Gold Loan Rules: గోల్డ్ లోన్ కట్టకపోతే మీ బంగారాన్ని బ్యాంకు వేలం వేయవచ్చా? నిబంధనలు ఇవే

Gold Loan Rules: అత్యవసర సమయంలో డబ్బులు అవసరమైతే చాలామంది బంగారు ఆభరణాలను బ్యాంకులు లేదా ఫైనాన్స్ సంస్థల్లో తాకట్టు పెట్టి గోల్డ్ లోన్ తీసుకుంటారు.

Mokshith
Published on: 17 Oct 2026 5:05 PM IST
Gold Loan Rules
X

Gold Loan Rules: గోల్డ్ లోన్ కట్టకపోతే మీ బంగారాన్ని బ్యాంకు వేలం వేయవచ్చా? నిబంధనలు ఇవే

Gold Loan Rules: అత్యవసర సమయంలో డబ్బులు అవసరమైతే చాలామంది బంగారు ఆభరణాలను బ్యాంకులు లేదా ఫైనాన్స్ సంస్థల్లో తాకట్టు పెట్టి గోల్డ్ లోన్ తీసుకుంటారు. అయితే, ఈ లోన్ తీసుకున్న తర్వాత సకాలంలో చెల్లించ‌క‌పోతే బ్యాంకులు ఏం చేస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.

ఎన్ని నెలలు లోన్ కట్టకపోతే బంగారం వేలం వేస్తారు?

గోల్డ్ లోన్ తీసుకున్నవారు ఒకటి లేదా రెండు వాయిదాలు చెల్లించలేదని బ్యాంకు వెంటనే బంగారాన్ని వేలం వేయదు. అయితే, చెల్లింపులు ఆలస్యం చేస్తే రిమైండర్లు, నోటీసులు రావచ్చు. బకాయిలు ఎక్కువకాలం కొనసాగితే వేలం వేసే అవ‌కాశం పెరుగుతుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) నిబంధనల ప్రకారం, సాధారణంగా లోన్ ఖాతాలో 90 రోజులకుపైగా చెల్లింపులు బకాయి ఉంటే, దానిని నిరర్థక ఆస్తి (NPA)గా పరిగణించే అవకాశం ఉంటుంది.

అయితే, ఇది ప్రతి గోల్డ్ లోన్‌కు వర్తించే ఒకే విధమైన వేలం గడువు కాదు. రుణం చెల్లించే విధానం, లోన్ ఒప్పందంలోని నిబంధనలు, వర్తించే నియమాలను బట్టి పరిస్థితి మారవచ్చు. ఉదాహరణకు, మీరు జూన్ నెల వాయిదా చెల్లించకుండా, జూలై, ఆగస్టు నెలల వాయిదాలు చెల్లించారనుకుందాం. అప్పుడు జూన్ నెల బకాయి పూర్తిగా చెల్లించినట్లు కాదు. అందువల్ల, పాత బకాయిలను ముందుగా తీర్చడం మంచిది. లోన్ చెల్లింపుల్లో ఇబ్బందులు ఎదురైతే, ఆలస్యం చేయకుండా బ్యాంకును సంప్రదించాలి.

గోల్డ్ లోన్ చెల్లించకపోతే బ్యాంకు ఏం చేస్తుంది?

గోల్డ్ లోన్ వాయిదా గడువులోగా చెల్లించకపోతే బ్యాంకులు లేదా ఫైనాన్స్ సంస్థలు సాధారణంగా దశలవారీగా చర్యలు తీసుకుంటాయి. మొదట ఫోన్ కాల్స్, SMSలు లేదా మొబైల్ యాప్ ద్వారా చెల్లింపుల గురించి గుర్తుచేస్తాయి. లోన్ ఒప్పందంలోని నిబంధనలను బట్టి ఆలస్య రుసుములు లేదా ఇతర ఛార్జీలు కూడా విధించవచ్చు.

బకాయి కొనసాగితే రాతపూర్వకంగా రిమైండర్లు, చెల్లింపులు చేయాలని కోరుతూ నోటీసులు పంపవచ్చు. ఎక్కువకాలం చెల్లింపులు జరగకపోతే, వర్తించే నిబంధనల ప్రకారం తదుపరి రికవరీ చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. అయితే, వాయిదా చెల్లించని వెంటనే బంగారం వేలం వేస్తారని అనుకోవడం సరికాదు. అలాగే, 90 రోజులు దాటిన వెంటనే తప్పనిసరిగా వేలం వేయాలనే అర్థం కూడా కాదు. వేలం ప్రక్రియకు లోన్ ఒప్పందం, సంబంధిత RBI నిబంధనలు, నోటీసుల ప్రక్రియ కీలకం.

బంగారం వేలం వేయడానికి ముందు ఎలాంటి నిబంధనలు పాటించాలి?

లోన్ తీసుకున్న వ్యక్తి బకాయిలు చెల్లించకపోతే, ధిరాణ సంస్థ నిబంధనల ప్రకారం తాకట్టు పెట్టిన బంగారాన్ని వేలం వేసే ప్రక్రియను ప్రారంభించవచ్చు. అయితే, ఇష్టానుసారంగా ఎలాంటి ప్రక్రియ పాటించకుండా ఆభరణాలను విక్రయించడానికి వీలుండదు. వర్తించే నిబంధనలు, లోన్ ఒప్పందంలోని షరతులను పాటించాలి.

వేలానికి ముందు రుణగ్రహీతకు అవసరమైన నోటీసులు ఇవ్వాలి. వేలం ప్రక్రియ పారదర్శకంగా జరగాలి. వేలంలో వచ్చిన మొత్తాన్ని ముందుగా బకాయి లోన్, వర్తించే వడ్డీ, ఇతర చెల్లించాల్సిన ఛార్జీలకు సర్దుబాటు చేస్తారు. అన్ని బకాయిలు చెల్లించిన తర్వాత కూడా వేలం ద్వారా అదనపు మొత్తం వస్తే, వర్తించే నిబంధనల ప్రకారం ఆ మొత్తాన్ని వినియోగదారుడికి తిరిగి ఇవ్వాలి. వేలం ప్రక్రియలో నిబంధనలు పాటించలేదని భావిస్తే, సంబంధిత బ్యాంకు ఫిర్యాదుల విభాగాన్ని సంప్రదించవచ్చు.

వేలానికి ముందే బంగారు ఆభరణాలను తిరిగి పొందవచ్చా?

అవును. వేలం పూర్తయ్యేలోపు బకాయి లోన్ మొత్తాన్ని, వర్తించే వడ్డీతో పాటు ఇతర ఛార్జీలను చెల్లించి ఆభరణాలను తిరిగి పొందే అవకాశం సాధారణంగా ఉంటుంది. అయితే, దీనికి సంబంధించి బ్యాంకును వెంటనే సంప్రదించి, బకాయి ఎంత ఉందో తెలుసుకోవాలి. వేలం నోటీసు వచ్చిన తర్వాత కూడా ఆలస్యం చేయకుండా స్పందించడం ముఖ్యం. ఒకసారి వేలం ప్రక్రియ పూర్తయి, ఆభరణాలు విక్రయించబడితే వాటిని తిరిగి పొందడం కష్టమవుతుంది. అందువల్ల, ఆ పరిస్థితి రాకముందే బకాయిలను చెల్లించడం లేదా బ్యాంకుతో చర్చించి అందుబాటులో ఉన్న పరిష్కారాలను తెలుసుకోవడం మంచిది.

Mokshith

Mokshith

2015లో జ‌ర్న‌లిజం స్కూల్ ద్వారా నా కెరీర్‌ను ప్రారంభించాను. అనంత‌రం 2016 నుంచి ప‌లు మీడియా సంస్థ‌ల్లో ప‌నిచేశాను. మొద‌ట ప్రింట్ ఆ త‌ర్వాత డిజిట‌ల్‌లో క‌లిపి మొత్తం 10 ఏళ్ల అనుభ‌వం ఉంది. నేను ఎక్కువ‌గా లైఫ్‌స్టైల్‌, అంత‌ర్జాతీయం, టెక్నాల‌జీ, బిజినెస్‌, ఆస్ట్రాల‌జీకి సంబంధించి వార్త‌లు రాస్తుంటాను.