Gold: బంగారం, వెండిపై కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం!
Gold: బంగారం, వెండి దిగుమతులపై 3 శాతం ఐజీఎస్టీ మినహాయింపును ఎత్తివేయాలని జీఎస్‌టీ మండలి భావిస్తోంది.
Gold: బంగారం, వెండిపై కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం!
Gold import: బంగారం, వెండి దిగుమతులపై కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం బ్యాంకులు, నామినేటెడ్ ఏజెన్సీలు దిగుమతి చేసుకునే పసిడి, వెండి, ప్లాటినంలపై అమల్లో ఉన్న 3 శాతం ఇంటిగ్రేటెడ్ జీఎస్‌టీ మినహాయింపును రద్దు చేయాలని జీఎస్‌టీ మండలి యోచిస్తోంది.
అక్టోబర్ 7న జరగనున్న కేంద్ర, రాష్ట్ర ఆర్థిక మంత్రుల సమావేశంలో ఈ ప్రతిపాదనపై ప్రధానంగా చర్చ జరగనుంది. వ్యాపార విధానాలను సులభతరం చేసే ఉద్దేశంతో 2017లో ఈ పన్ను మినహాయింపును అమలులోకి తెచ్చారు. ఈ మినహాయింపును ఎత్తివేయడం ద్వారా బులియన్ ఎక్స్ఛేంజీలు, నామినేటెడ్ ఏజెన్సీల మధ్య పన్ను విధానం ఒకేలా ఉండి, మార్కెట్లో సమతూకం ఏర్పడుతుందని నిపుణులు భావిస్తున్నారు.
దేశంలో ఆభరణాల తయారీ కోసం బంగారం దిగుమతులు భారీగా పెరుగుతున్నాయి. గణాంకాలను పరిశీలిస్తే.. ఈ ఏడాది ఏప్రిల్ - ఆగస్టు కాలంలో 3.38 శాతం పెరిగి ఏకంగా రూ. 1.68 లక్షల కోట్లకు చేరాయి. ఇదే కాలంలో వెండి దిగుమతులు రూ. 16.7 వేల కోట్లుగా నమోదయ్యాయి.
ప్రస్తుతం పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయంగా చమురు ధరలు, దిగుమతి వ్యమాలు విపరీతంగా పెరిగి భారత రూపాయిపై తీవ్ర ఒత్తిడి పడుతోంది. ఈ నేపథ్యంలో దేశ ప్రజలు పసిడి కొనుగోళ్లను తగ్గించుకోవాలని స్వయంగా ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు.
ఇప్పటికే ప్రభుత్వం బంగారం, వెండిపై దిగుమతి సుంకాన్ని 15 శాతానికి పెంచిన విషయం తెలిసిందే. దీనికి తోడు ఇప్పుడు 3 శాతం జీఎస్‌టీ మినహాయింపు కూడా ఎత్తివేస్తే.. దేశంలోకి జరిగే బంగారం, వెండి దిగుమతులకు మరింత అడ్డుకట్ట పడే అవకాశం ఉంది. ఇది పసిడి ప్రియులకు, ఆభరణాల వ్యాపారులకు పెద్ద షాక్ అనే చెప్పాలి.




