Russia Fuel Crisis: రష్యాకు భారత్‌ నుంచి పెట్రోల్.. భారీగా పెరిగిన ఎగుమతులు

Russia Fuel Crisis: ఉక్రెయిన్ డ్రోన్ దాడులతో రష్యాలో ఇంధన ఉత్పత్తి దెబ్బతినడంతో భారత్ నుంచి పెట్రోల్ ఎగుమతులు భారీగా పెరిగాయి.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 31 Aug 2026 2:19 AM IST
Russia Fuel Crisis
X

Russia Fuel Crisis: రష్యాకు భారత్‌ నుంచి పెట్రోల్.. భారీగా పెరిగిన ఎగుమతులు

Russia Fuel Crisis: రష్యాలోని రిఫైనరీలపై ఉక్రెయిన్‌ డ్రోన్‌ దాడులు తీవ్ర ప్రభావం చూపుతున్న నేపథ్యంలో భారత్‌ నుంచి రష్యాకు పెట్రోల్‌ ఎగుమతులు పెరిగాయి. రష్యాలో దేశీయ ఇంధన ఉత్పత్తికి అంతరాయం ఏర్పడటంతో అక్కడ ఇంధన కొరత నెలకొంది. దీంతో రష్యాకు గ్యాసోలిన్‌ సరఫరా చేసే కీలక దేశంగా భారత్‌ మారినట్లు షిప్‌ ట్రాకింగ్‌ డేటా వెల్లడించింది.

ఎనర్జీ అనలిటిక్స్‌ సంస్థ వోర్టెక్సా ప్రకారం.. రిఫైనరీలపై వరుసగా డ్రోన్‌ దాడులు జరగడంతో ఆగస్టులో రష్యా సముద్ర మార్గం ద్వారా చేసుకున్న గ్యాసోలిన్‌ దిగుమతులు రోజుకు సుమారు 1.25 లక్షల బ్యారెళ్లకు చేరాయి. ఇది నెలకు దాదాపు 4.70 లక్షల టన్నులకు సమానం కాగా, రష్యా గ్యాసోలిన్‌ దిగుమతుల్లో రికార్డు స్థాయి నమోదైనట్లు తెలుస్తోంది.

గత రెండు నెలల్లో భారతీయ రిఫైనరీలు రష్యాకు దాదాపు 10 లక్షల బ్యారెళ్ల వరకు గ్యాసోలిన్‌ సరఫరా చేసినట్లు వాణిజ్య వర్గాలు తెలిపాయి. ఈ ఎగుమతుల్లో ఎక్కువ భాగం గుజరాత్‌లోని వడినార్‌ రిఫైనరీ నుంచి జరిగినట్లు సమాచారం. ఈ రిఫైనరీని నయారా ఎనర్జీ నిర్వహిస్తోంది. ఇందులో రష్యాకు చెందిన రోస్నెఫ్ట్‌కు 50 శాతం వాటా ఉంది.

2022 నుంచి భారత్‌ రష్యా నుంచి ముడి చమురు దిగుమతులను గణనీయంగా పెంచుకుంది. ఈ ఏడాది జూన్‌, జూలైలో రష్యా నుంచి భారత్‌ దిగుమతి చేసుకున్న ముడి చమురు రోజుకు 26 లక్షల బ్యారెళ్లకు పైగా ఉన్నట్లు సమాచారం. ఇది భారత్‌ మొత్తం ముడి చమురు దిగుమతుల్లో సగానికి పైగా కావడం గమనార్హం. భారత్‌ రష్యాకు ఎగుమతి చేసిన గ్యాసోలిన్‌లో కొంత భాగం రష్యా నుంచి దిగుమతి చేసుకున్న ముడి చమురుతోనే తయారై ఉండొచ్చని సంబంధిత నివేదిక పేర్కొంది.

మరోవైపు, రష్యా ఇంధన మౌలిక సదుపాయాలపై ఉక్రెయిన్‌ దాడులు అక్కడి దేశీయ ఇంధన ఉత్పత్తిపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఉత్పత్తి 70 శాతం వరకు తగ్గినట్లు సమాచారం. దీంతో రష్యా దేశీయ అవసరాలను తీర్చుకోవడానికి గ్యాసోలిన్‌ దిగుమతులపై ఆధారపడాల్సి వస్తోంది. ఇంధన కొరత నేపథ్యంలో దేశీయ ఇంధన విక్రయాలపై కూడా రష్యా ఆంక్షలు విధించినట్లు తెలుస్తోంది.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story