Domestic Flight Charges: విమాన ఛార్జీలపై పరిమితులు ఎత్తివేసిన ప్రభుత్వం
Domestic Flight Charges: దేశీయ విమాన ఛార్జీలపై ఉన్న గరిష్ట పరిమితిని కేంద్ర ప్రభుత్వం ఎత్తివేసింది. విమాన సంస్థలు డిమాండ్‌ను బట్టి ధరలు పెంచుకోవచ్చు.
Domestic Flight Charges: సీట్ల డిమాండ్‌ను బట్టి విమానయాన సంస్థలు ఇకపై దేశీయ విమాన ఛార్జీలను పెంచుకోగలవు. పౌర విమానయాన మంత్రిత్వ శాఖ విమాన ఛార్జీలపై ఉన్న నిబంధనలను ఎత్తివేసింది. ఈ నిర్ణయం మార్చి 23వ తేదీ నుంచి అమల్లోకి వస్తుంది.
ఇండిగో విమానాలకు అంతరాయాలు ఏర్పడటంతో గత డిసెంబర్‌లో ఛార్జీలపై పరిమితిని విధించారు. ప్రభుత్వం విమానయాన సంస్థలకు గరిష్ట ఛార్జీల పరిమితిని ₹18,000గా నిర్ణయించింది. అంతకంటే ఎక్కువ వసూలు చేయడానికి అనుమతి లేదు. అయితే, ఇప్పుడు పరిస్థితి చక్కపడడంతో ఆ నిబంధన ఎత్తివేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది.
విమాన ప్రయాణాల సామర్ధ్యం ఇప్పుడు సాధారణ స్థితికి వచ్చింది. ఒడిదుడుకులు లేకుండా సాఫీగా ఉంది. దీనిపై సమీక్ష జరిపిన తరువాత మర్చి 23, 2026 నుంచి చార్జీలపై ఉన్న పరిమితిని తీసివేయాలని నిర్ణయించినట్టు ప్రభుత్వ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
ఇండిగో సంక్షోభంతో..
నిజానికి, గత సంవత్సరం, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) నవంబర్ 1వ తేదీ నుండి అమల్లోకి వచ్చేలా పైలట్లు, ఇతర సిబ్బంది సభ్యుల పని నిబంధనలను సవరించింది. దీనిని ఫ్లైట్ డ్యూటీ టైమ్ లిమిటేషన్అంటారు. ఇది ఇండిగోలో సిబ్బంది కొరతకు దారితీసి, వేలాది విమానాలు రద్దు కావడానికి కారణమైంది. ఈ సంక్షోభాన్ని ఆసరాగా తీసుకుని, డిమాండ్ ను క్యాష్ చేసుకోవడానికి ఇతర సంస్థలు ప్రయత్నించాయి. దేశీయంగా విమాన ఛార్జీలు 50 వేల రూపాయల వరకూ పెంచేశారు. దేంతో పరిస్థితిని అదుపు చేయడానికి పౌర విమాన శాఖ కఠిన నిబంధనలు అమలు లోకి తెచ్చింది. దేశీయ విమానా చార్జీల పై పరిమితి విధించింది. ఇది 18 వేల మించకూడదని ఉత్తర్వులు ఇచ్చింది. ఇప్పుడు ఆ ఉత్తర్వులను ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకున్నారు.
పర్యవేక్షణ కొనసాగుతుంది..
ధరల నిర్ణయం విషయంలో విమానయాన సంస్థలు క్రమశిక్షణ పాటించాలని, బాధ్యతాయుతంగా వ్యవహరించాలని మంత్రిత్వ శాఖ తన ఉత్తర్వులో పేర్కొంది. ఛార్జీలు సహేతుకంగా, పారదర్శకంగా, మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా ఉండేలా, ప్రయాణికుల ప్రయోజనాలకు ఎటువంటి ప్రతికూల ప్రభావం కలగకుండా విమానయాన సంస్థలు నిర్ధారించుకోవాలని మంత్రిత్వ శాఖ తెలిపింది.
ఛార్జీలలో ఏదైనా అధిక లేదా అసమంజసమైన పెంపును తీవ్రంగా పరిగణిస్తామని మంత్రిత్వ శాఖ తెలిపింది. మంత్రిత్వ శాఖ రియల్ టైమ్ లో విమాన ఛార్జీల పరిస్థితులను పర్యవేక్షిస్తోందని ఆ ఉత్తర్వులో పేర్కొన్నారు.




