Fuel Prices: కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. పెట్రోల్, డీజిల్ లపై ట్యాక్స్ భారీ తగ్గింపు
Fuel Prices: ఇంధన ఎగుమతులపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
Fuel Prices
Fuel Prices: ఇంధన ఎగుమతులపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పెట్రోల్, డీజిల్, ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయెల్ ఎగుమతి సుంకాన్ని భారీగా తగ్గిస్తూ కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇటీవలి సెప్టెంబర్ 1న అమల్లోకి వచ్చిన ధరలతో పోలిస్తే, ప్రస్తుత సవరించిన ధరల ప్రకారం పెట్రోల్‌పై రూ.1, డీజిల్‌పై రూ.5, ఏటీఎఫ్‌పై రూ.4 చొప్పున సుంకాన్ని తగ్గించారు. ఈ కొత్త సవరించిన ధరలు సెప్టెంబర్ 16 నుంచి అమల్లోకి రాగా, రాబోయే రెండు వారాల పాటు ఇవే ధరలు కొనసాగనున్నాయి.
తాజా మార్పుల ప్రకారం, పెట్రోల్‌పై ఎక్స్‌పోర్ట్ లేవీని లీటరుకు రూ.1.5 నుండి కేవలం రూ.0.5కి తగ్గించారు. అలాగే డీజిల్ ఎగుమతులపై విధిస్తున్న సుంకాన్ని లీటరుకు రూ.25 నుండి ఏకంగా రూ.20కి కుదించారు. మరోవైపు విమాన ఇంధనమైన ఏటీఎఫ్ ఎగుమతి సుంకాన్ని లీటరుకు రూ.19 నుండి రూ.15 కి తగ్గించారు. డీజిల్ విషయంలో ఇంతకుముందు ఉన్న రూ.25 లేవీలో రూ.24 ప్రత్యేక అదనపు ఎక్సైజ్ డ్యూటీ (SAED), అలాగే రూ.1 రోడ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సెస్‌గా ఉండేది. ప్రస్తుత సవరణలో డీజిల్ ఎగుమతులపై విధించిన రోడ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సెస్‌ను ప్రభుత్వం పూర్తిగా తొలగించింది.
అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్, పెట్రోల్, డీజిల్, ఏటీఎఫ్ సగటు ధరల ఆధారంగా ప్రతి రెండు వారాలకు ఒకసారి ఈ ఎగుమతి సుంకాలను కేంద్ర ప్రభుత్వం సమీక్షిస్తుంటుంది. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో దేశీయంగా పెట్రోలియం ఉత్పత్తుల లభ్యతను సులభతరం చేయడానికి, ఎగుమతులను నియంత్రించడానికి ఈ ఏడాది మార్చి 27 నుంచి ఈ ఎగుమతి లేవీ విధానాన్ని అమలు చేస్తున్నారు. అయితే, దేశీయంగా వినియోగించే పెట్రోల్, డీజిల్ సాధారణ రిటైల్ విక్రయాలపై విధించే ఎక్సైజ్ డ్యూటీలో మాత్రం ఎలాంటి మార్పు చేయలేదని ప్రభుత్వం స్పష్టం చేసింది.




