Gold, Silver Prices: బంగారం, వెండి సెగ.. జూన్‌లో 4.38 శాతానికి చేరిన రిటైల్ ద్రవ్యోల్బణం!
Gold, Silver Prices: బంగారం, వెండి ధరల ప్రభావంతో జూన్ నెలలో దేశీయ రిటైల్ ద్రవ్యోల్బణం 4.38 శాతానికి చేరింది. అయితే ఇది ఆర్‌బీఐ పరిధిలోనే ఉంది.
Gold, Silver Prices: బంగారం, వెండి సెగ.. జూన్‌లో 4.38 శాతానికి చేరిన రిటైల్ ద్రవ్యోల్బణం!
Gold, Silver Prices: దేశంలో రిటైల్ ద్రవ్యోల్బణం స్వల్పంగా పెరిగింది. గణాంకాల మంత్రిత్వ శాఖ సోమవారం విడుదల చేసిన నూతన వినియోగదారుల ధరల సూచీ (CPI) వివరాల ప్రకారం.. గత ఏడాది జూన్ నెలతో పోలిస్తే ఈ ఏడాది జూన్‌లో భారతదేశ రిటైల్ ద్రవ్యోల్బణం 4.38 శాతంగా నమోదైంది. అంతకుముందు నెల అయిన మేలో ఇది 3.93 శాతంగా ఉండటం గమనార్హం. ప్రధానంగా పసిడి, వెండి ధరలు భారీగా పెరగడమే ద్రవ్యోల్బణం పెరగడానికి కారణమైంది.
బంగారం, వెండి ధరల మోత:
ఈ జూన్ నెలలో అత్యధిక ద్రవ్యోల్బణాన్ని నమోదు చేసిన వస్తువులలో వెండి, బంగారు ఆభరణాలు అగ్రస్థానంలో ఉన్నాయి. గత ఏడాదితో పోలిస్తే వెండి ఆభరణాల ధరలు ఏకంగా 133.21 శాతం పెరగ్గా, బంగారు ఆభరణాల ధరలు 36.82 శాతం మేర పెరిగాయి. వీటితో పాటు కూరగాయల ధరల్లో టమోటా 31.82 శాతం, అల్లం ధర 50.41 శాతం చొప్పున పెరిగాయి. మరోవైపు గృహనిర్మాణ రంగానికి సంబంధించిన ద్రవ్యోల్బణ రేటు 2.10 శాతంగా నమోదైంది.
తగ్గిన బంగాళాదుంపలు, వాహనాల ధరలు:
జూన్ నెలలో మొత్తం ఆహార ద్రవ్యోల్బణం 5.32 శాతంగా నమోదైంది. కొన్ని నిత్యావసరాల ధరలు గణనీయంగా తగ్గడం గమనార్హం. ముఖ్యంగా బంగాళాదుంపల ధరలు 20.34 శాతం మేర భారీగా తగ్గగా, బఠానీల ధరలు 9.67 శాతం తగ్గాయి. వీటితో పాటు కార్ల ధరలు 6.89 శాతం, ద్విచక్ర వాహనాల ధరలు 3.49 శాతం మేర తగ్గాయి.
ఆర్‌బీఐ సురక్షిత పరిధిలోనే ద్రవ్యోల్బణం:
ప్రస్తుతం పెరిగిన సీపీఐ ద్రవ్యోల్బణం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) నిర్దేశించిన సురక్షిత పరిధిలోనే కొనసాగుతోంది. ఆర్‌బీఐ సహన పరిధి (Tolerance Zone) 2 శాతం నుండి 6 శాతం వరకు ఉండగా.. ఇందులో 4 శాతాన్ని మధ్యస్థాయి విలువగా నిర్ణయించారు. అయితే, పశ్చిమ ఆసియాలో భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, అంతర్జాతీయ సరఫరా గొలుసు అంతరాయాల కారణంగా 2026-27 ఆర్థిక సంవత్సరానికి (FY27) గానూ ఆర్‌బీఐ వార్షిక ద్రవ్యోల్బణ అంచనాను 4.6 శాతం నుంచి 5.1 శాతానికి సవరించింది.




