Gold Rate Today: సామాన్యుడికి అందనంత ఎత్తులో బంగారం ధరలు..తులం ఎంతంటే..?
Gold Rate Today: దేశంలో పసిడి ధరలు రికార్డు స్థాయికి చేరాయి. హైదరాబాద్, విజయవాడలో 10 గ్రాముల బంగారం ధర లక్షన్నర మార్కును దాటేసింది.
Gold Rate Today: సామాన్యుడికి అందనంత ఎత్తులో బంగారం ధరలు..తులం ఎంతంటే..?
Gold Price: భారతీయులకు బంగారం అంటే కేవలం ఒక ఆభరణం కాదు, అదొక సెంటిమెంట్.. కష్టకాలంలో ఆదుకునే కొండంత అండ. కానీ, ఇప్పుడు ఆ అండను అందుకోవడం సామాన్యుడికి గగనమైపోతోంది. నింగినంటుతున్న ధరలు చూస్తుంటే, పసిడి పాపము సామాన్యుడి చేతికి దొరకనని భీష్మించుకున్నట్లు కనిపిస్తోంది. బుధవారం సైతం పసిడి ధరలు స్వల్పంగా పెరిగి, కొనుగోలుదారులకు షాక్ ఇచ్చాయి.
లక్షన్నర మార్కు దాటిన బంగారం
గతేడాది మొదట్లో లక్ష రూపాయల లోపు ఉన్న 10 గ్రాముల బంగారం ధర, నేడు ఏకంగా లక్షన్నర మార్కును దాటేసింది. ప్రధాన నగరాల్లో నేటి ధరలను పరిశీలిస్తే పరిస్థితి అర్థమవుతుంది. భాగ్యనగర మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,53,940కి చేరుకోగా, ఆభరణాల తయారీకి వాడే 22 క్యారెట్ల ధర రూ.1,41,110 వద్ద కొనసాగుతోంది. విజయవాడ, విశాఖపట్నం నగరాల్లోనూ ఇవే ధరలు అమలవుతున్నాయి. ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,54,090 ఉండగా, చెన్నైలో ఇది మరింత ఎక్కువగా రూ.1,55,140 వద్ద ట్రేడ్ అవుతోంది.
వెండి కూడా తగ్గనంటోంది..
బంగారం బాటలోనే వెండి ధరలు కూడా పరుగులు పెడుతున్నాయి. కిలో వెండిపై రూ.100 పెరగడంతో, హైదరాబాద్ మార్కెట్‌లో కేజీ వెండి ధర ఇప్పుడు ఏకంగా రూ.2,65,100కి చేరింది. అంటే ఒక్క తులం వెండి కొనాలన్నా రూ.2,651 వెచ్చించక తప్పని పరిస్థితి.
ఎందుకు పెరుగుతున్నాయంటే..?
ఈ అసాధారణ పెరుగుదలకు అంతర్జాతీయ పరిస్థితులే ప్రధాన కారణమని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు.ఇజ్రాయెల్, ఇరాన్, అమెరికా మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు ప్రపంచ విపణిని కుదిపేస్తున్నాయి. భారత్, చైనా, రష్యా వంటి దేశాల సెంట్రల్ బ్యాంకులు డాలర్ల కంటే బంగారం నిల్వలపైనే ఎక్కువ మొగ్గు చూపుతున్నాయి. భారీగా ధరలు పెరిగినప్పటికీ, మన దేశంలో పెళ్లిళ్ల సీజన్ కావడంతో డిమాండ్ తగ్గకపోవడం కూడా ధరల పెరుగుదలకు ఒక కారణం. ఒకప్పుడు తులం బంగారం అంటే వేలల్లో ఉండేది.. కానీ ఇప్పుడు అది లక్షల్లోకి చేరింది. సామాన్యులు తమ ఇంటి ఆడపడుచుల పెళ్లిళ్ల కోసం ఎంతో ఆశతో దాచుకున్న సొమ్ము, ఇప్పుడున్న ధరలకు తులం బంగారం కొనడానికి కూడా సరిపోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి పసిడి పరుగుకు బ్రేక్ పడేది ఎప్పుడో చూడాలి.




