నెల రోజుల్లో 20 మందిపైగా కోటి రూపాయాలు కోల్పోయారు.. గూగుల్ రివ్యూ స్కామ్‌తో జాగ్రత్త

Google Review Scam: ఇంట్లో కూర్చుని డబ్బులు సంపాదించాలనే ఆశతో ఆన్‌లైన్ పనులు వెతుకుతున్నారా? అయితే జాగ్రత్తగా ఉండాలి.

Mokshith
Published on: 22 Oct 2026 3:25 PM IST
Google Review Scam
X

నెల రోజుల్లో 20 మందిపైగా కోటి రూపాయాలు కోల్పోయారు.. గూగుల్ రివ్యూ స్కామ్‌తో జాగ్రత్త

Google Review Scam: ఇంట్లో కూర్చుని డబ్బులు సంపాదించాలనే ఆశతో ఆన్‌లైన్ పనులు వెతుకుతున్నారా? అయితే జాగ్రత్తగా ఉండాలి. గూగుల్‌లో షాపులు, హోటళ్లకు రివ్యూలు రాసి రేటింగ్‌లు ఇస్తే డబ్బులు ఇస్తామంటూ సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు.

గూగుల్ రివ్యూ స్కామ్ ఎలా జరుగుతుంది?

సైబర్ నేరగాళ్లు టెలిగ్రామ్, వాట్సాప్ ద్వారా గుర్తుతెలియని వ్యక్తులకు మెసేజ్‌లు పంపిస్తారు. ఇంట్లోనే ఉంటూ సులభంగా డబ్బులు సంపాదించవచ్చని చెబుతారు. గూగుల్‌లో షాపులు, హోటళ్లు లేదా ఇతర వ్యాపార సంస్థలకు రివ్యూలు రాయడం, రేటింగ్‌లు ఇవ్వడం వంటి పనులు అప్పగిస్తారు. ఒక్కో పనికి రూ.100 నుంచి రూ.200 వరకు చెల్లిస్తామని ఆశ చూపిస్తారు.

మొదట బాధితులతో చిన్న చిన్న పనులు చేయించి, వాటికి నిజంగానే కొంత డబ్బు చెల్లిస్తారు. దీంతో ఈ పని నమ్మదగినదేనని బాధితులు భావిస్తారు. ఆ తర్వాత ఎక్కువ డబ్బులు సంపాదించాలంటే కొంత మొత్తం పెట్టుబడిగా పెట్టాలని చెబుతారు. ఎక్కువ పెట్టుబడి పెడితే అంతకంటే ఎక్కువ లాభం వస్తుందని నమ్మిస్తారు.

బాధితులు డబ్బులు పెట్టిన తర్వాత వాటిని వెనక్కి తీసుకోవడానికి ప్రయత్నిస్తే అసలు సమస్య మొదలవుతుంది. ట్రేడింగ్‌లో సాంకేతిక సమస్య వచ్చిందని, ఖాతా ఫ్రీజ్ అయిందని చెబుతారు. ఖాతాను మళ్లీ తెరవడానికి, డబ్బులు విత్‌డ్రా చేసుకోవడానికి మరికొంత చెల్లించాలని ఒత్తిడి చేస్తారు. ఇలా పలుమార్లు డబ్బులు వసూలు చేసి చివరకు బాధితులను మోసం చేస్తారు.

రూ.10 లక్షలు పోగొట్టుకున్న విశాఖపట్నం వ్యక్తి

విశాఖపట్నానికి చెందిన 38 ఏళ్ల వ్యక్తి కూడా ఈ తరహా మోసానికి గురయ్యాడు. అతనికి టెలిగ్రామ్‌లో ఆన్‌లైన్ పని చేస్తే డబ్బులు సంపాదించవచ్చంటూ సందేశం వచ్చింది. ఒక్కో పని పూర్తి చేస్తే రూ.100 నుంచి రూ.200 వరకు చెల్లిస్తామని నేరగాళ్లు చెప్పారు. మొదట అతనికి రూ.120 చెల్లించారు. ఆ తర్వాత రూ.500 పెట్టుబడి పెడితే రూ.630 తిరిగి ఇచ్చారు. అనంతరం రూ.3,000 పెట్టగా రూ.4,300 చెల్లించారు. ఇలా మొదట్లో లాభాలు రావడంతో ఆ వ్యక్తికి వారిపై నమ్మకం పెరిగింది.

ఆ తర్వాత ఎక్కువ లాభాలు వస్తాయని చెబుతూ ఒక ఆన్‌లైన్ ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్‌లోకి తీసుకెళ్లారు. పెద్ద మొత్తంలో డబ్బులు పెట్టుబడి పెడితే అధిక లాభాలు వస్తాయని ఆశ చూపించారు. వారి మాటలు నమ్మిన బాధితుడు డబ్బులు పెట్టాడు.

అయితే, తన డబ్బులు వెనక్కి తీసుకోవాలని ప్రయత్నించినప్పుడు ట్రేడింగ్‌లో సమస్య వచ్చిందని, తన ఖాతా ఫ్రీజ్ అయిందని చెప్పారు. ఖాతాను తిరిగి ప్రారంభించడానికి, డబ్బులు విత్‌డ్రా చేసుకోవడానికి మరింత మొత్తం చెల్లించాలని కోరారు. క్రెడిట్ స్కోర్ పెంచాలనే పేరుతో కూడా డబ్బులు అడిగారు. ఈ విధంగా ఆ వ్యక్తి సుమారు

రూ.10 లక్షలు నష్టపోయాడు.

ఇలాంటి ఆన్‌లైన్ మోసాలను ఎలా గుర్తించాలి?

ఆన్‌లైన్‌లో సులభంగా డబ్బులు సంపాదించవచ్చనే ప్రకటనలు కనిపించినప్పుడు అప్రమత్తంగా ఉండాలి. చిన్న పనులు చేయడానికి ముందుగానే డబ్బులు చెల్లించాలని లేదా ఎక్కువ పనులు పొందాలంటే పెట్టుబడి పెట్టాలని చెబితే అనుమానించాలి. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చని హామీ ఇచ్చే వారిని నమ్మకూడదు. తెలియని వ్యక్తుల సందేశాలను నమ్మవద్దు: టెలిగ్రామ్, వాట్సాప్‌లలో వచ్చే గుర్తుతెలియని వ్యక్తుల ఆఫర్లు, లింకుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ప్రారంభంలో కొంత మొత్తం చెల్లించడం ద్వారా మీ నమ్మకాన్ని గెలుచుకోవడం కూడా మోసగాళ్ల వ్యూహం కావచ్చు.

మీ డబ్బులు విత్‌డ్రా చేసుకోవడానికి అదనపు ఫీజు, క్రెడిట్ స్కోర్ పెంచే ఛార్జీలు లేదా ఇతర పేర్లతో డబ్బులు అడిగితే అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా, గూగుల్ రివ్యూలు రాసినందుకు డబ్బులు ఇస్తామని చెప్పే ప్రతి ఆఫర్‌ను నమ్మకూడదు. పని చేసే సంస్థ నిజమైనదో కాదో ముందుగా పరిశీలించాలి. డబ్బులు సంపాదించాలనే తొందరలో వ్యక్తిగత వివరాలు, బ్యాంకు సమాచారం లేదా ఓటీపీని ఇతరులతో పంచుకోవద్దు.

సైబర్ మోసానికి గురైతే ఏం చేయాలి?

మీరు ఇలాంటి మోసానికి గురై డబ్బులు పోగొట్టుకుంటే ఆలస్యం చేయకుండా వెంటనే చర్యలు తీసుకోవాలి. డబ్బులు పంపిన బ్యాంకు ఖాతా లేదా యూపీఐ సేవా సంస్థను వెంటనే సంప్రదించి లావాదేవీపై ఫిర్యాదు చేయండి. సాధ్యమైతే లావాదేవీని నిలిపివేయడానికి లేదా డబ్బులను ఫ్రీజ్ చేయడానికి చర్యలు తీసుకోవాలని కోరండి. సైబర్ ఆర్థిక మోసాలపై ఫిర్యాదు చేయడానికి జాతీయ సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ 1930ను సంప్రదించండి.

లేదా అధికారిక వెబ్‌సైట్ cybercrime.gov.inలో ఫిర్యాదు నమోదు చేయండి. నేరగాళ్ల ఫోన్ నంబర్లు, వాట్సాప్ లేదా టెలిగ్రామ్ చాట్‌లు, వెబ్‌సైట్ లింకులు, బ్యాంకు స్టేట్‌మెంట్లు, యూపీఐ వివరాలు, లావాదేవీల రసీదులను భద్రపరచండి.

Mokshith

Mokshith

2015లో జ‌ర్న‌లిజం స్కూల్ ద్వారా నా కెరీర్‌ను ప్రారంభించాను. అనంత‌రం 2016 నుంచి ప‌లు మీడియా సంస్థ‌ల్లో ప‌నిచేశాను. మొద‌ట ప్రింట్ ఆ త‌ర్వాత డిజిట‌ల్‌లో క‌లిపి మొత్తం 10 ఏళ్ల అనుభ‌వం ఉంది. నేను ఎక్కువ‌గా లైఫ్‌స్టైల్‌, అంత‌ర్జాతీయం, టెక్నాల‌జీ, బిజినెస్‌, ఆస్ట్రాల‌జీకి సంబంధించి వార్త‌లు రాస్తుంటాను.