Gold Price Today : సామాన్యుడిపై కేంద్రం టాక్స్ బాంబు.. ఆకాశమే హద్దుగా పసిడి పరుగు
Gold Price Today : బంగారం ధరలు భారీగా పెరిగాయి. కేంద్ర ప్రభుత్వం దిగుమతి సుంకాలు పెంచడంతో పసిడి, వెండి ధరలు ఆకాశాన్నంటాయి.
Gold Price Today
Gold Price Today : బంగారం కొనాలని కలలు కంటున్న సామాన్యులకు కేంద్ర ప్రభుత్వం కోలుకోలేని షాక్ ఇచ్చింది. గత కొంతకాలంగా తగ్గుతూ ఊరిస్తున్న పసిడి ధరలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. వెండి, ప్లాటినం వంటి విలువైన లోహాలపై దిగుమతి సుంకాలను కేంద్రం భారీగా పెంచడంతో మార్కెట్‌లో రేట్లు అమాంతం ఎగబాకాయి. మే 13 నుంచే ఈ కొత్త పన్నులు అమల్లోకి రావడంతో, 2026 ఆరంభం నుంచి ధరలు తగ్గుతాయని ఆశించిన కొనుగోలుదారుల ఆశలపై నీళ్లు చల్లినట్లయింది. ముఖ్యంగా పెళ్లిళ్ల సీజన్ నడుస్తున్న తరుణంలో ఈ ధరల పెరుగుదల మధ్యతరగతి కుటుంబాలకు గుదిబండలా మారింది.
హైదరాబాద్‌లో తులం బంగారం ఎంతో తెలుసా?
తాజా మార్పుల తర్వాత దేశవ్యాప్తంగా పసిడి ధరలు కొత్త రికార్డులను తాకుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో 24 క్యారెట్ల (స్వచ్ఛమైన) బంగారం 10 గ్రాముల ధర రూ.1,62,010 కు చేరుకోగా, ఆభరణాల తయారీకి వాడే 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,48,510 గా నమోదైంది. కేవలం బంగారం మాత్రమే కాదు, వెండి ధర కూడా చుక్కలనంటుతోంది. కిలో వెండి ధర ఏకంగా రూ.3,20,100 మార్కును తాకడంతో సామాన్యులు ఆందోళన చెందుతున్నారు.
దేశంలోని ప్రధాన నగరాల్లో నేటి రేట్లు (10 గ్రాములు)
దేశ రాజధాని నుంచి టెక్ సిటీల వరకు అన్ని చోట్లా పసిడి సెగలు రేపుతోంది. చెన్నైలో 24 క్యారెట్ల గోల్డ్ రూ.1,63,680 ఉండగా, ఢిల్లీలో రూ.1,62,160 వద్ద కొనసాగుతోంది. ముంబై, బెంగళూరు, కోల్‌కతా నగరాల్లో కూడా సుమారు రూ.1,62,010 పలికింది. వెండి ధరల విషయానికి వస్తే కోల్‌కతాలో అత్యధికంగా కిలో వెండి రూ.3,30,100 పలుకుతుండగా, మిగిలిన నగరాల్లో రూ.3.10 లక్షల నుంచి రూ.3.20 లక్షల మధ్య ఊగిసలాడుతోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో డాలర్ విలువ పెరగడం, కేంద్ర బ్యాంకులు బంగారాన్ని నిల్వ చేసుకోవడం కూడా ఈ ధరల పెరుగుదలకు కారణమవుతున్నాయి.




