Google: ఓపెన్‌ఏఐ, మైక్రోసాఫ్ట్‌కు పోటీగా గూగుల్.. భారీ డేటా సెంటర్ ప్రాజెక్టు కొనుగోలు
గూగుల్ అమెరికాలోని వ్యోమింగ్ రాష్ట్రంలో భారీ ఏఐ డేటా సెంటర్ ప్రాజెక్టును క్రూసో నుంచి కొనుగోలు చేసింది. గతంలో ఖర్చు, నిర్మాణ సమయంపై ఆందోళన వ్యక్తం చేసిన సంస్థ ఇప్పుడు ప్రాజెక్టును నేరుగా చేపట్టింది.
Google: ఏఐ రంగంలో తన ఆధిపత్యాన్ని మరింత పెంచుకునేందుకు గూగుల్ భారీ అడుగు వేసింది. అమెరికాలోని వ్యోమింగ్ రాష్ట్రంలో నిర్మాణానికి సిద్ధంగా ఉన్న భారీ డేటా సెంటర్ ప్రాజెక్ట్‌ను ఏఐ మౌలిక సదుపాయాల సంస్థ క్రూసో నుంచి కొనుగోలు చేసింది. గతంలో ఇదే ప్రాజెక్టులో కస్టమర్‌గా చేరేందుకు గూగుల్ ఆసక్తి చూపినప్పటికీ.. ఖర్చు, నిర్మాణానికి పట్టే సమయం విషయంలో ఆందోళనలతో వెనక్కి తగ్గినట్లు సమాచారం. ఇప్పుడు మాత్రం ప్రాజెక్టును పూర్తిగా తన ఆధీనంలోకి తీసుకుంది. ఈ కొనుగోలు విలువను రెండు సంస్థలూ వెల్లడించలేదు.
రూ.లక్షల కోట్ల పెట్టుబడి
వ్యోమింగ్ రాష్ట్రంలో తన తొలి డేటా సెంటర్ క్యాంపస్‌ను నిర్మించేందుకు 17 బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టనున్నట్లు గూగుల్ ప్రకటించిన మరుసటి రోజే ఈ కొనుగోలు విషయం బయటకు వచ్చింది. క్రూసో గత ఏడాది టాల్‌గ్రాస్ ఎనర్జీతో కలిసి ఈ ప్రాజెక్టును ప్రారంభించింది. భవిష్యత్తులో ఈ క్యాంపస్ విద్యుత్ సామర్థ్యాన్ని 10 గిగావాట్లకు పెంచాలన్నది ప్రణాళిక. అయితే ప్రాజెక్టు అభివృద్ధి బాధ్యతలను ఇప్పుడు గూగుల్ నేరుగా చేపట్టనుంది. టాల్‌గ్రాస్ ఎనర్జీ, బ్లాక్ హిల్స్ ఎనర్జీ, అమెరికన్ ఎలక్ట్రిక్ పవర్, రిలేటెడ్ డిజిటల్ సంస్థలతో కలిసి నిర్మాణ పనులు కొనసాగించనుంది.
ఖర్చు, నిర్మాణ సమయంపై గూగుల్‌కు అభ్యంతరాలు?
ఈ ప్రాజెక్టుకు కస్టమర్‌గా మారాలని క్రూసో గతంలో గూగుల్‌ను సంప్రదించింది. అయితే క్రూసో నిర్వహణలో ప్రాజెక్టు నిర్మాణ వ్యయం ఎంత అవుతుంది? పూర్తి చేయడానికి ఎంత సమయం పడుతుంది? అనే అంశాలపై గూగుల్ సందేహాలు వ్యక్తం చేసినట్లు వార్తలు వచ్చాయి. దీంతో ఈ ప్రాజెక్టు నుంచి కస్టమర్‌గా తప్పుకున్నట్లు సమాచారం. జూన్‌లోనే గూగుల్ ఈ ప్రాజెక్టును కొనుగోలు చేయబోతోందన్న వార్తలు వెలువడ్డాయి. తాజాగా ఒప్పందం ఖరారు కావడంతో క్రూసో ప్రీ-డెవలప్‌మెంట్ బాధ్యతలు ముగిశాయి. స్థలం ఎంపిక, ప్రభుత్వ అనుమతులు, విద్యుత్ సరఫరా ప్రణాళిక వంటి పనులను క్రూసో ఇప్పటికే పూర్తి చేసింది. తమ కృషి వల్లే ప్రాజెక్టు నిర్మాణానికి సిద్ధమైందని సంస్థ సీఈవో చేజ్ లోచ్మిల్లర్ తెలిపారు.
10 గిగావాట్ల విద్యుత్ సామర్థ్యం
వ్యోమింగ్ డేటా సెంటర్ ప్రాజెక్టులో విద్యుత్ సరఫరా కోసం క్రూసో ప్రత్యేకమైన ప్రణాళిక రూపొందించింది. ఇందులో ఫ్యూయల్ సెల్స్, విద్యుత్ గ్రిడ్ సరఫరా, సహజ వాయువుతో నడిచే టర్బైన్లను ఉపయోగించనున్నారు. భవిష్యత్తులో కార్బన్ ఉద్గారాలను తగ్గించేందుకు టాల్‌గ్రాస్ సంస్థకు చెందిన ప్రాంతీయ కార్బన్ డయాక్సైడ్ నిల్వ కేంద్రాన్ని కూడా వినియోగించాలన్నది ప్రణాళిక. మరోవైపు తమకు ఇప్పటికే 6 గిగావాట్లకు పైగా విద్యుత్ సామర్థ్యానికి సంబంధించిన ఒప్పందాలు ఉన్నాయని, భవిష్యత్తులో చేపట్టే ప్రాజెక్టుల జాబితాలో 40 గిగావాట్లకు పైగా సామర్థ్యం ఉందని క్రూసో సీఈవో వెల్లడించారు.
టెక్సాస్‌లోనూ గూగుల్ కోసం డేటా సెంటర్ నిర్మిస్తున్న క్రూసో
వ్యోమింగ్ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నంత మాత్రాన గూగుల్‌తో క్రూసో భాగస్వామ్యం ముగిసినట్లు కాదు. టెక్సాస్‌లోని అమరిల్లో సమీపంలో గూగుల్ కోసం మరో డేటా సెంటర్ క్యాంపస్‌ను క్రూసో అభివృద్ధి చేస్తోంది. ఈ ప్రాజెక్టుకు సమీపంలోని రెండు విండ్ ఫార్మ్‌ల నుంచి విద్యుత్ అందనుంది. ఒక్కో విండ్ ఫార్మ్ సామర్థ్యం 265.5 మెగావాట్లు. వీటిలో ఒకటి ఇప్పటికే పనిచేస్తుండగా, మరొకటి నిర్మాణంలో ఉంది. ఈ డేటా సెంటర్‌లో క్లోజ్డ్ లూప్ లిక్విడ్ కూలింగ్ విధానాన్ని ఉపయోగిస్తున్నారు. దీనివల్ల శీతలీకరణ కోసం నీటి వినియోగం గణనీయంగా తగ్గుతుంది. వంటగది వంటి సాధారణ అవసరాలకే ప్రధానంగా నీటిని వినియోగించేలా ఈ వ్యవస్థను రూపొందించారు.
మైక్రోసాఫ్ట్, ఓపెన్‌ఏఐ, మెటా వంటి దిగ్గజాలకు క్రూసో సేవలు
క్రూసో వ్యాపారం గూగుల్‌తోనే పరిమితం కాలేదు. టెక్సాస్‌లోని అబిలీన్ ప్రాంతంలో ఒరాకిల్, ఓపెన్‌ఏఐ కోసం దశలవారీగా భారీ డేటా సెంటర్ క్యాంపస్‌ను నిర్మిస్తోంది. దీనికి పక్కనే మైక్రోసాఫ్ట్ కోసం 900 మెగావాట్ల సామర్థ్యంతో మరో క్యాంపస్ అభివృద్ధి చేస్తోంది. ఇందులో తొలి భవనం 2027 మధ్యలో అందుబాటులోకి రావచ్చని అంచనా. మెటా కూడా క్రూసో కస్టమర్లలో ఒకటి. ట్రేడింగ్ సంస్థ జేన్ స్ట్రీట్ ఐదేళ్ల కాలానికి 13 బిలియన్ డాలర్ల విలువైన క్లౌడ్ సేవల ఒప్పందం కుదుర్చుకున్నట్లు వార్తలు వచ్చాయి. సెప్టెంబర్‌లో క్రూసో 3.9 బిలియన్ డాలర్ల నిధులు సమీకరించింది. ఇటీవల సంస్థ విలువ 30.9 బిలియన్ డాలర్లకు చేరింది.
ఎనిమిదేళ్ల క్రితం సహజ వాయువు వృథాగా మండిపోకుండా దాన్ని ఉపయోగించి క్రిప్టో మైనింగ్ చేసే వ్యాపారంగా ప్రారంభమైన సంస్థ.. ఇప్పుడు ఏఐ డేటా సెంటర్ల రంగంలో కీలక సంస్థగా ఎదిగింది. అయితే భారీ డేటా సెంటర్ల నిర్మాణంలో పరికరాల కొరత, విద్యుత్ లభ్యత, స్థానికుల అభ్యంతరాలు, ఖర్చుల పెరుగుదల వంటి సవాళ్లు ఎదురవుతున్నాయి. వ్యోమింగ్ ప్రాజెక్టును నేరుగా కొనుగోలు చేయడం ద్వారా నిర్మాణ ఖర్చులు, గడువుపై పూర్తి బాధ్యతను గూగుల్ తన చేతుల్లోకి తీసుకుంది.




