ఒక వ్యక్తికి ఎన్ని బ్యాంక్ అకౌంట్లు ఉండాలో తెలుసా.? ఎన్ని దాటకూడదంటే.?
జీవితంలో ఆర్థిక క్రమశిక్షణ పాటించాలంటే ప్రతి వ్యక్తికీ ఎన్ని బ్యాంక్ అకౌంట్లు ఉండాలి? ఒకే అకౌంట్‌తో ఎందుకు కష్టాలు వస్తాయి?
ఒక వ్యక్తికి ఎన్ని బ్యాంక్ అకౌంట్లు ఉండాలో తెలుసా.? ఎన్ని దాటకూడదంటే.?
బ్యాంకు: సాధారణంగా చాలామందికి ఒకటి లేదా రెండు బ్యాంక్ అకౌంట్లు మాత్రమే ఉంటాయి. వచ్చే ఆదాయాన్ని దాంట్లోనే వేసుకుంటారు, ఖర్చులన్నీ అదే అకౌంట్ నుంచి చేస్తుంటారు. అయితే, ఇలా ఒకే అకౌంట్‌ను అన్నింటికీ వాడటం వల్ల మన డబ్బు ఎలా వస్తుంది, ఎలా ఖర్చు అవుతుంది అనేది అర్థం కాక నెలాఖరుకు అప్పుల పాలవుతున్నారని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఈ గందరగోళానికి చెక్ పెడుతూ, భవిష్యత్తు కోసం సరైన ఆర్థిక ప్రణాళికను అమలు చేయడానికి ప్రతి వ్యక్తి తన జీవితంలో కచ్చితంగా నాలుగు వేర్వేరు బ్యాంక్ ఖాతాలు మెయింటైన్ చేయడం ఉత్తమమని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. ఈ నాలుగు ఖాతాలు ఎలా ఉపయోగించాలో నిపుణులు ఇలా వివరించారు.
ఆదాయ ఖాతా: మీకు జీతం రూపంలో గానీ, వ్యాపారం ద్వారా గానీ ఎక్కడి నుంచి ఆదాయం వచ్చినా ముందుగా ఆ డబ్బును ఈ ఖాతాలోనే జమ చేయాలి. ఈ అకౌంట్‌లో డబ్బు వేయడం తప్ప, మీ ఇష్టం వచ్చినట్లు నేరుగా ఖర్చులు చేయడానికి దీనిని ఉపయోగించకూడదు. దీనివల్ల నెలకు మీకు ఎంత ఆదాయం వస్తుందనే దానిపై ఒక స్పష్టత ఉంటుంది.
పెట్టుబడుల ఖాతా: మీ ఆదాయం నుంచి కొంత భాగాన్ని భవిష్యత్తు పెట్టుబడుల(ఫిక్స్‌డ్ డిపాజిట్లు, మ్యూచువల్ ఫండ్స్, బంగారం, షేర్లు వగైరా) కోసం ఈ రెండవ ఖాతాలోకి మళ్లించాలి. ఈ అకౌంట్‌లోని డబ్బును కేవలం పెట్టుబడులకు మాత్రమే వాడాలి.
ఖర్చుల ఖాతా: నెలవారీ ఇంటి ఖర్చులు, సరుకులు, నిత్యావసరాలు, పిల్లల ఫీజులు, వినోదం, ఇతర నెలవారీ చెల్లింపుల కోసం ఈ ప్రత్యేక ఖాతాను ఏర్పాటు చేసుకోవాలి. ఆదాయ ఖాతా నుంచి ఖర్చులకు సరిపడా డబ్బును ఇందులోకి బదిలీ చేసుకుని, దీని ద్వారానే నెలంతా ఖర్చులు చేయాలి.
అత్యవసర ఖాతా: జీవితంలో అనుకోకుండా వచ్చే ఆరోగ్య సమస్యలు లేదా ఇతర అత్యవసర పరిస్థితుల కోసం కొంత నిధిని ఈ నాలుగో ఖాతాలో పొదుపు చేస్తూ రావాలి. ఇది ఆపద సమయంలో ఇతరుల ముందు చెయ్యి చాపకుండా మనల్ని ఆర్థికంగా ఆదుకుంటుంది.
జన్ ధన్ యోజన లాంటి పథకాల ద్వారా పేదవారు కూడా జీరో బ్యాలెన్స్‌తో అకౌంట్లు తెరుచుకునే సదుపాయం ఉందని, కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ నాలుగు అకౌంట్ల విధానాన్ని పాటిస్తే ఆర్థిక క్రమశిక్షణ అలవడి జీవితంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ధైర్యంగా ముందుకు సాగవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.




