Telegram: టెలిగ్రామ్‌కు కేంద్రం గట్టి షాక్.. 15 రోజుల్లో నివేదిక ఇవ్వాలని అల్టిమేటం..
Telegram: టెలిగ్రామ్ యాప్‌కు కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ గట్టి నోటీసులు జారీ చేసింది. కాపీరైట్ ఉల్లంఘనలు, పైరసీ కంటెంట్‌పై 15 రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని అల్టిమేటం జారీ చేసింది.
Telegram: టెలిగ్రామ్‌కు కేంద్రం గట్టి షాక్.. 15 రోజుల్లో నివేదిక ఇవ్వాలని అల్టిమేటం..
Telegram: ఆన్‌లైన్ మెసేజింగ్ యాప్‌లలో భద్రత, చట్టవిరుద్ధ కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపుతున్న కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రముఖ యాప్ ‘టెలిగ్రామ్’ (Telegram)కు గట్టి నోటీసులు జారీ చేసింది. టెలిగ్రామ్ వేదికగా భారీగా సాగుతున్న కాపీరైట్ ఉల్లంఘనలు, పైరసీ కంటెంట్‌పై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఆదేశించింది.
టెలిగ్రామ్‌లో అక్రమంగా నడుస్తోన్న పైరసీ ఛానళ్లు, కంటెంట్‌పై ఇప్పటివరకు ఎటువంటి చర్యలు తీసుకున్నారనే దానిపై 15 రోజుల్లోగా సమగ్ర నివేదిక సమర్పించాలని కేంద్రం అల్టిమేటం ఇచ్చింది. వీలైనంత త్వరగా పైరసీ కంటెంట్‌ను యాప్ నుండి పూర్తిగా తొలగించాలని స్పష్టం చేసింది. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం కీలక వ్యాఖ్యలు చేస్తూ.. "కాపీరైట్ ఉల్లంఘన అనేది కేవలం సివిల్ కేసు మాత్రమే కాదు.. ఇది తీవ్రమైన క్రిమినల్ నేరం కూడా అవుతుంది" అని హెచ్చరించింది. టెలిగ్రామ్ వేదికగా కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు, ఓటీటీ కంటెంట్ విచ్చలవిడిగా షేర్ అవుతున్న నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.
సినిమా ప్రొడ్యూసర్లు, ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు, దర్యాప్తు సంస్థల నుంచి వచ్చే ఫిర్యాదులను స్వీకరించి, తక్షణమే యాక్షన్ తీసుకోవడానికి టెలిగ్రామ్ ఎలాంటి గ్రీవెన్స్ (ఫిర్యాదుల పరిష్కార) వ్యవస్థను ఏర్పాటు చేసిందో వివరించాలని కేంద్రం ఆదేశించింది. ఇటీవల నీట్ పరీక్ష (NEET) ప్రశ్నపత్రాలు టెలిగ్రామ్‌లోనే లీక్ అయినట్లు ఆరోపణలు రావడం, ఆ వివాదం కారణంగా ఈ యాప్‌ను దేశంలో కొన్ని రోజుల పాటు బ్లాక్ చేసిన సంగతి తెలిసిందే. ఆ వేడి చల్లారకముందే తాజాగా మరోసారి నోటీసులు రావడం గమనార్హం.
టెలిగ్రామ్‌తో పాటు సామాజిక మాధ్యమ దిగ్గజం మెటా (Meta), ఇన్‌స్టాగ్రామ్ (Instagram)లకు కూడా కేంద్రం ఇటీవల నోటీసులు జారీ చేసింది. చిన్నారులపై లైంగిక వేధింపులను ప్రోత్సహించేలా ఉన్న ప్రకటనలు, పెరిగిపోతున్న సైబర్‌మోసాల ముప్పు దృష్ట్యా కేంద్రం అలర్ట్ అయింది. ఇన్ స్టా వేదికగా వస్తున్న వివాదాస్పద అడ్వర్టైజ్మెంట్లపై వివరణ ఇవ్వాలని మెటాను ఆదేశించింది. సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్‌లు భారతీయ చట్టాలకు లోబడి పనిచేయాల్సిందేనని కేంద్రం మరోసారి స్పష్టం చేసింది.




