HDFC: కస్టమర్లకు బిగ్ అలెర్ట్.. ఈఎంఐల్లో భారీ మార్పులు
HDFC: హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ తన MCLR రేట్లలో కీలక మార్పులు చేసింది.
HDFC
HDFC Interest Rates : ప్రముఖ ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ తన మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్‌లో కీలక మార్పులు చేసింది. ఈ నిర్ణయం వల్ల కొందరికి జేబు ఖాళీ అవుతుంటే, మరికొందరికి మాత్రం వడ్డీ భారం తగ్గుతోంది. బ్యాంకు తీసుకున్న నిర్ణయం వల్ల ముఖ్యంగా గృహ రుణాలు తీసుకున్న వారిపై ప్రభావం పడనుంది. మూడేళ్ల కాలపరిమితి గల MCLR రేటును బ్యాంకు 0.05 శాతం పెంచి 8.60 శాతానికి చేర్చింది. మీరు ఇప్పటికే ఫ్లోటింగ్ వడ్డీ రేటుతో గృహ రుణాలు లేదా భారీ మొత్తంలో వ్యక్తిగత రుణాలు తీసుకుని ఉంటే, మీ EMIలు పెరిగే అవకాశం ఉంది. దీర్ఘకాలికంగా బ్యాంకుకు చెల్లింపులు చేస్తున్న మధ్యతరగతి కస్టమర్లకు ఇది కొంత భారంగా మారనుంది.
వ్యాపారాలకు ఊరట
ఒకవైపు వడ్డీ పెంచుతూనే, మరోవైపు స్వల్పకాలిక రుణాలపై బ్యాంకు కనికరం చూపింది. రాత్రికి రాత్రే తీసుకునే రుణాల నుంచి ఆరు నెలల కాలపరిమితి వరకు ఉన్న MCLR రేట్లను 0.05 శాతం తగ్గించింది. వర్కింగ్ క్యాపిటల్ అవసరాల కోసం లేదా తక్షణ వ్యాపార విస్తరణ కోసం రుణాలు తీసుకునే వ్యాపారవేత్తలకు వడ్డీ రేటు తగ్గడం వల్ల ఊరట లభిస్తుంది. తాజాగా ఒక నెల MCLR 8.05%, మూడు నెలలది 8.15%, ఆరు నెలలది 8.30 శాతంగా నిర్ణయించారు. ఒక సంవత్సరం , రెండు సంవత్సరాల కాలపరిమితి కలిగిన రుణ రేట్లలో మాత్రం ఎలాంటి మార్పు చేయలేదు. ఇవి వరుసగా 8.35 శాతం, 8.45 శాతం వద్దే స్థిరంగా ఉన్నాయి. అంటే చాలా వరకు వాహన రుణాలు లేదా సాధారణ వ్యక్తిగత రుణాలపై తక్షణ ప్రభావం ఉండకపోవచ్చు.
అసలేమిటీ MCLR?
రుణాలపై పారదర్శకత తీసుకురావడానికి 2016లో ఆర్బీఐ ఈ విధానాన్ని తెచ్చింది. సాధారణంగా నిధుల సమీకరణ ఖర్చు, బ్యాంకు నిర్వహణ వ్యయాలను బట్టి బ్యాంకులు ఈ రేట్లను నిర్ణయిస్తాయి. అంటే, బ్యాంకు రుణం ఇవ్వగలిగే కనీస వడ్డీ రేటు ఇదే. దీనికంటే తక్కువకు రుణాలు ఇవ్వడం చట్టరిత్యా సాధ్యం కాదు. మొత్తానికి హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ తీసుకున్న ఈ నిర్ణయం.. మార్కెట్‌లో నగదు లభ్యత , భవిష్యత్తు ఆర్థిక పరిస్థితులను అంచనా వేస్తూ చేసినట్లు కనిపిస్తోంది.




