ఏడాది కనిష్టానికి పడిపోయిన బంగారం, వెండి ధరలు.. అసలు కారణం ఏంటో తెలుసా.?
Gold Silver Rate Today: బంగారం, వెండి కొనుగోలు చేయాలనుకునే వారికి ఊరటనిచ్చేలా ధరలు భారీగా తగ్గాయి.
ఏడాది కనిష్టానికి పడిపోయిన బంగారం, వెండి ధరలు.. అసలు కారణం ఏంటో తెలుసా.?
Gold Silver Rate Today: బంగారం, వెండి కొనుగోలు చేయాలనుకునే వారికి ఊరటనిచ్చేలా ధరలు భారీగా తగ్గాయి. గత ఏడాది కాలంలో ఎన్నడూ లేనంత కనిష్ఠ స్థాయికి చేరాయి. ఇంతకీ ఈ స్థాయిలో ధరలు తగ్గడానికి కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఒక్కసారిగా పడిపోయిన బంగారం, వెండి ధరలు
శుక్రవారం రాత్రి సుమారు 8 గంటల సమయంలో మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో ఒక్కసారిగా భారీ అమ్మకాలు మొదలయ్యాయి. దీంతో డిసెంబర్ ఫ్యూచర్స్ వెండి ధర దాదాపు 5 శాతం తగ్గింది. కిలో వెండిపై ఏకంగా రూ.10 వేలకుపైగా తగ్గడంతో ధర రూ.1,78,900 నుంచి రూ.1.79 లక్షల స్థాయికి చేరింది.
బంగారం ధర కూడా భారీగా పడిపోయింది. MCXలో 10 గ్రాముల బంగారం ధర సుమారు 3 శాతం తగ్గింది. అంటే ఒక్కసారిగా రూ.4,200కు పైగా తగ్గి రూ.1,38,250 నుంచి రూ.1,38,400 మధ్యకు చేరింది. గత ఏడాది కాలంలో ఈ రెండు విలువైన లోహాల ధరలు ఇంత తక్కువ స్థాయికి పడిపోవడం ఇదే తొలిసారి. కొంతకాలంగా ధరలు తగ్గాలని ఎదురుచూస్తున్న కొనుగోలుదారులకు ఈ పరిణామం ఊరటనిచ్చింది.
అంతర్జాతీయ మార్కెట్‌లోనూ భారీ పతనం
దేశీయ మార్కెట్‌లోనే కాకుండా అంతర్జాతీయ మార్కెట్‌లోనూ బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. విదేశీ మార్కెట్‌లో బంగారం ధర 3.3 శాతానికి పైగా పడిపోయింది. ఔన్సు బంగారం ధర 3,900 డాలర్ల కీలక స్థాయిని కోల్పోయి 3,880 డాలర్ల సమీపానికి చేరింది. గత ఏడాది అక్టోబర్ తర్వాత బంగారం ధర ఈ స్థాయికి రావడం ఇదే తొలిసారి.
మరోవైపు వెండి ధర కూడా 5.12 శాతం తగ్గి ఔన్సుకు 49 నుంచి 49.70 డాలర్ల స్థాయికి పడిపోయింది. అంతర్జాతీయ మార్కెట్‌లో కీలక ధరల స్థాయిలు కూడా దాటిపోవడంతో మరింత తగ్గుదల ఉండొచ్చని మార్కెట్ గణాంకాలు సూచిస్తున్నాయి. అయితే ధరలు ఏ స్థాయిలో నిలకడగా ఉంటాయనేది రాబోయే రోజుల్లో మార్కెట్ పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది.
ప్రస్తుతం 24, 22, 18 క్యారెట్ల బంగారం ధరలు ఇవే
ఇండియా బులియన్ అండ్ జువెలర్స్ అసోసియేషన్ (IBJA) వెల్లడించిన వివరాల ప్రకారం బంగారం, వెండి ధరల్లో భారీ తగ్గుదల నమోదైంది. ప్రస్తుతం వివిధ స్వచ్ఛతల బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. రూ.1.40 లక్షలుగా, 22 క్యారెట్ల తులం గోల్డ్ ధర రూ. 1.28 లక్షల వద్ద కొనసాగుతోంది. ఇక కిలో వెండి ధర రూ. 1,81,344గా ఉంది.
అసలు ధరలు ఎందుకు తగ్గాయి?
బంగారం, వెండి ధరలు ఒక్కసారిగా పడిపోవడానికి ప్రధాన కారణం మదుపరులు పెద్ద ఎత్తున లాభాల స్వీకరణకు దిగడమేనని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. కొంతకాలంగా ధరలు పెరగడంతో పెట్టుబడిదారులు తమ వద్ద ఉన్న బంగారం, వెండిని విక్రయించి లాభాలు పొందేందుకు ప్రయత్నించారు. దీంతో అమ్మకాల ఒత్తిడి పెరిగి ధరలు పడిపోయాయి.
దీనికి తోడు అమెరికా నుంచి వచ్చిన ఆర్థిక గణాంకాలు కూడా బంగారంపై ప్రభావం చూపాయి. అమెరికా జీడీపీ వృద్ధి అంచనాల కంటే మెరుగ్గా నమోదైంది. అదే సమయంలో అక్కడ ద్రవ్యోల్బణం కూడా కొనసాగుతోంది. మరోవైపు ముడి చమురు ధరలు పెరగడం, అమెరికా డాలర్ బలపడటం, యూఎస్ ట్రెజరీ బాండ్లపై రాబడులు పెరగడం వంటి అంశాలు బంగారం ధరలపై ఒత్తిడి పెంచాయి.
అమెరికా ఫెడరల్ రిజర్వ్ అధికారులు వడ్డీ రేట్ల విషయంలో మరింత కఠినంగా వ్యవహరించే అవకాశం ఉందనే సంకేతాలు కూడా మార్కెట్‌ను ప్రభావితం చేశాయి. సాధారణంగా వడ్డీ రేట్లు ఎక్కువగా ఉంటాయని అంచనా వచ్చినప్పుడు బంగారం వంటి వడ్డీ ఆదాయం ఇవ్వని పెట్టుబడులపై ఆసక్తి తగ్గుతుంది. దీంతో కొంతమంది పెట్టుబడిదారులు బంగారం, వెండి నుంచి తమ పెట్టుబడులను ఇతర మార్గాలకు మళ్లిస్తున్నారు. ఈ పరిణామాలన్నీ కలిసివచ్చి పసిడి, వెండి ధరలు ఒక్కసారిగా భారీగా పడిపోవడానికి కారణమయ్యాయి.




