GST 2.0: పన్ను చెల్లింపుదారులకు భారీ ఊరట.. కీలక మార్పులు
GST 2.0లో కీలక మార్పులు రానున్నాయి. GST అరెస్ట్ అధికారాలకు చెక్, ITC రక్షణ, రిజిస్ట్రేషన్ సులభతరం చేసే ప్రతిపాదనలు ఉన్నాయి.
GST 2.0: Arrest Rules Change, ITC Protection Likely
GST 2.0 Reforms: జీఎస్టీ వ్యవస్థలో కీలక మార్పులకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. అక్టోబర్ 7న జరిగే జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో పన్ను విధానంలో పలు ప్రక్రియలు, అమలు నిబంధనలకు సంబంధించిన సంస్కరణలపై చర్చించే అవకాశం ఉంది. జీఎస్టీ నమోదు, రిటర్నుల దాఖలు సులభతరం చేయడంతో పాటు చిన్న మొత్తాల పన్ను వివాదాలను తగ్గించడం, పన్ను చెల్లింపుదారులకు మరింత వెసులుబాటు కల్పించడం ఈ ప్రతిపాదనల ప్రధాన ఉద్దేశంగా తెలుస్తోంది.
జీఎస్టీ అధికారులకు ఉన్న అరెస్ట్ అధికారాలను తొలగించి.. పన్ను ఎగవేత కేసుల్లో అరెస్ట్ చేయాలంటే న్యాయపరమైన అనుమతి తప్పనిసరి చేసే ప్రతిపాదనను పరిశీలించనున్నట్లు సమాచారం. ప్రస్తుతం కొన్ని నేరాలకు సంబంధించి జీఎస్టీ చట్టంలోని సెక్షన్ 69 కింద అధికారులు అరెస్ట్ చేసే అవకాశం ఉంది. కొత్త ప్రతిపాదన అమల్లోకి వస్తే ఈ విధానం మారనుంది.
అదే సమయంలో ప్రాసిక్యూషన్ ప్రారంభించేందుకు ఉన్న పన్ను ఎగవేత పరిమితిని రూ.1 కోటి నుంచి రూ.5 కోట్లకు పెంచే అంశాన్ని కూడా పరిశీలించనున్నారు. దీంతో చిన్న మొత్తాల పన్ను వివాదాలు క్రిమినల్ కేసులుగా మారకుండా చూడొచ్చని ప్రభుత్వం భావిస్తోంది. తీవ్రమైన పన్ను ఎగవేత లేదా మోసం జరిగిన సందర్భాల్లో మాత్రం ప్రాసిక్యూషన్ కొనసాగించే అవకాశం ఉంటుంది.
నిజాయితీగా పన్ను చెల్లించే వ్యాపారులకు ITC రక్షణ
జీఎస్టీలో ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ (ITC)కు సంబంధించి కూడా కీలక మార్పులు ప్రతిపాదించారు. సరైన ఇన్‌వాయిస్ ఆధారంగా ITC పొందిన కొనుగోలుదారుడు.. ఆ తర్వాత సరఫరాదారు పన్ను చెల్లించకపోవడం వల్ల ఇబ్బందులు ఎదుర్కోకుండా రక్షణ కల్పించే ప్రతిపాదన ఉంది.
కొనుగోలుదారుడు పన్ను ఎగవేతలో భాగస్వామి కాకపోతే అతడికి లభించిన చెల్లుబాటు అయ్యే ITCను కొనసాగించేందుకు అవకాశం కల్పించవచ్చు. పన్ను వసూలు చర్యలను పన్ను చెల్లించని సరఫరాదారుపై తీసుకునేలా నిబంధనలు మార్చే అవకాశం ఉంది.
ఉద్యోగుల బీమాపై ITCకి అవకాశం?
ఉద్యోగులకు సంస్థలు అందించే జీవిత, ఆరోగ్య బీమా ప్రీమియంలపై కూడా ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ కల్పించే అంశాన్ని జీఎస్టీ కౌన్సిల్ పరిశీలించనుంది. ప్రస్తుతం ఉద్యోగుల కోసం సంస్థలు తీసుకునే గ్రూప్ ఇన్సూరెన్స్‌పై 18 శాతం జీఎస్టీ ఉంటుంది. సాధారణంగా ఆ మొత్తంపై వ్యాపారాలకు ITC లభించదు.
కొత్త ప్రతిపాదనకు ఆమోదం లభిస్తే సంస్థలకు ఉద్యోగుల బీమా ఖర్చు కొంత తగ్గే అవకాశం ఉంది. దీంతో ఉద్యోగులకు బీమా కవరేజీ పెరగడానికి కూడా ఇది ఉపయోగపడుతుందని భావిస్తున్నారు.
చిన్న ఈ-కామర్స్ వ్యాపారులకు సులభమైన GST రిజిస్ట్రేషన్
ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా వ్యాపారం చేసే చిన్న విక్రేతలకు జీఎస్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియను సులభతరం చేసే ప్రతిపాదన కూడా ఉంది. ఒక రాష్ట్రంలో సొంత కార్యాలయం లేకపోయినా.. ఈ-కామర్స్ సంస్థకు చెందిన గోదామును వ్యాపార ప్రదేశంగా ఉపయోగించుకునే అవకాశం కల్పించవచ్చు.
కనీసం ఒక రాష్ట్రంలో వ్యాపారానికి సంబంధించిన నిజమైన ఉనికిని నిర్ధారించుకోవాలి. అక్కడ భౌతిక ధ్రువీకరణ, ఆధార్ ధృవీకరణ పూర్తయిన తర్వాత ఇతర రాష్ట్రాల్లో కూడా సులభంగా రిజిస్ట్రేషన్ పొందే అవకాశం కల్పించవచ్చు. ఈ మార్పుతో సుమారు 9.5 లక్షల చిన్న విక్రేతలకు ప్రయోజనం కలగవచ్చని ప్రతిపాదనలో పేర్కొన్నారు.
GST రిజిస్ట్రేషన్, రిటర్నులు మరింత ఈజీ
జీఎస్టీ రిజిస్ట్రేషన్ వ్యవస్థను కూడా పూర్తిగా సరళీకరించే ప్రతిపాదన ఉంది. దరఖాస్తు సమయంలో ప్రతి దశలో మార్గదర్శకాలు అందించడం, సంబంధిత విభాగాలను మాత్రమే చూపించడం, అవసరమైన పత్రాల జాబితాను ఆటోమేటిక్‌గా రూపొందించడం వంటి మార్పులు చేయనున్నారు.
ఇప్పటికే ఒక రాష్ట్రంలో ఉన్న రిజిస్ట్రేషన్ వివరాలను మరో రాష్ట్రంలో దరఖాస్తు చేసేటప్పుడు ఉపయోగించుకునే అవకాశం కల్పించవచ్చు. పలు రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్ కావాల్సిన వ్యాపారాలు ఒకేసారి దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కూడా రావచ్చు. వార్షిక రిటర్నులు, చిన్న వ్యాపారాల పన్ను చెల్లింపులకు సంబంధించి కూడా సరళమైన విధానాలను తీసుకురావాలని ప్రతిపాదించారు.
రూ.10 వేల లోపు GST డిమాండ్లకు చెక్?
చిన్న మొత్తాల పన్ను వివాదాలను తగ్గించేందుకు రూ.10,000 కంటే తక్కువ పన్ను డిమాండ్ ఉన్న సందర్భాల్లో జీఎస్టీ నోటీసులు జారీ చేయకుండా ఉండే ప్రతిపాదనను కూడా పరిశీలించనున్నారు. ఇలాంటి కేసులు సంఖ్యాపరంగా ఎక్కువగా ఉన్నప్పటికీ.. పన్ను మొత్తం మాత్రం చాలా తక్కువగా ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది.
రూ.10,000కు పైగా డిమాండ్ ఉన్న కేసుల్లో కూడా ముందుగా పన్ను చెల్లింపుదారుకు సమాచారం ఇచ్చి, వివరణ ఇచ్చేందుకు అవకాశం కల్పించిన తర్వాతే అధికారిక షోకాజ్ నోటీసు జారీ చేసే విధానాన్ని తీసుకురావాలని ప్రతిపాదించారు.
సరుకు రవాణాలోనూ కీలక మార్పులు
రాష్ట్రాల మధ్య సరుకులు తరలించే వాహనాలను పదేపదే తనిఖీల పేరుతో ఆపకుండా.. నిర్దిష్ట సమాచారం ఆధారంగా మాత్రమే తనిఖీలు నిర్వహించే విధానాన్ని తీసుకురావాలని ప్రతిపాదించారు. ముందస్తు అనుమతి ఉన్న సందర్భాల్లోనే వాహనాలను ఆపేలా నిబంధనలు మార్చే అవకాశం ఉంది.
దీంతో రాష్ట్రాల మధ్య సరుకు రవాణా వేగవంతం కావడంతో పాటు ప్రయాణ సమయం, రవాణా ఖర్చులు తగ్గే అవకాశం ఉంది.
ఈ-కామర్స్ డెలివరీలకు ఒకే 5% GST?
ఈ-కామర్స్ ద్వారా ఆర్డర్ చేసే వస్తువుల డెలివరీలపై ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ లేకుండా ఒకే 5 శాతం జీఎస్టీ విధించే ప్రతిపాదన కూడా పరిశీలనలో ఉంది. డిజిటల్ కామర్స్ రంగంలో పన్ను విధానాన్ని మరింత సరళీకరించడమే దీని లక్ష్యంగా కనిపిస్తోంది.
బంగారం, వెండి, ప్లాటినం దిగుమతులపై పన్ను మినహాయింపు రద్దు?
బ్యాంకులు, గుర్తింపు పొందిన సంస్థలు దిగుమతి చేసుకునే బంగారం, వెండి, ప్లాటినంపై ప్రస్తుతం ఉన్న ఐజీఎస్టీ మినహాయింపును తొలగించే అంశాన్ని కూడా కౌన్సిల్ పరిశీలించనుంది. ప్రస్తుతం ఈ విలువైన లోహాలపై 3 శాతం ఐజీఎస్టీ ఉండగా.. కొన్ని బ్యాంకులు, సంస్థలకు దిగుమతి సమయంలో మినహాయింపు ఉంది.
బులియన్ మార్కెట్‌లో వచ్చిన మార్పులు, విలువైన లోహాల దిగుమతుల వల్ల విదేశీ మారకద్రవ్యంపై పడుతున్న ఒత్తిడి వంటి అంశాలను దృష్టిలో పెట్టుకుని ఈ మినహాయింపును తొలగించే ప్రతిపాదన వచ్చినట్లు సమాచారం.
మొత్తంగా చూస్తే.. జీఎస్టీ 2.0 తదుపరి దశలో పన్ను రేట్ల కంటే జీఎస్టీ పరిపాలన, పన్ను చెల్లింపు ప్రక్రియను సులభతరం చేయడంపైనే ఎక్కువగా దృష్టి పెట్టే అవకాశం ఉంది. నిజాయితీగా పన్నులు చెల్లించే వ్యాపారులకు ఇబ్బందులు తగ్గించడం, చిన్న వివాదాలను తగ్గించడం, సాంకేతికత ఆధారంగా పన్ను ఎగవేతలను గుర్తించడం వంటి అంశాలకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు ప్రతిపాదనలు సూచిస్తున్నాయి. అయితే ఇవన్నీ జీఎస్టీ కౌన్సిల్ ఆమోదం పొందిన తర్వాతే అమల్లోకి రావాల్సి ఉంటుంది.




