Akshaya Tritiya: అక్షయ తృతీయ నాడు మనోళ్లు ఎన్ని వేల కోట్ల బంగారం కొన్నారో తెలుసా..?
Akshaya Tritiya: పెరిగిన ధరలను కాదని అక్షయ తృతీయ నాడు భారతీయులు పసిడి కొనుగోళ్లకు మొగ్గు చూపారు.
Akshaya Tritiya: అక్షయ తృతీయ నాడు మనోళ్లు ఎన్ని వేల కోట్ల బంగారం కొన్నారో తెలుసా..?
Gold Sales: బంగారం ధర ఆకాశాన్ని తాకినా, భారతీయులకు పసిడిపై ఉన్న మక్కువ మాత్రం ఇసుమంతైనా తగ్గలేదు. ఈ ఏడాది అక్షయ తృతీయ పర్వదినాన దేశీయ ఆభరణాల విపణిలో సరికొత్త రికార్డులు నమోదయ్యాయి. ధరల పెరుగుదల సృష్టించిన ఆందోళనలను పక్కన పెట్టి, సెంటిమెంట్‌కు విలువనిస్తూ ప్రజలు బంగారం కొనుగోళ్లకు పోటెత్తారు. ఫలితంగా ఈ ఏడాది వ్యాపారం ఏకంగా రూ. 20,000 కోట్లకు చేరుకోవచ్చని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ అంచనా వేయడం విశేషం.
ధరలు పెరిగినా.. తగ్గని డిమాండ్
గతేడాది అక్షయ తృతీయతో పోలిస్తే బంగారం ధరలు దాదాపు 60 శాతం మేర పెరిగాయి. అయినప్పటికీ, అమ్మకాల పరిమాణం గత ఏడాది స్థాయిలోనే అంటే 15 నుంచి 20 టన్నుల మధ్య స్థిరంగా కొనసాగడం గమనార్హం. "ధర ఎంతైనా సరే.. శుభసూచకంగా కొంచెం బంగారమైనా కొనాలి" అనే సంప్రదాయ విశ్వాసమే ఈ భారీ టర్నోవర్‌కు ప్రధాన కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు. గతేడాది జరిగిన రూ. 16,000 కోట్ల వ్యాపారం కంటే ఈసారి సుమారు రూ. 4,000 కోట్లు అదనంగా రావడం పరిశ్రమ వర్గాల్లో ఉత్సాహాన్ని నింపింది.
ఆకర్షణీయ ఆఫర్లు
పెరిగిన ధరల వల్ల కస్టమర్లు వెనకడుగు వేయకుండా ఉండేందుకు నగల వ్యాపారులు కూడా వ్యూహాత్మకంగా వ్యవహరించారు.గతంలో 13-20 శాతంగా ఉన్న మేకింగ్ ఛార్జీలను, ఈ సీజన్‌లో 7-13 శాతానికి తగ్గించారు. ఇది సామాన్య వినియోగదారులకు పెద్ద ఊరటనిచ్చింది. నెల రోజుల క్రితం ఆల్-టైమ్ గరిష్ట స్థాయికి చేరిన ధరలు, ఇటీవల సుమారు 10 శాతం మేర తగ్గడం కూడా కొనుగోలుదారులకు కలిసివచ్చింది. సరికొత్త డిజైన్లు, ఆకర్షణీయమైన ఆఫర్లతో వినియోగదారులను దుకాణాల వైపు తిప్పుకోగలిగారు.
ఎండను కూడా లెక్క చేయకుండా..
ఈ ఏడాది వేసవి ఉష్ణోగ్రతలు కొనుగోళ్లపై స్వల్ప ప్రభావాన్ని చూపాయి. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో ఎండల కారణంగా ఉదయం వేళా కొంత మందకొడిగా ఉన్నా, సాయంత్రం 4 గంటల తర్వాత దుకాణాలు కస్టమర్లతో కిక్కిరిసిపోయాయి. ఆల్ ఇండియా జెమ్ అండ్ జ్యువెలరీ కౌన్సిల్ చైర్మన్ రాజేష్ రోక్డే తెలిపిన ప్రకారం, ఈ లేట్ పిక్-అప్ ధోరణి వల్ల డిమాండ్ అంచనాలకు తగ్గట్టుగానే 'సంతృప్తికరంగా నమోదైంది.
మొత్తానికి, రికార్డు స్థాయి ధరలు ఒకవైపు.. అచంచలమైన సెంటిమెంట్ మరొకవైపు పోటీ పడిన ఈ అక్షయ తృతీయలో పసిడి తన మెరుపును మరోసారి చాటుకుంది.




