Gold Loan: దిగొస్తున్న బంగారం ధరలు.. మరి గోల్డ్ లోన్స్ పరిస్థితి ఏంటి.?
Gold Loan: బంగారం ధర తగ్గడంతో గతంలో వచ్చినంత గోల్డ్ లోన్ ఇప్పుడు రాదు. మార్జిన్ కాల్ ముప్పు పెరిగింది.
Gold Loan: దిగొస్తున్న బంగారం ధరలు.. మరి గోల్డ్ లోన్స్ పరిస్థితి ఏంటి.?
Gold Loan: బంగారం ధర తగ్గడంతో గతంలో అదే బంగారంపై వచ్చినంత లోన్ ఇప్పుడు రాదు. ప్రస్తుత ధర ఆధారంగా లోన్ మొత్తాన్ని లెక్కిస్తారు. వడ్డీ ఏడాదికి ఒకసారి కాకుండా నెలకోసారి వసూలు చేసేందుకు బ్యాంకులు/సంస్థలు మొగ్గు చూపే అవకాశముంది. మీరు ఇప్పటికే గరిష్ఠ LTV (75శాతం-85శాతం) వద్ద లోన్ తీసుకుని ఉంటే బ్యాంక్ మీకు 'మార్జిన్ కాల్' మెసేజ్‌లు పంపుతుంది. అప్పుడు అసలు మొత్తంలో కొంత చెల్లించాలి లేదా మరికొంత బంగారం బ్యాంకులో పెట్టాలి.
బంగారం ధరలు ఈ ఏడాది జనవరిలో 10 గ్రాములకు రూ. 1.82 లక్షల రికార్డు స్థాయికి చేరాయి. అక్టోబర్ 12 నాటికి రూ. 1.53 లక్షలకు తగ్గాయి. ధర తగ్గినా తీసుకున్న లోన్ మొత్తం తగ్గదు. దీంతో బంగారం విలువతో పోలిస్తే లోన్ శాతం (LTV) పెరిగిపోతుంది. ఆర్‌బీఐ కొత్త నిబంధనలు ఏప్రిల్ 1, 2026 నుంచి అమల్లోకి వచ్చాయి. వీటి ప్రకారం రూ. 2.50 లక్షల వరకు లోన్లకు 85శాతం, రూ. 2.50 లక్షల నుంచి రూ. 5 లక్షల వరకు 80శాతం, రూ. 5 లక్షలకు పైగా లోన్లకు 75శాతం LTV పరిమితి ఉంది.
ఈ పరిమితి లోన్ కాలం మొత్తం కొనసాగాలి. బంగారం విలువ లెక్కించేటప్పుడు గత 30 రోజుల సగటు ధర, ముందు రోజు ముగింపు ధరల్లో తక్కువ దాన్ని తీసుకుంటారు. ధర తగ్గి LTV పరిమితి దాటితే బ్యాంకులు కొంత లోన్ ముందుగా చెల్లించమని లేదా అదనంగా బంగారం తాకట్టు పెట్టమని అడగవచ్చు. పరిమితి దాటిన పరిస్థితి వరుసగా 30 రోజులకు పైగా కొనసాగితే బ్యాంకులపై అదనపు నిబంధనలు వర్తిస్తాయి. లోన్ కట్టకపోతే బంగారం వేలం వేసే అవకాశం ఉంది. అయితే కొత్త నిబంధనల ప్రకారం వేలానికి ముందు రుణగ్రహీతకు నోటీసు ఇవ్వాలి.
అసలు, వడ్డీ రెండూ గడువు చివర్లో కట్టే బుల్లెట్ లోన్లపై ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే వడ్డీ కలుస్తూ పోవడంతో లోన్ మొత్తం పెరుగుతుంది, బంగారం విలువ తగ్గుతుంది. నెలవారీ వాయిదాల్లో చెల్లించే లోన్లపై ప్రభావం తక్కువగా ఉంది. ఆర్థిక నిపుణులు అనుమతించిన మొత్తంలో 80శాతం కంటే తక్కువ లోన్ తీసుకోవాలని, లోన్ కాలాన్ని 6 నుంచి 12 నెలలకు పరిమితం చేసుకోవాలని సూచిస్తున్నారు.




