిజిటల్ విప్లవం తర్వాత యాప్ ఆధారిత సేవల రంగం విపరీతంగా దూసుకుపోతోంది. అయితే ఈ రంగంలో రాత్రి పగలూ కష్టపడే డెలివరీ బాయ్స్, డ్రైవర్లకు ఇప్పటివరకు ఎలాంటి చట్టపరమైన రక్షణ ఉండేది కాదు. ఈ సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తూ కేంద్ర ప్రభుత్వం ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. స్విగ్గీ, జొమాటో, ఉబెర్, ఓలా, రాపిడో, బ్లింకిట్, జెప్టో వంటి యాప్-ఆధారిత ప్లాట్‌ఫామ్స్‌లో పనిచేసే లక్షలాది మంది గిగ్ వర్కర్లకు సామాజిక భద్రత కల్పించేందుకు ప్రభుత్వం ముందడుగు వేసింది.
జూన్ 21 లోగా ఈ-శ్రమ్ రిజిస్ట్రేషన్ తప్పనిసరి
కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ తాజా నివేదిక ప్రకారం.. అన్ని యాప్ ఆధారిత కంపెనీలు తమ వద్ద పనిచేసే గిగ్ వర్కర్ల డేటాను ఈ-శ్రమ్ పోర్టల్‌తో అనుసంధానం చేయాలని ఆదేశించింది. దీనికి జూన్ 21 ని ఆఖరి గడువుగా నిర్ణయించింది. కోడ్ ఆన్ సోషల్ సెక్యూరిటీ పరిధిలోకి వచ్చే కొత్త నిబంధనల ప్రకారం, ఏజెన్సీలు లేదా కంపెనీలు తమ ప్లాట్‌ఫామ్‌లలో కొత్తగా చేరిన వర్కర్లను 45 రోజుల్లోగా అధికారికంగా నమోదు చేయాల్సి ఉంటుంది. దీనివల్ల దేశవ్యాప్తంగా ఉన్న అసంఘటిత కార్మికులందరికీ ఒకే గొడుగు కిందకు తెచ్చే అవకాశం కలుగుతుంది.
పెన్షన్, హెల్త్ ఇన్సూరెన్స్‌తో సామాజిక భద్రత
ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ముఖ్య ఉద్దేశ్యం డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌పై ఆధారపడి బతుకుతున్న యువతకు పూర్తి స్థాయి సామాజిక భద్రతా ప్రయోజనాలను అందించడమే. ఈ డేటాబేస్ సిద్ధమైన తర్వాత, కేంద్ర ప్రభుత్వం వీరికి ఉచిత హెల్త్ ఇన్సూరెన్స్, ప్రమాద బీమా, భవిష్యత్తు కోసం ప్రత్యేక పెన్షన్ స్కీమ్‌లను వర్తింపజేయనుంది. అంతేకాకుండా, ఈ ప్రక్రియ ద్వారా ప్రతి గిగ్ వర్కర్‌కు ఒక ప్రత్యేక జాతీయ గుర్తింపు కార్డు లభిస్తుంది. దీనివల్ల వారు ఒక కంపెనీ నుంచి మరో కంపెనీకి మారినా లేదా వేరే రాష్ట్రానికి వెళ్లినా వారి ప్రయోజనాలకు ఎలాంటి ఢోకా ఉండదు.
నిబంధనలు ఉల్లంఘిస్తే కంపెనీలకు భారీ జరిమానాలు
ప్రభుత్వం విధించిన జూన్ 21 గడువును ఏ కంపెనీ అయినా బద్దలు కొడితే లేదా నిర్లక్ష్యం వహిస్తే సోషల్ సెక్యూరిటీ కోడ్ చట్టం ప్రకారం కఠినమైన చర్యలు, భారీ పెనాల్టీలు ఉంటాయని మంత్రిత్వ శాఖ హెచ్చరించింది. కొత్త రూల్స్ ప్రకారం.. ఏడాదిలో కనీసం 90 రోజుల పాటు ఏదైనా ఒక కంపెనీలో లేదా విభిన్న యాప్స్‌లో కలిపి మొత్తం 120 రోజులు పనిచేసిన ప్రతి ఒక్కరినీ గిగ్ వర్కర్ గానే గుర్తిస్తారు. అలాగే కంపెనీలలో రోజువారీగా లేదా రియల్ టైమ్ బేసిస్‌లో కొత్తగా చేరే, అలాగే ఉద్యోగం మానేసే వర్కర్ల లైవ్ సమాచారాన్ని సెంట్రల్ పోర్టల్‌కు అప్‌డేట్ చేయడం ఎగ్రిగేటర్లకు తప్పనిసరి చేశారు.
ఇకపై జాప్యం జరిగే ప్రసక్తే లేదు
ఈ అంశంపై ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ యాప్-బేస్డ్ ట్రాన్స్‌పోర్ట్ వర్కర్స్ (IFAT) కో-ఫౌండర్ షేక్ సలావుద్దీన్ స్పందిస్తూ హర్షం వ్యక్తం చేశారు. గతంలో ప్రభుత్వం కొన్ని మార్గదర్శకాలు ఇచ్చినప్పటికీ పలు కార్పోరేట్ కంపెనీలు వాటిని సీరియస్‌గా తీసుకోలేదని ఆయన విమర్శించారు. అయితే ఈసారి కేంద్రం డెడ్‌లైన్‌తో పాటు పెనాల్టీల నిబంధన కూడా పెట్టడం శుభపరిణామన్నారు. వర్కర్లు తమ సంక్షేమ పథకాల కోసం ఎల్లకాలం నిరీక్షించలేరని, చట్టాన్ని గౌరవించి అన్ని ప్లాట్‌ఫామ్స్ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆయన స్పష్టం చేశారు.




