Income Tax Free: అక్కడ ఆదాయపు పన్ను ఎందుకు ఉండదు? ఎంత సంపాదించినా మొత్తం మీకే..!
Income Tax Free: భారతదేశంలో ఆదాయంపై ట్యాక్స్ కట్టడం తప్పనిసరి. కానీ ప్రపంచంలో కొన్ని దేశాల్లో ఒక్క రూపాయి కూడా ఇన్‌కమ్ ట్యాక్స్ కట్టాల్సిన పని లేదు.
Income Tax Free: అక్కడ ఆదాయపు పన్ను ఎందుకు ఉండదు? ఎంత సంపాదించినా మొత్తం మీకే..!
Tax Free Countries: సాధారణంగా మనం రూపాయి సంపాదిస్తే అందులో ఎంతో కొంత ప్రభుత్వానికి పన్ను రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. భారతదేశం వంటి దేశాల్లో ఆదాయం పెరిగే కొద్దీ పన్ను భారం కూడా పెరుగుతూ ఉంటుంది. కానీ, ప్రపంచంలో కొన్ని దేశాలు ఉన్నాయి.. అక్కడ మీరు ఎంత సంపాదించినా, పన్ను రూపంలో ఒక్క పైసా కూడా ప్రభుత్వానికి ఇవ్వాల్సిన పని లేదు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. ఆ దేశాల విశేషాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
మధ్యప్రాచ్య దేశాలు
చమురు నిల్వలు పుష్కలంగా ఉన్న గల్ఫ్ దేశాల్లో ఆదాయపు పన్ను అనేది దాదాపు శూన్యం. దుబాయ్, అబుదాబి వంటి నగరాల్లో నివసించే వారు తమ వ్యక్తిగత ఆదాయంపై ఎలాంటి పన్ను చెల్లించరు. అయితే, చమురు కంపెనీలపై మాత్రం అక్కడ భారీగా పన్ను ఉంటుంది. ఖతార్‌లో వ్యక్తిగత ఆదాయపు పన్ను లేదా కార్పొరేట్ పన్ను ఉండదు. అయితే, వస్తువులు , సేవలపై 5 శాతం వ్యాట్ మాత్రం అమల్లో ఉంది. ఈ దేశాల్లో కూడా వ్యక్తిగత ఆదాయం, సంపద లేదా మూలధన లాభాలపై ఎలాంటి పన్నులు ఉండవు. కేవలం దిగుమతులపై కస్టమ్స్ సుంకాలు వంటి పరోక్ష పన్నులు మాత్రమే ఉంటాయి.
నిబంధనలతో కూడిన పన్ను
బహ్రెయిన్‌లో కూడా పన్ను మినహాయింపులు చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. ఏడాదికి 40 వేల డాలర్ల కంటే తక్కువ సంపాదించే వారికి పన్ను భయం లేదు. అంతకంటే ఎక్కువ సంపాదిస్తే మాత్రం 15 శాతం పన్ను కట్టాలి. ఇక విదేశీ బ్యాంకులు, గ్యాస్ కంపెనీలకు మాత్రం 40 శాతం వరకు పన్ను విధిస్తారు.
ఐరోపా, కరీబియన్ దీవుల విలాసం
ప్రపంచ కుబేరుల నిలయమైన మొనాకోలో ఇన్‌కమ్ టాక్స్ సున్నా. అందుకే ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంపన్నులు ఇక్కడ నివసించడానికి ఆసక్తి చూపుతారు. అయితే ఇక్కడ వ్యాపారాలు చేసే కంపెనీలు 10 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. బహామాస్ దేశంలో వ్యక్తిగత ఆదాయం, బహుమతులు, వారసత్వ ఆస్తులపై పన్నులు ఉండవు. ప్రభుత్వం కేవలం వ్యాట్, స్టాంప్ డ్యూటీల ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకుంటుంది.
భారతదేశం పరిస్థితి ఏంటి?
మన దేశంలో పరిస్థితి ఇందుకు భిన్నం. వ్యక్తిగత ఆదాయంతో పాటు వ్యాపార సంస్థలు కూడా తమ లాభాలపై పన్ను చెల్లించాల్సిందే. అయితే, భారత ప్రభుత్వం అప్పుడప్పుడు పన్ను పరిమితులను సవరిస్తూ, మినహాయింపులు ఇస్తూ సామాన్యులకు ఊరట కలిగిస్తుంటుంది.




