HDFC: కస్టమర్లకు బిగ్ అప్‌డేట్..జనవరి 1 నుంచి కొత్త రూల్స్..!

HDFC: హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఖాతాదారులకు ముఖ్య గమనిక. 2027 జనవరి 1 నుంచి రూ. 500 అంతకంటే తక్కువ విలువైన యూపీఐ లావాదేవీలకు SMS అలర్ట్స్ నిలిపివేస్తున్నట్లు బ్యాంక్ ప్రకటించింది.

Gagan kumar
Published on: 29 Nov 2026 7:51 AM IST
HDFC
X

HDFC: కస్టమర్లకు బిగ్ అప్‌డేట్..జనవరి 1 నుంచి కొత్త రూల్స్..!

HDFC Bank UPI SMS Alerts: నేటి డిజిటల్ యుగంలో నగదు రహిత లావాదేవీలు మన దైనందిన జీవితంలో ఒక విడదీయరాని భాగమైపోయాయి. ఉదయం తాగే పది రూపాయల టీ నుంచి కిరాణా సామాను, షాపింగ్, వేల రూపాయల ఈఎంఐల వరకు ప్రతిదానికీ యూపీఐ చెల్లింపులనే ఎక్కువగా వాడుతున్నాం.

మనం ఎవరికైనా డబ్బులు పంపినా లేదా మన ఖాతాలో నగదు జమ అయినా వెంటనే ఫోన్‌కు వచ్చే ఎస్ఎంఎస్ అలర్ట్ చూసుకుని నిశ్చింతగా ఉంటాం. అయితే, త్వరలోనే ఈ అలవాటుకు బ్రేక్ పడనుంది. ముఖ్యంగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కస్టమర్లకు ఇది అత్యంత ముఖ్యమైన సమాచారం.

దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ రంగ బ్యాంకు అయిన హెచ్‌డీఎఫ్‌సీ, యూపీఐ లావాదేవీల ఎస్ఎంఎస్ అలర్ట్ నిబంధనల్లో కీలక మార్పులు తీసుకువచ్చింది. ఇకపై రూ. 500 అంతకంటే తక్కువ విలువైన యూపీఐ లావాదేవీలకు టెక్స్ట్ మెసేజ్ అలర్ట్స్ నిలిపివేయనున్నట్లు బ్యాంక్ అధికారికంగా ప్రకటించింది.

ఈ కొత్త నిబంధన 2027, జనవరి 1 నుంచి అమల్లోకి రానుంది. అంటే కొత్త ఏడాది ప్రారంభం నుంచి మీరు రూ. 100, రూ. 200, లేదా రూ. 500 లోపు ఎంత చెల్లించినా, మీ ఖాతాలోకి ఎంత జమ అయినా మొబైల్‌కు ఎస్ఎంఎస్ రాదు. అయితే, రూ. 500 కంటే ఎక్కువ విలువైన యూపీఐ లావాదేవీలకు మాత్రం యథావిధిగా టెక్స్ట్ మెసేజ్‌లు అందుతాయి.

చిన్న మొత్తాల లావాదేవీలకు ఎస్ఎంఎస్ రాకపోయినా, బ్యాంకు ఖాతాకు అనుసంధానమైన ఇ-మెయిల్ ఐడీకి మాత్రం అన్ని రకాల లావాదేవీల అలర్ట్స్ ఎప్పటిలాగే వస్తాయని హెచ్‌డీఎఫ్‌సీ స్పష్టం చేసింది.

ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్ లావాదేవీల హెచ్చరికలపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జారీ చేసిన సవరించిన మార్గదర్శకాలకు అనుగుణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు బ్యాంక్ పేర్కొంది. రోజువారీగా జరిగే కోట్లాది చిన్నపాటి యూపీఐ లావాదేవీల వల్ల మొబైల్ ఇన్‌బాక్స్‌లలో ఏర్పడుతున్న అనవసరపు మెసేజ్ రద్దీని తగ్గించడమే దీని ప్రధాన ఉద్దేశం.

ఈ మార్పు వల్ల ఖాతాదారులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎస్ఎంఎస్ రాకపోయినా మీరు ఉపయోగించే ఫోన్‌పే, గూగుల్ పే, పేటీఎం వంటి యూపీఐ యాప్‌ల ట్రాన్సాక్షన్ హిస్టరీలో ప్రతి పైసా లెక్కను ఎప్పటికప్పుడు చూసుకోవచ్చు.

అంతేకాకుండా, హెచ్‌డీఎఫ్‌సీ మొబైల్ బ్యాంకింగ్ యాప్ ద్వారా కూడా ఖాతా వివరాలను సులభంగా తనిఖీ చేసుకునే వెసులుబాటు ఉంది. రానున్న రోజుల్లో ఇతర బ్యాంకులు కూడా ఇదే బాటలో నడిచే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Gagan kumar

Gagan kumar

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో సబ్-ఎడిటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్, పాలిటిక్స్ , వైరల్ న్యూస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.