Health Insurance: హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్‌లో సమస్య వస్తే ఏం చేయాలి? ఎవ‌రికి ఫిర్యాదు చేయాలి

Health Insurance: ఆరోగ్య బీమా తీసుకోవడం వల్ల ఆసుపత్రి ఖర్చుల సమయంలో ఆర్థిక భారం కొంతవరకు తగ్గుతుంది.

Mokshith
Published on: 30 Sept 2026 4:32 PM IST
Health Insurance
X

Health Insurance: హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్‌లో సమస్య వస్తే ఏం చేయాలి? ఎవ‌రికి ఫిర్యాదు చేయాలి

Health Insurance: ఆరోగ్య బీమా తీసుకోవడం వల్ల ఆసుపత్రి ఖర్చుల సమయంలో ఆర్థిక భారం కొంతవరకు తగ్గుతుంది. అయితే పాలసీ ఉన్నప్పటికీ క్లెయిమ్‌ విషయంలో ఇబ్బందులు ఎదురైతే పాలసీదారులు అయోమయానికి గురవుతుంటారు. క్లెయిమ్‌ తిరస్కరణ, ఆలస్యం, సరైన సమాచారం ఇవ్వకపోవడం, సేవల్లో లోపాలు వంటి సమస్యలు ఎదురైనప్పుడు ఎవరిని సంప్రదించాలి అనే విషయం చాలామందికి తెలియదు.

ముందుగా బీమా సంస్థకే ఫిర్యాదు చేయాలి

క్లెయిమ్‌ విషయంలో సమస్య తలెత్తిన వెంటనే సంబంధిత ఆరోగ్య బీమా కంపెనీని సంప్రదించాలి. సాధారణంగా ప్రతి బీమా సంస్థలో పాలసీదారుల సమస్యలను స్వీకరించి పరిష్కరించేందుకు ప్రత్యేకంగా గ్రీవియ‌న్స్ రెడ్రెస్స‌ల్ సెల్ ఉంటుంది. క్లెయిమ్‌ తిరస్కరణకు సంబంధించిన వివరాలతో పాటు పాలసీ కాపీ, ఆసుపత్రి బిల్లులు, వైద్య రికార్డులు, క్లెయిమ్‌ పత్రాలు, బీమా సంస్థ నుంచి వచ్చిన సమాచారాన్ని జత చేసి ఫిర్యాదు చేయవచ్చు.

బీమా సంస్థ ఆ ఫిర్యాదు అందిన విషయాన్ని సాధారణంగా 3 పని దినాల్లోపు తెలియజేయాలి. ఫిర్యాదును 2 వారాల్లోపు పరిష్కరించాల్సి ఉంటుంది. ఒకవేళ క్లెయిమ్‌ను మరోసారి తిరస్కరిస్తే, అందుకు కారణాలను కూడా సంస్థ వెల్లడించాలి. ఆ నిర్ణయంతో పాలసీదారు సంతృప్తి చెందకపోతే, తన అభ్యంతరాన్ని బీమా సంస్థకు స్పష్టంగా తెలియజేయాలి.

సమస్య పరిష్కారం కాకపోతే IRDAIకి ఫిర్యాదు

బీమా సంస్థ స్థాయిలో ఫిర్యాదుకు తగిన పరిష్కారం లభించకపోతే ఇన్సూరెన్స్ రెగ్యులేట‌రీ అండ్ డెవ‌ల‌ప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (IRDAI)ని ఆశ్రయించవచ్చు. పాలసీదారుల సమస్యలు, ఫిర్యాదుల పరిష్కారం కోసం IRDAI.. భీమా భ‌రోసా వ్యవస్థను అందుబాటులో ఉంచింది.

బీమా సంస్థపై ఫిర్యాదును భీమా భ‌రోసా ద్వారా నమోదు చేయడంతో పాటు 1800 4254 732 లేదా 155255 నంబర్లకు ఫోన్‌ చేయవచ్చు. అలాగే [email protected], [email protected]కు ఈమెయిల్‌ ద్వారా కూడా సమస్యను తెలియజేసే అవకాశం ఉంది. అవసరమైతే పోస్టు ద్వారా కూడా IRDAIకి ఫిర్యాదు పంపవచ్చు. ఫిర్యాదు అందిన తర్వాత IRDAI దాన్ని సంబంధిత బీమా సంస్థకు పంపిస్తుంది. అనంతరం పాలసీదారుడి సమస్యను బీమా సంస్థ పరిశీలించి పరిష్కరించాల్సి ఉంటుంది.

బీమా అంబుడ్స్‌మన్‌ను కూడా ఆశ్రయించవచ్చు

బీమా సంస్థ ఇచ్చిన పరిష్కారం పాలసీదారుడికి ఆమోదయోగ్యంగా లేకపోతే తదుపరి మార్గంగా ఇన్సూరెన్స్ అంబుడ్స్‌మ‌న్‌ను సంప్రదించవచ్చు. పాలసీదారులు ఎదుర్కొనే కొన్ని బీమా సంబంధిత వివాదాలను అంబుడ్స్‌మన్‌ పరిశీలించి పరిష్కరించే విధానం ఉంది. అంబుడ్స్‌మన్‌ ముందు ఫిర్యాదు చేసినప్పుడు సంబంధిత పాలసీ పత్రాలు, క్లెయిమ్‌ వివరాలు, బీమా సంస్థతో జరిగిన కమ్యూనికేషన్‌, ఇప్పటికే చేసిన ఫిర్యాదులకు సంబంధించిన ఆధారాలను సమర్పించడం ఉపయోగకరంగా ఉంటుంది. కేసును పరిశీలించిన అనంతరం ఇరుపక్షాల వాదనలు, అందుబాటులో ఉన్న ఆధారాల ఆధారంగా అంబుడ్స్‌మన్‌ నిర్ణయం తీసుకుంటారు.

వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించే అవకాశం

అంబుడ్స్‌మన్‌ ప్రక్రియ తర్వాత కూడా పాలసీదారుడికి పరిష్కారం నచ్చకపోతే, పరిస్థితిని బట్టి వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించే అవకాశం ఉంటుంది. అక్కడ బీమా సంస్థ సేవల్లో లోపం ఉందని భావిస్తున్న కారణాలు, క్లెయిమ్‌కు సంబంధించిన పత్రాలు, సంస్థతో జరిగిన ఉత్తరప్రత్యుత్తరాలు వంటి ఆధారాలను సమర్పించాల్సి ఉంటుంది.

కొన్ని సందర్భాల్లో అంబుడ్స్‌మన్‌ మార్గాన్ని ఎంచుకోకుండా, అందుబాటులో ఉన్న చట్టపరమైన పరిష్కారాల ప్రకారం IRDAI ప్రక్రియ అనంతరం నేరుగా వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించే అవకాశం కూడా ఉంటుంది. కేసును స్వీకరించిన కమిషన్‌ ఇరుపక్షాల వాదనలు, పత్రాలను పరిశీలించి తగిన నిర్ణయం తీసుకుంటుంది.

ఫిర్యాదు చేసే ముందు ఈ పత్రాలు సిద్ధంగా ఉంచండి

హెల్త్‌ ఇన్సూరెన్స్‌ విషయంలో ఫిర్యాదు చేయాల్సి వచ్చినప్పుడు సరైన ఆధారాలు దగ్గర ఉంచుకోవడం చాలా ముఖ్యం. పాలసీ నంబర్‌, పాలసీ కాపీ, క్లెయిమ్‌ నంబర్‌, ఆసుపత్రి బిల్లులు, డిశ్చార్జ్‌ సమ్మరీ, వైద్య నివేదికలు, క్లెయిమ్‌ తిరస్కరణ లేఖ, బీమా సంస్థతో జరిగిన ఈమెయిల్‌ లేదా ఇతర కమ్యూనికేషన్‌ వంటి పత్రాలను భద్రపరచుకోవాలి.

ముందుగా బీమా సంస్థ గ్రీవెన్స్‌ సెల్‌ను సంప్రదించి, పరిష్కారం లభించకపోతే IRDAI Bima Bharosa వ్యవస్థను ఉపయోగించవచ్చు. అక్కడి తర్వాత అవసరాన్ని బట్టి అంబుడ్స్‌మన్‌ లేదా వినియోగదారుల కమిషన్‌ వంటి తదుపరి మార్గాలను పరిశీలించవచ్చు. ప్రతి దశలో ఫిర్యాదు నంబర్‌, సమర్పించిన పత్రాలు, వచ్చిన సమాధానాలను భద్రపరచుకోవడం వల్ల సమస్యను ముందుకు తీసుకెళ్లేటప్పుడు ఉపయోగపడుతుంది.

Mokshith

Mokshith

2015లో జ‌ర్న‌లిజం స్కూల్ ద్వారా నా కెరీర్‌ను ప్రారంభించాను. అనంత‌రం 2016 నుంచి ప‌లు మీడియా సంస్థ‌ల్లో ప‌నిచేశాను. మొద‌ట ప్రింట్ ఆ త‌ర్వాత డిజిట‌ల్‌లో క‌లిపి మొత్తం 10 ఏళ్ల అనుభ‌వం ఉంది. నేను ఎక్కువ‌గా లైఫ్‌స్టైల్‌, అంత‌ర్జాతీయం, టెక్నాల‌జీ, బిజినెస్‌, ఆస్ట్రాల‌జీకి సంబంధించి వార్త‌లు రాస్తుంటాను.