7 శాతం పెరిగిన ఇళ్ల ధరలు.. దిల్లీ-ఎన్సీఆర్లో భారీ వృద్ధి
దేశంలోని 7 ప్రధాన నగరాల్లో ఇళ్ల ధరలు 7% పెరిగాయి. దిల్లీ-ఎన్సీఆర్లో ఏకంగా 12% వార్షిక వృద్ధి నమోదైంది.
7 శాతం పెరిగిన ఇళ్ల ధరలు.. దిల్లీ-ఎన్సీఆర్లో భారీ వృద్ధి
దేశంలోని ప్రధాన నగరాల్లో ఇళ్ల ధరలు మరోసారి పెరిగాయి. హైదరాబాద్, బెంగళూరు, ముంబయి మెట్రోపాలిటన్ రీజియన్, దిల్లీ-ఎన్సీఆర్, పుణె, చెన్నై, కోల్‌కతా నగరాల్లో జులై–సెప్టెంబరు త్రైమాసికంలో నివాస గృహాల ధరలు సగటున 7 శాతం పెరిగాయి. వీటిలో దిల్లీ-ఎన్సీఆర్ మార్కెట్ అత్యధికంగా 12 శాతం వార్షిక వృద్ధిని నమోదు చేసింది.
స్థిరాస్తి సేవల సంస్థ అనరాక్ నివేదిక ప్రకారం.. గతేడాది ఇదే త్రైమాసికంలో ఏడు ప్రధాన నగరాల్లో ఇళ్ల సగటు ధర చదరపు అడుగుకు రూ.9,105గా ఉండగా, ఈ ఏడాది జులై–సెప్టెంబరు నాటికి అది రూ.9,714కు చేరింది. దిల్లీ-ఎన్సీఆర్లో గతేడాది మూడో త్రైమాసికంలో చదరపు అడుగు ధర రూ.8,900గా ఉండగా, ఈ ఏడాది అదే కాలంలో రూ.9,980కి పెరిగింది.
నిర్మాణ వ్యయాల పెరుగుదల ప్రభావం
కరోనా తర్వాత భూముల ధరలతో పాటు సిమెంట్, స్టీల్ వంటి ముడిసరకులు, ఇతర నిర్మాణ వ్యయాలు పెరగడం ఇళ్ల ధరలపై ప్రభావం చూపిందని అనరాక్ వైస్ ఛైర్మన్ సంతోష్ కుమార్ తెలిపారు. ముఖ్యంగా దిల్లీ-ఎన్సీఆర్ పరిధిలోని నోయిడా, గ్రేటర్ నోయిడా, గురుగ్రామ్‌లో భూముల ధరలు భారీగా పెరిగాయని చెప్పారు. పట్టణాభివృద్ధి సంస్థలు నిర్వహించిన భూముల వేలాల్లోనూ ఈ పెరుగుదల స్పష్టంగా కనిపించిందని పేర్కొన్నారు.
లగ్జరీ ఇళ్లకు పెరుగుతున్న డిమాండ్
ప్రస్తుతం స్థిరాస్తి డెవలపర్లు ప్రీమియం, లగ్జరీ, అల్ట్రా-లగ్జరీ ప్రాజెక్టులపై ఎక్కువగా దృష్టి సారిస్తున్నారని సంతోష్ కుమార్ తెలిపారు. దీంతో ఆయా విభాగాల్లో ఇళ్ల ధరలు మరింత పెరుగుతున్నాయని వివరించారు.
ప్రపంచ ఆర్థిక పరిస్థితుల్లో మార్పులు ఉన్నప్పటికీ సెప్టెంబరు త్రైమాసికంలో నివాస స్థిరాస్తి మార్కెట్ మంచి పనితీరు కనబరిచిందని ఆల్ఫా కార్ప్ డెవలప్మెంట్ సీఈఓ, డైరెక్టర్ ఆశిష్ సరీన్ అన్నారు. కొనుగోలుదారులు ఇళ్లను కేవలం పెట్టుబడి సాధనంగా కాకుండా, తమ దీర్ఘకాలిక అవసరంగా చూస్తున్నారని తెలిపారు. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లో గృహాలకు డిమాండ్ కొనసాగుతోందని పేర్కొన్నారు.




