ICICI Bank: కస్టమర్లకు ఐసీఐసీఐ బిగ్ షాక్.. డిసెంబర్ 1 నుంచి ఛార్జీల మోత!
ICICI Bank: ప్రవాస భారతీయ ఖాతాదారులకు ఐసీఐసీఐ బ్యాంక్ కీలక అప్డేట్ ఇచ్చింది.
ICICI Bank: కస్టమర్లకు ఐసీఐసీఐ బిగ్ షాక్.. డిసెంబర్ 1 నుంచి ఛార్జీల మోత!
ICICI Bank NRI Account: దేశీయ ప్రైవేట్ రంగ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంక్ తమ ప్రవాస భారతీయ ఖాతాదారులకు కీలక అప్డేట్ ఇచ్చింది. వివిధ రకాల ఎన్ఆర్ఐ సేవింగ్స్ అకౌంట్లపై వర్తించే సర్వీస్ ఛార్జీలను సవరిస్తూ బ్యాంక్ కీలక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 1, 2026 నుంచి ఈ కొత్త నిబంధనలు అమలులోకి రానున్నాయి. ముఖ్యంగా నగదు డిపాజిట్లు, విత్‌డ్రాయల్స్, అలాగే ఆటో డెబిట్ ఫెయిల్యూర్స్‌పై విధించే ఫీజులను పెంచుతూ బ్యాంక్ అధికారిక ప్రకటన విడుదల చేసింది.
ఆగస్టు 4, 2025కి ముందు తెరిచిన ఖాతాలతో సహా ఎన్ఆర్ఐ ప్రైవేట్ బ్యాంకింగ్, ఎన్ఆర్ఐ ప్రీమియం, సెలెక్ట్, ప్రో, రెగ్యులర్, సీఫేరర్, వర్చూ, ఎన్ఆర్ఐ స్పర్ష్ ఖాతాలన్నింటికీ ఈ కొత్త ఛార్జీలు వర్తిస్తాయి. బ్యాంక్ శాఖల్లో చేసే లావాదేవీలతో పాటు క్యాష్ రీసైక్లర్ మెషీన్ల ద్వారా చేసే నగదు డిపాజిట్లపైనా ఈ నిబంధనలు ఉంటాయి. వీటికి అదనంగా వర్తించే జీఎస్టీ కూడా చెల్లించాల్సి ఉంటుంది.
నెలవారీ ఉచిత విలువ పరిమితి దాటిన తర్వాత జరిపే నగదు లావాదేవీలపై ఇప్పటివరకు ప్రతి రూ.1,000కి రూ.3.50 వసూలు చేసేవారు. డిసెంబర్ 1 నుంచి దీనిని ప్రతి రూ.1,000కి రూ.4 లేదా రూ.150 చొప్పున వసూలు చేయనున్నారు. సాధారణ ఎన్ఆర్ఐ ఖాతాలకు నెలకు 3 నగదు డిపాజిట్లు, 3 విత్‌డ్రాయల్స్ ఉచితంగా ఉంటాయి.
ఆ తర్వాత జరిపే ప్రతి లావాదేవీకి రూ.150 ఫీజు పడుతుంది. విలువ పరంగా నెలకు డిపాజిట్లకు రూ.1 లక్ష, విత్‌డ్రాయల్స్‌కు రూ.1 లక్ష వరకు ఉచిత పరిమితి కొనసాగుతుంది. నాన్-ప్రోగ్రామ్ థర్డ్ పార్టీ నగదు లావాదేవీలకు ఒక్కోసారికి రూ.25,000 గరిష్ఠ పరిమితి ఉంటుంది. ఒకే లావాదేవీలో సంఖ్య, విలువ రెండు పరిమితులూ దాటితే, రెండింటిలో ఏది ఎక్కువ ఛార్జీ అయితే దాన్ని వసూలు చేస్తారు.
అధిక నిల్వలు కలిగిన ఖాతాదారులకు బ్యాంక్ ప్రత్యేక ఊరటనిచ్చింది. గత మూడు నెలల్లో ఏదైనా ఒక నెలలో కనీసం రూ.1 కోటి రిలేషన్షిప్ విలువ లేదా రూ.25 లక్షల డిపాజిట్లు ఉన్న ఎన్ఆర్ఐ ప్రైవేట్ బ్యాంకింగ్, ప్రీమియా ఖాతాదారులకు అదనపు పరిమితులు ఉంటాయి:వీరికి నెలకు మొత్తం 15 ఉచిత లావాదేవీలు లభిస్తాయి. డిపాజిట్లు, విత్‌డ్రాయల్స్‌కు విడివిడిగా నెలకు రూ.15 లక్షల వరకు ఉచిత విలువ పరిమితి ఉంటుంది. ఆ తర్వాతే కొత్త ఛార్జీలు వర్తిస్తాయి.
ఖాతాలో తగినంత బ్యాలెన్స్ లేకపోవడం వంటి ఆర్థిక కారణాల వల్ల ఆటో డెబిట్ విఫలమైతే విధించే జరిమానాను బ్యాంక్ పెంచింది.నెలలో మొదటిసారి రిటర్న్ అయితే పాత రేటు ప్రకారమే రూ.500 వసూలు చేస్తారు. అదే నెలలో అదే మాండేట్పై రెండోసారి, మూడోసారి బౌన్స్ అయితే ఒక్కోసారికి రూ.550 చొప్పున జరిమానా విధిస్తారు.
ఒక నెలలో ఒక మాండేట్పై గరిష్ఠంగా 3 సార్లు మాత్రమే ఈ రిటర్న్ ఛార్జీలు వసూలు చేస్తారు. డిసెంబర్ 1 నుంచి ఈ మార్పులు అమలులోకి రానున్న నేపథ్యంలో, ఎన్ఆర్ఐ ఖాతాదారులు అనవసరపు ఛార్జీల భారం పడకుండా ఉండాలంటే తమ నెలవారీ నగదు లావాదేవీల పరిమితులను, ఖాతాలో కనీస నిల్వలను ఎప్పటికప్పుడు సరిచూసుకోవడం ఉత్తమం.




