బ్యాంక్ ఎఫ్‌డీ కంటే ఎక్కువ వడ్డీ ఇచ్చే 4 ప్రభుత్వ పథకాలు.. 8.20% వరకు రాబడి!
Safe Investment Tips: చాలామంది తమ దగ్గర ఉన్న డబ్బును సురక్షితంగా దాచుకోవాలంటే ముందుగా బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్ (FD) వైపు చూస్తారు.
బ్యాంక్ ఎఫ్‌డీ కంటే ఎక్కువ వడ్డీ ఇచ్చే 4 ప్రభుత్వ పథకాలు.. 8.20% వరకు రాబడి!
Safe Investment Tips: చాలామంది తమ దగ్గర ఉన్న డబ్బును సురక్షితంగా దాచుకోవాలంటే ముందుగా బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్ (FD) వైపు చూస్తారు. అయితే ఎఫ్డీలతో పోల్చితే ఎక్కువగా రిటర్న్స్ వచ్చే మార్గాలు కూడా ఉన్నాయని మీకు తెలుసా.?
అత్యవసర సమయంలో డబ్బు తీసుకునేందుకు ఎస్‌బీఐ ఎంఓడీ పథకం
బ్యాంకులో ఎఫ్‌డీ చేసిన తర్వాత మధ్యలో డబ్బు అవసరమైతే చాలామంది మొత్తం డిపాజిట్‌ను వెనక్కి తీసుకుంటారు. దీనివల్ల ముందుగా నిర్ణయించిన వడ్డీ ప్రయోజనం తగ్గే అవకాశం ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అందించే మల్టీ ఆప్షన్ డిపాజిట్ (MOD) పథకం ఉపయోగపడుతుంది. ఇది నేరుగా ఎస్‌బీఐ సేవింగ్స్ ఖాతాకు లింకై ఉంటుంది. అకౌంట్‌లో నిర్ణీత పరిమితికి మించి ఉన్న డబ్బు ఆటో స్వీప్ విధానం ద్వారా ఎఫ్‌డీగా మారుతుంది.
ఈ పథకంలో ప్రత్యేకత ఏమిటంటే.. అత్యవసరంగా డబ్బు అవసరమైనప్పుడు మొత్తం ఎఫ్‌డీని రద్దు చేయాల్సిన అవసరం ఉండదు. ఏటీఎం లేదా యూపీఐ ద్వారా డబ్బు తీసుకోవచ్చు. అవసరమైన మొత్తానికి అనుగుణంగా మాత్రమే డిపాజిట్‌లో కొంత భాగం వెనక్కి వస్తుంది.
మిగిలిన మొత్తంపై ఎఫ్‌డీ నిబంధనల ప్రకారం వడ్డీ కొనసాగుతుంది. సాధారణంగా రూ.5 వేల మల్టీపుల్స్‌లో డబ్బు తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి అత్యవసర ఖర్చుల కోసం కొంత డబ్బును అందుబాటులో ఉంచుకోవాలనుకునే వారికి ఈ పథకం ఉపయోగకరంగా ఉంటుంది.
తక్కువ కాలంలో మంచి వడ్డీ కోసం ఎస్‌బీఐ అమృత్ వృష్టి
సుమారు ఏడాదిన్నర పాటు డబ్బును సురక్షితంగా దాచుకోవాలనుకునే వారికి ఎస్‌బీఐ అమృత్ వృష్టి ప్రత్యేక డిపాజిట్ పథకం ఒక ప్రత్యామ్నాయం. ఇది 444 రోజుల కాలపరిమితితో అందించే ప్రత్యేక ఎఫ్‌డీ పథకం. సాధారణంగా ఒకటి నుంచి రెండేళ్ల కాలపరిమితి కలిగిన డిపాజిట్లతో పోలిస్తే ఇందులో మెరుగైన వడ్డీ లభిస్తుంది.
ఈ పథకంలో సాధారణ కస్టమర్లకు ఏడాదికి 6.45 శాతం వడ్డీ లభిస్తుంది. సీనియర్ సిటిజన్లకు 6.95 శాతం, 80 ఏళ్లు పైబడిన సూపర్ సీనియర్ సిటిజన్లకు 7.05 శాతం వరకు వడ్డీ అందుతుంది. నిర్ణీత కాలం పాటు డబ్బును ఉంచగలిగే వారికి ఇది ఉపయోగకరమైన ఎంపిక.
అయితే మధ్యలో డిపాజిట్‌ను వెనక్కి తీసుకోవాలంటే సాధారణ ఎఫ్‌డీల మాదిరిగానే ముందస్తు ఉపసంహరణ నిబంధనలు వర్తిస్తాయి. పెట్టుబడి పెట్టే ముందు ఈ పథకం ప్రస్తుతం అందుబాటులో ఉందో లేదో, తాజా వడ్డీ రేట్లు ఎంత ఉన్నాయో బ్యాంకులో తెలుసుకోవాలి.
ఆర్బీఐ ఫ్లోటింగ్ రేట్ బాండ్లలో 8.05 శాతం వడ్డీ
ఎక్కువ కాలం పాటు పెట్టుబడి పెట్టి క్రమం తప్పకుండా వడ్డీ ఆదాయం పొందాలనుకునే వారికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) అందించే ఫ్లోటింగ్ రేట్ సేవింగ్స్ బాండ్లు మరో అవకాశం. వీటిని కేంద్ర ప్రభుత్వం తరఫున ఆర్బీఐ జారీ చేస్తుంది. కాబట్టి వీటికి ప్రభుత్వ మద్దతు ఉంటుంది. ఈ బాండ్లలో పెట్టుబడి పెట్టిన అసలు మొత్తానికి ప్రభుత్వ హామీ ఉంటుంది.
ఈ బాండ్లపై వడ్డీ రేటు ప్రతి ఆరు నెలలకు ఒకసారి మారుతుంది. నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ (NSC) వడ్డీ రేటుకు అదనంగా 0.35 శాతం కలిపి వడ్డీని నిర్ణయిస్తారు. ప్రస్తుతం ఈ పథకంలో ఏడాదికి 8.05 శాతం వడ్డీ లభిస్తోంది. ఇందులో పెట్టుబడి పెట్టేందుకు గరిష్ఠ పరిమితి లేదు.
అయితే కనీస పెట్టుబడి రూ.1,000. ఈ బాండ్ల కాలపరిమితి ఏడేళ్లు. సాధారణంగా ఏడేళ్లకు ముందే డబ్బును వెనక్కి తీసుకోవడానికి అవకాశం ఉండదు. సీనియర్ సిటిజన్లకు మాత్రం వయసును బట్టి ముందస్తు ఉపసంహరణకు కొన్ని వెసులుబాట్లు ఉన్నాయి. దీర్ఘకాలం పాటు డబ్బును ఉంచగలిగే వారికి ఇది మంచి ఎంపిక.
పోస్టాఫీస్ పథకాల్లో 8.20 శాతం వరకు వడ్డీ
సురక్షితమైన పెట్టుబడితో పాటు మంచి వడ్డీ ఆదాయం పొందాలనుకునే వారికి పోస్టాఫీస్ చిన్న పొదుపు పథకాలు ఉపయోగపడతాయి. వీటిలో ఐదేళ్ల పోస్టాఫీస్ టైమ్ డిపాజిట్ (TD) ఒకటి. ప్రస్తుతం ఈ పథకంపై ఏడాదికి 7.50 శాతం వడ్డీ లభిస్తోంది.
ఐదేళ్ల కాలపరిమితితో పెట్టుబడి పెట్టేవారు ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80C కింద పాత పన్ను విధానంలో పన్ను మినహాయింపు పొందే అవకాశం ఉంది. అయితే ముందస్తుగా డబ్బు వెనక్కి తీసుకోవాలంటే కొన్ని నిబంధనలు వర్తిస్తాయి.
మరోవైపు వృద్ధులకు పోస్టాఫీస్ సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (SCSS) మంచి ఎంపికగా చెప్పవచ్చు. ప్రస్తుతం ఈ పథకంలో ఏడాదికి 8.20 శాతం వడ్డీ లభిస్తోంది. ఇందులో 60 ఏళ్లు పైబడిన వారు పెట్టుబడి పెట్టవచ్చు. ఐదేళ్ల కాలపరిమితి ఉండే ఈ పథకంలో వడ్డీని ప్రతి మూడు నెలలకు ఒకసారి చెల్లిస్తారు. అవసరమైన వారికి ఇది క్రమమైన ఆదాయాన్ని అందిస్తుంది. అయితే ఇందులో గరిష్ఠ పెట్టుబడి పరిమితి రూ.30 లక్షలు. పన్ను ప్రయోజనాలు, ముందస్తు ఉపసంహరణ నిబంధనలు కూడా పరిశీలించాలి.




