Gold Rate: రూ.55,500 తగ్గిన బంగారం.. ఇప్పుడే కొనాలా? డిసెంబర్‌లో ధరలు ఎలా ఉండబోతున్నాయి?

Gold Rate: జనవరిలో నమోదైన ఆల్-టైమ్ గరిష్ఠం రూ.1,83,000 నుంచి తులం బంగారం ధర రూ.55,500 మేర తగ్గింది. బంగారం ధరల పతనానికి కారణాలు, కొనుగోలుకు ఇది సరైన సమయమేనా అనే అంశంపై నిపుణుల సూచనలు ఇక్కడ చూడండి.

Arun Chilukuri
Published on: 27 Nov 2026 1:18 PM IST
Gold Rate
X

Gold Rate: రూ.55,500 తగ్గిన బంగారం.. ఇప్పుడే కొనాలా? డిసెంబర్‌లో ధరలు ఎలా ఉండబోతున్నాయి?

Gold Rate: దేశ, విదేశీ మార్కెట్లలో బంగారం ధరలు ఈ ఏడాది ఎప్పుడూ లేని విధంగా తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతున్నాయి. జనవరి 29న స్పాట్ మార్కెట్లో ఆల్-టైమ్ గరిష్ఠాన్ని తాకుతూ 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ఏకంగా రూ.1,83,000 పలికింది. అప్పటి నుంచి క్రమంగా దిగొస్తూ గడిచిన 10 నెలల్లో తులం బంగారం విలువ దాదాపు రూ.55,500 మేర తగ్గింది.

ఇక నవంబర్ నెలలోనూ మల్టీ కమొడిటీ ఎక్స్ఛేంజ్ (MCX) గణాంకాల ప్రకారం, నవంబర్ 5న రూ.1,43,184 వద్ద ఉన్న 10 గ్రాముల బంగారం, నవంబర్ 23 నాటికి 12.96 శాతం పడిపోయి రూ.1,24,632కు చేరింది. గత నెల అక్టోబర్ 9న నమోదైన గరిష్ఠ ధర రూ.1,48,909తో పోల్చితే ఇప్పటివరకు 16.30 శాతం కరెక్షన్ నమోదైంది.

బంగారం ధరల పతనానికి 5 ప్రధాన కారణాలు:

అమెరికా ఫెడరల్ రిజర్వ్ (Fed) వడ్డీరేట్లను పెంచుతుందన్న అంచనాలు బలపడటం.

అంతర్జాతీయ కరెన్సీ మార్కెట్లో అమెరికన్ డాలర్ మరింత బలపడటం.

అమెరికా బాండ్లపై రాబడులు (Bond Yields) గణనీయంగా పెరగడం.

గరిష్ఠ స్థాయిల వద్ద మదుపర్లు లాభాల స్వీకరణకు (Profit Booking) మొగ్గు చూపడం.

బంగారం నుంచి ఇతర అధిక రాబడి నిచ్చే పెట్టుబడి సాధనాల వైపు నిధులు తరలిపోవడం.

పెట్టుబడి ఎలా పెట్టాలి? నిపుణుల సూచనలు ఇవే:

డిజిటల్ బంగారానికే ప్రాధాన్యం: మొత్తం ఇన్వెస్ట్‌మెంట్ పోర్ట్‌ఫోలియోలో బంగారానికి 10 నుంచి 15 శాతం వరకు వాటా కేటాయించాలని, అదీ సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (SIP) విధానంలో మదుపు చేయడం ఉత్తమమని ఇండియా బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కొఠారి సూచిస్తున్నారు. ఆభరణాలు లేదా భౌతిక బంగారం కొంటే మేకింగ్ ఛార్జీలు, భద్రపరిచే సమస్యలు ఉంటాయని, వాటికి బదులుగా గోల్డ్ ఈటీఎఫ్‌లు, గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ ద్వారా చిన్న మొత్తాలతోనూ పెట్టుబడిని ప్రారంభించి, అవసరమైనప్పుడు సులభంగా విక్రయించుకోవచ్చని తెలిపారు.

విడుతలవారీ కొనుగోలు వ్యూహం: పోర్ట్‌ఫోలియోలో 5 నుంచి 10 శాతం వరకు విలువైన లోహాలకు కేటాయిస్తూ ఎస్‌ఐపీలు లేదా దశలవారీగా పెట్టుబడులు పెట్టాలని ఆనంద్ రాఠీ షేర్ అండ్ స్టాక్ బ్రోకర్స్ అనలిస్ట్ నర్వేకర్ సలహా ఇస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర 3,300 నుంచి 3,500 డాలర్ల స్థాయికి దిగొచ్చినప్పుడు మరింతగా కొనుగోలు చేయవచ్చని అభిప్రాయపడ్డారు.

లిక్విడిటీ & నిల్వ ఖర్చుల అంశం: భౌతిక నిల్వ ఖర్చుల భారం లేకుండా మెరుగైన లిక్విడిటీని, మార్కెట్ ధరతో ముడిపడిన రాబడులను గోల్డ్ ఈటీఎఫ్‌లు అందిస్తాయని అకోయిరా బై ఆగ్‌మాంట్ డైరెక్టర్ ఆరవ్ బఫ్నా తెలిపారు. ఒకవేళ భౌతికంగానే బంగారం కావాలని భావించేవారికి బంగారు నాణేలు, కడ్డీలు సరైన ఎంపికని, అయితే వాటిని భద్రపరిచే ఖర్చులతో పాటు కొనుగోలు-అమ్మకం ధరల మధ్య వ్యత్యాసం రాబడులపై ప్రభావం చూపుతుందని వివరించారు.

తాజాగా మళ్లీ పుంజుకున్న ధరలు.. ముందున్న ఒత్తిళ్లు:

గత కొన్ని రోజులుగా వరుసగా తగ్గుతూ వచ్చిన పసిడి ధరలు గురువారం ట్రేడింగ్‌లో ఒక్కసారిగా పుంజుకున్నాయి. ఢిల్లీ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర బుధవారంతో పోలిస్తే రూ.1,500 ఎగబాకి రూ.1,27,500 వద్ద పలికింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రూ.1,400 పెరిగి రూ.1,14,400కి చేరుకోగా, కిలో వెండి ధర రూ.1.50 లక్షల వద్దే స్థిరంగా ఉంది.

అయితే, వచ్చే నెల డిసెంబర్‌లో ఫెడ్ రిజర్వ్ వడ్డీరేట్ల పెంపు దాదాపు ఖాయంగా కనిపిస్తుండటం, ఆ తర్వాతి సమీక్షలోనూ పెంచే అవకాశం ఉండటంతో పాటు డాలర్ బలంగా కొనసాగుతుండటం వల్ల బంగారం ధరలపై సమీప భవిష్యత్తులో ఒత్తిడి కొనసాగే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.