50 లక్షల హోమ్ లోన్‌కి నెలకు ఎంత EMI కట్టాలి.? జీతం ఎంత వస్తే ఇది సాధ్యమవుతుంది.?
Home Loan: ప్రస్తుత కాలంలో సొంత ఇల్లు నిర్మించుకోవడం లేదా ఫ్లాట్ కొనుగోలు చేయడం కోసం చాలామంది బ్యాంకు రుణాలపై ఆధారపడుతున్నారు.
50 లక్షల హోమ్ లోన్‌కి నెలకు ఎంత EMI కట్టాలి.? జీతం ఎంత వస్తే ఇది సాధ్యమవుతుంది.?
Home Loan: ప్రస్తుత కాలంలో సొంత ఇల్లు నిర్మించుకోవడం లేదా ఫ్లాట్ కొనుగోలు చేయడం కోసం చాలామంది బ్యాంకు రుణాలపై ఆధారపడుతున్నారు. ముఖ్యంగా ప్రభుత్వ రంగ బ్యాంకులలో గృహ రుణాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. అయితే రూ.50 లక్షల హోమ్ లోన్ తీసుకోవాలంటే ఎంత జీతం ఉండాలి? నెలవారీ EMI ఎంత పడుతుంది?
హోమ్ లోన్ పొందాలంటే సిబిల్ స్కోర్ కీలకం
గృహ రుణం మంజూరు చేసే సమయంలో బ్యాంకులు మొదట పరిశీలించే అంశం సిబిల్ స్కోర్. ఇది వ్యక్తి క్రెడిట్ చరిత్రను తెలియజేస్తుంది. సాధారణంగా సిబిల్ స్కోర్ 300 నుంచి 900 మధ్య ఉంటుంది. 750 లేదా అంతకంటే ఎక్కువ స్కోర్ ఉన్నవారికి రుణం పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే తక్కువ వడ్డీ రేట్ల ప్రయోజనం కూడా లభించే అవకాశం ఉంటుంది. సిబిల్ స్కోర్ బాగుంటే లోన్ ఆమోద ప్రక్రియ కూడా వేగంగా పూర్తవుతుంది.
ఎస్‌బీఐ హోమ్ లోన్‌పై ప్రస్తుతం వడ్డీ రేటు ఎంత?
ప్రస్తుతం ఎస్‌బీఐ గృహ రుణాలపై సుమారు 8 శాతం ప్రారంభ వార్షిక వడ్డీ రేటును అందిస్తోంది. అయితే ఇది దరఖాస్తుదారుడి సిబిల్ స్కోర్, ఆదాయం, ఉద్యోగ స్థిరత్వం వంటి అంశాలపై ఆధారపడి మారవచ్చు. రుణం తీసుకునే ముందు తాజా వడ్డీ రేట్లను బ్యాంకు వద్ద ఒకసారి నిర్ధారించుకోవడం మంచిది.
రూ.50 లక్షల హోమ్ లోన్‌కు EMI ఎంత వస్తుంది?
ఒకవేళ మీరు రూ.50 లక్షల గృహ రుణాన్ని 30 సంవత్సరాల కాలపరిమితికి, 8 శాతం వడ్డీ రేటుతో తీసుకుంటే నెలవారీ EMI సుమారు రూ.36,700 వరకు వచ్చే అవకాశం ఉంటుంది. రుణ కాలపరిమితి పెరిగితే EMI తగ్గుతుంది. కానీ మొత్తం చెల్లించే వడ్డీ భారం మాత్రం పెరుగుతుంది. అందుకే రుణ కాలాన్ని నిర్ణయించే ముందు మీ ఆదాయం, ఖర్చులను బట్టి సరైన నిర్ణయం తీసుకోవాలి.
రూ.50 లక్షల లోన్‌కు కనీస జీతం ఎంత ఉండాలి?
సాధారణంగా బ్యాంకులు నెలవారీ ఆదాయంలో 45 నుంచి 50 శాతం వరకు మాత్రమే EMI ఉండేలా రుణాలను మంజూరు చేస్తాయి. ఆ లెక్కన చూస్తే రూ.36,700 EMIని సులభంగా చెల్లించాలంటే నెలకు కనీసం రూ.73,000 నుంచి రూ.75,000 వరకు ఆదాయం ఉండటం మంచిదిగా భావిస్తారు. ఇప్పటికే ఇతర వ్యక్తిగత రుణాలు, వాహన రుణాలు ఉంటే అవసరమైన జీతం మరింత ఎక్కువగా ఉండవచ్చు.
లోన్ తీసుకునే ముందు గుర్తుంచుకోవాల్సిన విషయాలు
హోమ్ లోన్ కోసం దరఖాస్తు చేసే ముందు సిబిల్ స్కోర్‌ను ఒకసారి పరిశీలించుకోవాలి. అలాగే ప్రస్తుతం ఉన్న అన్ని రుణ బకాయిలను అంచనా వేసుకోవాలి. నెలవారీ ఆదాయంలో పెద్ద భాగం EMIలకు వెళితే భవిష్యత్తులో ఆర్థిక ఒత్తిడి పెరిగే అవకాశం ఉంటుంది. అందువల్ల డౌన్ పేమెంట్‌ను వీలైనంత ఎక్కువగా చెల్లించడం, తక్కువ రుణం తీసుకోవడం, మంచి సిబిల్ స్కోర్‌ను కొనసాగించడం ద్వారా తక్కువ వడ్డీతో గృహ రుణాన్ని పొందవచ్చు.




