Gold Price Today : బంగారం ప్రియులకు భారీ షాక్.. మళ్లీ భగ్గుమంటున్న పసిడి, వెండి ధరలు
Gold Price Today : అంతర్జాతీయ పరిణామాలు, ముడి చమురు ధరల పెరుగుదల కారణంగా కేవలం మూడు రోజుల్లోనే పసిడి, వెండి రేట్లు భారీగా పెరిగాయి.
Gold Price Today
Gold Price Today : కొద్ది రోజులుగా పడిపోతూ వస్తున్న బంగారం ధరలు ఒక్కసారిగా ప్లేట్ మార్చేశాయి. తగ్గుముఖం పట్టిందనుకున్న పసిడి, వెండి ధరలు మళ్లీ భగ్గుమంటున్నాయి. కేవలం మూడు రోజుల వ్యవధిలోనే బంగారం, వెండి ధరలు భారీగా ఎగబాకడంతో సామాన్యులకు చుక్కలు కనిపిస్తున్నాయి. నిన్నమొన్నటి వరకు కొంత ఊరటనిచ్చిన రేట్లు, ఇప్పుడు మళ్లీ కొండెక్కి కూర్చోవడంతో బంగారం కొనుగోలుదారులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
మూడ్రోజుల్లోనే వేలల్లో పెరిగిన రేట్లు
అంతర్జాతీయ మార్కెట్లో చోటుచేసుకుంటున్న అనూహ్య పరిణామాల ప్రభావం నేరుగా బులియన్ మార్కెట్ పై పడింది. ముఖ్యంగా ఇరాన్-అమెరికా దేశాల మధ్య కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులు, ప్రపంచవ్యాప్తంగా క్రూడాయిల్ ధరలు పెరుగుతుండటం పసిడి పరుగుకు కారణమవుతున్నాయి. కేవలం బుధవారం ఒక్కరోజే 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారంపై దాదాపు రూ.2,300 వరకు ఎగిసింది. సోమవారం నుంచి లెక్కగడితే పసిడి ధర ఏకంగా రూ.3,000 పైనే పెరిగింది. ఇక వెండి అయితే ఏకంగా కిలోపై రూ.5,000 వరకు పెరిగి షాకిచ్చింది.
నేటి తాజా బంగారం, వెండి ధరల వివరాలు
గురువారం ఉదయం నాటికి దేశీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు స్వల్పంగా పైకి కదిలాయి. ప్రస్తుతం దేశంలో వివిధ ప్రాంతాలను బట్టి ధరల్లో స్వల్ప తేడాలు ఉన్నప్పటికీ, సగటున రేట్లు ఈ విధంగా నమోదయ్యాయి. 24 క్యారెట్ల స్వచ్ఛమైన 10 గ్రాముల బంగారం ధర మరో రూ.10 పెరిగి రూ.1,46,520 వద్ద కొనసాగుతోంది. ఆభరణాల తయారీలో ఎక్కువగా వాడే 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములపై రూ.10 పెరిగి రూ.1,34,310 గా ఉంది. వెండి బాట కూడా అదే విధంగా ఉంది. కిలో వెండిపై రూ.100 పెరిగి ప్రస్తుతం రూ.2,40,100 వద్ద ట్రేడవుతోంది.
భూగోళంపై ఎక్కడ చిన్న అలజడి రేగినా ఆ ప్రభావం నేరుగా బంగారం ధరలపై పడుతుండటంతో సామాన్యులు పసిడి కొనుగోలు చేయాలంటేనే హడలిపోతున్నారు. ఈ అనూహ్య ధరల పెరుగుదల సామాన్య, మధ్యతరగతి ప్రజల కలలను మరింత దూరం చేస్తోంది.




