HDFC Bank: హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌పై అమెరికాలో కేసు.. అసలు కారణం ఇదే!
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌పై అమెరికాలో క్లాస్ యాక్షన్ కేసు నమోదైంది. వడ్డీ చెల్లింపులను మార్కెటింగ్ ఖర్చులుగా చూపించారనే ఆరోపణలు ఉన్నాయి.
HDFC Bank
ప్రముఖ ప్రైవేట్ రంగ బ్యాంక్ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌కు అమెరికాలో న్యాయపరమైన చిక్కులు ఎదురయ్యాయి. బ్యాంక్‌పై న్యూయార్క్‌లోని ఫెడరల్ కోర్టులో సెక్యూరిటీస్ క్లాస్ యాక్షన్ దావా నమోదైంది. మహారాష్ట్ర స్టేట్ రోడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (MSRDC)కు చెల్లించిన అదనపు వడ్డీ మొత్తాలను మార్కెటింగ్ ఖర్చులుగా చూపించి అక్రమంగా చెల్లింపులు చేసినట్లు బ్యాంక్‌పై ఆరోపణలు వచ్చాయి.
అమెరికాలోని సదరన్ డిస్ట్రిక్ట్ ఆఫ్ న్యూయార్క్ కోర్టులో ఇన్వెస్టర్ జ్వాలంత్ నట్వరలాల్ సోనేజీ ఈ కేసును దాఖలు చేశారు. ఈ దావాలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌తో పాటు సీఈఓ శశిధర్ జగదీశన్, సీఎఫ్‌ఓ శ్రీనివాసన్ వైద్యనాథన్‌లను ప్రతివాదులుగా పేర్కొన్నారు. 2023 జూలై 17 నుంచి 2026 మే 26 మధ్య బ్యాంక్ అమెరికన్ డిపాజిటరీ షేర్లను కొనుగోలు చేసిన ఇన్వెస్టర్లను ఈ కేసులో భాగస్వాములుగా పేర్కొన్నారు.
ఫిర్యాదులోని ఆరోపణల ప్రకారం.. డిపాజిట్లను ఆకర్షించేందుకు MSRDCకి 6.01 శాతం వడ్డీ రేటును హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఆఫర్ చేసింది. సాధారణ ఖాతాదారులకు అందించే 3.5 శాతం సేవింగ్స్ వడ్డీ రేటుతో పోలిస్తే ఇది ఎక్కువ. 2023 నుంచి 2025 మధ్య సుమారు రూ.45 కోట్ల అదనపు వడ్డీని థర్డ్ పార్టీ వెండర్ల ద్వారా MSRDCకి చెల్లించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఈ మొత్తాలను రోడ్డు భద్రతా ప్రచారానికి సంబంధించిన మార్కెటింగ్ వ్యయాలుగా నమోదు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. అంతర్గత విజిలెన్స్ దర్యాప్తులో ఈ ఏర్పాటు ఆర్బీఐ నిబంధనలు, బ్యాంక్ యాంటీ-బ్రైబరీ విధానాలకు విరుద్ధంగా ఉన్నట్లు గుర్తించిందని పిటిషనర్లు ఆరోపించారు.
అదేవిధంగా, వడ్డీ చెల్లింపులను మార్కెటింగ్ ఖర్చులుగా చూపించడం ద్వారా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ తన అంతర్గత నియంత్రణలు, ఆర్థిక పరిస్థితిపై SEC ఫైలింగ్స్‌లో తప్పుడు సమాచారాన్ని వెల్లడించిందని పిటిషనర్లు పేర్కొన్నారు. 2026 మార్చిలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ చైర్మన్ అతను చక్రవర్తి రాజీనామాను కూడా వారు ప్రస్తావించారు.
మే 27న ఇండియన్ ఎక్స్‌ప్రెస్ ప్రచురించిన అంతర్గత దర్యాప్తు నివేదికను కూడా పిటిషనర్లు తమ ఆరోపణలకు ఆధారంగా పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో 10 మందికి పైగా సీనియర్ అధికారులు బాధ్యత వహించారని, వారిలో సీఈఓ శశిధర్ జగదీశన్ కూడా ఉన్నారని ఆరోపించారు. చెల్లింపులకు ఆయన మౌఖికంగా అనుమతి ఇచ్చినట్లు పిటిషనర్లు పేర్కొన్నారు.
అమెరికా సెక్యూరిటీస్ ఎక్స్ఛేంజ్ యాక్ట్ 1934లోని సెక్షన్లు 10(b), 20(a) ఉల్లంఘించారని పిటిషనర్లు ఆరోపించారు. క్లాస్ యాక్షన్‌గా కేసును గుర్తించాలని, నష్టపరిహారం ఇప్పించాలని, జ్యూరీ ట్రయల్ నిర్వహించాలని వారు కోర్టును కోరారు.
అయితే ఈ ఆరోపణలను హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఖండించింది. ఈ దావాకు ఎలాంటి మెరిట్ లేదని, కేసును తాము తీవ్రంగా ఎదుర్కొంటామని బ్యాంక్ వెల్లడించింది.




