Passport Fees Hike: పాస్‌పోర్ట్ కావాలంటే ఇక జేబుకు చిల్లు..!

Passport Fees Hike: విదేశాలకు వెళ్లాలని ప్లాన్ చేసుకుంటున్న భారతీయ పౌరులకు కేంద్ర ప్రభుత్వం గట్టి షాక్ ఇచ్చింది. దేశంలో పాస్‌పోర్ట్ జారీకి సంబంధించిన వివిధ సేవల రుసుములను భారీగా పెంచుతున్నట్లు

G Krishna
Updated on: 25 Jun 2026 9:30 PM IST
Passport Fees Hike
X

Passport Fees Hike: పాస్‌పోర్ట్ కావాలంటే ఇక జేబుకు చిల్లు..!

Passport Fees Hike: విదేశాలకు వెళ్లాలని ప్లాన్ చేసుకుంటున్న భారతీయ పౌరులకు కేంద్ర ప్రభుత్వం గట్టి షాక్ ఇచ్చింది. దేశంలో పాస్‌పోర్ట్ జారీకి సంబంధించిన వివిధ సేవల రుసుములను భారీగా పెంచుతున్నట్లు కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ కీలక ప్రకటన చేసింది.

సవరించిన సరికొత్త పాస్‌పోర్ట్ నిబంధనల ప్రకారం, ఈ పెంచిన కొత్త ఫీజులు జూలై 1, 2026 నుండి దేశవ్యాప్తంగా అమలులోకి రానున్నాయి. ఈ నిర్ణయంతో సాధారణ, తత్కాల్ కేటగిరీలతో పాటు పాస్‌పోర్ట్ సేవలకు సంబంధించిన అన్ని రకాల రుసుములు కూడా పెరగనున్నాయి.

కేంద్ర ప్రభుత్వం పాస్‌పోర్ట్ ఫీజులను చివరిసారిగా 2012వ సంవత్సరంలో సవరించింది. ఆ తర్వాత మళ్లీ ఇప్పటివరకు రుసుములలో ఎలాంటి మార్పులు చేయలేదు. దాదాపు 14 సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత కేంద్రం ఈ సారి ఏకంగా ఫీజులను భారీగా పెంచడం గమనార్హం.

కొత్త , పునఃజారీ ఫీజుల వివరాలు

ప్రభుత్వ అధికారిక నోటిఫికేషన్ ప్రకారం, సాధారణంగా ఎక్కువ మంది ఉపయోగించే 36 పేజీల పాస్‌పోర్ట్ కోసం సాధారణ రుసుమును రూ. 1,500 నుండి రూ. 2,500కు పెంచారు. దీనివల్ల దరఖాస్తుదారులు ఇకపై అదనంగా రూ. 1,000 చెల్లించాల్సి ఉంటుంది.

అంతేకాకుండా, ఒక వ్యక్తి అత్యవసరంగా తత్కాల్ సేవ కింద పాస్‌పోర్ట్ పొందాలనుకుంటే, వారు ఇప్పుడు రూ. 3,500కు బదులుగా రూ. 5,000 చెల్లించాల్సి ఉంటుంది. ఈ కేటగిరీకి రుసుమును రూ. 1,500 మేర పెంచారు. తరచుగా అంతర్జాతీయ ప్రయాణాలు చేసే వారు ఉపయోగించే 60 పేజీల జంబో పాస్‌పోర్ట్‌ల ఫీజులు కూడా ఇదే రీతిలో పెరిగాయి.

దీని సాధారణ దరఖాస్తు ఫీజు రూ. 2,000 నుండి రూ. 3,500కు పెరగ్గా, అత్యవసర తత్కాల్ దరఖాస్తు ఫీజు రూ. 4,000 నుండి ఏకంగా రూ. 6,000కు పెరిగింది.

పాస్‌పోర్ట్ పోగొట్టుకుంటే జరిమానాలు మరింత భారం

ఒకవేళ అజాగ్రత్త వల్ల పాస్‌పోర్ట్ పోయినా , పూర్తిగా దెబ్బతిన్నా, వాటి స్థానంలో కొత్త రీప్లేస్‌మెంట్ పాస్‌పోర్ట్ పొందడం ఇకపై మరింత భారం కానుంది. ఇందులో భాగంగా 36 పేజీల రీప్లేస్‌మెంట్ పాస్‌పోర్ట్‌కు సాధారణ కేటగిరీలో రూ. 5,000, తత్కాల్‌లో రూ. 7,500 గా ధర నిర్ణయించారు.

అలాగే 60 పేజీల రీప్లేస్‌మెంట్ పాస్‌పోర్ట్‌కు వరుసగా రూ. 6,000 , రూ. 8,500 వసూలు చేయనున్నారు. అయితే ఫీజులు భారీగా పెరిగినప్పటికీ, 8 సంవత్సరాల లోపు వయసున్న చిన్న పిల్లలకు, అలాగే 60 ఏళ్లు దాటిన వృద్ధులకు ప్రస్తుతం అమలులో ఉన్న 10 శాతం ఫీజు రాయితీని ప్రభుత్వం మున్ముందు కూడా కొనసాగించనుంది.

ప్రభుత్వం ప్రకటించిన ఈ కొత్త నిబంధనలు జూలై 1 నుంచి అమల్లోకి వస్తున్నందున, పాత రేట్లకే పాస్‌పోర్టు పొందాలనుకునే వారు జూన్ 30, 2026 లోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. జూలై 1 నుంచి కొత్త ఫీజుల విధానం పూర్తిగా అమలులోకి వస్తుంది.

G Krishna

G Krishna

అక్షరంతో మొదలైన ప్రయాణం.. అంకెల్లో చెప్పాలంటే పదేళ్ల అనుభవం..! 2015లో కెరీర్ స్టార్ట్ చేసి, ప్రింట్ మీడియా నుంచి డిజిటల్ విప్లవం వరకు అన్నిటినీ దగ్గరగా చూశాను. అంతర్జాతీయ పరిణామాల నుంచి దేశ రాజధాని రాజకీయాల వరకు, గల్లీ స్థాయి వార్తల నుంచి ఢిల్లీ స్థాయి విశ్లేషణల వరకు ప్రతి అంశాన్ని లోతుగా అధ్యయనం చేస్తూ కథనాలు అందించాను. టెక్నాలజీ స్పీడ్, బిజినెస్ లెక్కలైనా, ఆస్ట్రాలజీ విశ్లేషణ ఏదైనా.. నా నుంచి వచ్చే ప్రతి కథనం ప్రతి వార్త పాఠకుడికి ఇన్ఫర్మేషన్‌తో పాటు ఇంట్రెస్ట్‌ను కూడా అందిస్తుంది.

Next Story